కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రక్షిత మంచినీటిని అందించే బోర్ల దుస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు... సీపీడబ్ల్యుఎస్, పీడబ్ల్యుఎస్ పథకాల్లో విద్యుత్ మోటార్లు మోరాయించినప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు సమీపంలోని చేతి పంపులపైనే ఆధారపడుతున్నారు. కుళాయిల ద్వారా నీరు తక్కువగా వస్తున్నప్పుడు ఈ బోర్లే దిక్కవుతున్నాయి. ఇలాంటి చేతి పంపుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనేక గ్రామాల్లో బోర్లు ఉన్నా అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పాడైపోయిన వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో హ్యాండిల్స్, ఇతర పరికరాలు చోరికి గురయ్యాయి.
జిల్లాలో మొత్తం 13,451 చేతి పంపులు ఉండగా.. 1,031 మాత్రమే పాడయ్యాయని, మిగిలినవన్నీ పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే పాడైపోయిన బోర్ల సంఖ్య దాదాపు 3 వేల పైచిలుకేనని తెలుస్తోంది. ఎలాంటి రక్షిత మంచినీటి పథకాలు లేని గ్రామాల్లో పాడైపోయిన చేతిపంపులను కూడా అధికారులు మరమ్మత్తు చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు సమీపంలోని వ్యవసాయ బావులు, బోర్లపై ఆధారపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి కోడుమూరు మండలం పులకుర్తి మజరా గ్రామమైన మెరుగుదొడ్డి గ్రామంలో నెలకొంది. గ్రామంలో నాలుగు చేతి పంపులు ఉన్నా ఒక్కటీ పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.
నెలల తరబడి మరమ్మతులు కరువు
ఆదోని మండలం చిన్న హరివాణం, నాగులాపురం శ్మశానవాటికల సమీపంలోని చేతి పంపులు చెడిపోయి నెలలు గడుస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. పాండవగళ్లు గ్రామంలోని ఆరు బోర్లలో ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. సంతెకుళ్లూరు, మదిరె, దిబ్బనకల్లు గ్రామాల్లోనూ పలు బోర్లు పనిచేయడం లేదు. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని బురాన్‌దొడ్డి, సి.బెళగల్, చనుగొండ్ల, మల్లాపురం, బూడిదపాడు, గార్గేయపురం, శివరామపురం, గూడురు ప్రాంతాల్లో బోర్లు పనిచేయక నెలలు గడుస్తున్నా అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి.
నందవరం మండలం టి.సోమలగూడురు, బాపురం, రాయచోటి, గురజాల, గోనెగండ్ల మండలంలోని గోనెగండ్ల, గంజహళ్లి, హెచ్ కైరవాడి, ఐరన్‌బండ గ్రామాల్లోను, హాలహర్వి మండలం గూళ్యం, సిద్దాపురం, అమృతాపురం తదితర గ్రామాల్లోని చేతి పంపులను మరమ్మతు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకపోతోంది. దేవనకొండ మండలంలోని మొత్తం 456 చేతి పంపుల్లో 128 మాత్రమే పని చేస్తున్నాయి.
బోరు.. బేజారు
Published Thu, Dec 12 2013 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement