hand pumps
-
చేతి పంపునుంచి నీటికి బదులుగా మద్యం: షాకైన పోలీసులు
సాధారణంగా చేతి పంపు నుంచి నీరు రావడం అనేది అందరికీ తెలుసు. ఒక్కోసారి అవి మెరాయించడం కూడా నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఉన్నట్టుండి చేతి పంపు నుంచి నీళ్లకు బదులు మద్యం వస్తే ఎలా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఇలానే జరిగింది. చేతిపంపు నుంచి మద్యం వస్తుండటంతో తొలుత అందరూ షాక్‌కు గురయ్యారు. కానీ ఆ తరువాత అసలు విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు. మీడియా కథనం ప్రకారం రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ పెద్దఎత్తున మద్యం తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందింది. అయితే ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా ఎక్సైజ్ బృందానికి ఏమీ దొరకలేదు. అయితే చేతి పంపు నుంచి నీటికి బదులుగా మద్యం వస్తోందన్న వార్త ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ పోలీసులు మద్యం స్మగ్లింగ్‌కు కొత్త ఫార్ములా తెలుసుకుని షాక్ అయ్యారు. అధికారుల ముందే దాన్ని ఆపరేట్ చేయగా మద్యం బయటకు రావడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విషయం ఏమిటంటే ఆ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పెద్ద ఎత్తున మద్యం తయారు చేసి విక్రయిస్తోంది. పట్టు బడతామనే భయంతో మద్యం ట్యాంక్‌ను భూమిలో పాతి పెట్టినట్టు సమాచారం. అందులోంచి హ్యాండ్ పంపు ద్వారా మద్యాన్ని విక్రయిస్తోంది. చివరికి విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ శాఖ బుల్డోజర్లతో భూగర్భ ట్యాంకును ధ్వంసం చేసింది. ఝాన్సీలో ఇలాంటి ఘటన నమోదు కావడం ఇదే మొదటిసారికాదు. 2020 సెప్టెంబరులో వేలకొలదీ లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఇలాంటి సంఘటనే గతంలో మధ్య ప్రదేశ్‌లో కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. झांसी में शराब तस्करो ने शराब तस्करी का निकाला नया फॉर्मूला, पुलिस को शक ना हो तो घर में जमींन के नीचे टैंक बनाकर उस पर ऊपर हैंडपम लगा दिया और हैंडपंप को चलाने से पानी की जगह शराब बाहर निकलती है मुखबिर की सुचना पर पुलिस ने रेड मारकर पकड़ी लाखो लीटर नकली शराब#JhansiPolice #jhansi pic.twitter.com/MJXMajjRsY — Arjun Chaudharyy (@Arjunpchaudhary) November 7, 2023 -
చేతి పంపు నుంచి బకెట్ల కొద్ది మద్యం.. ఎక్కడో తెలుసా?
భోపాల్: ఎక్కడైనా చేతి పంపు కొడితే తాగు నీరు రావడం సహజమే. కానీ చేతి పంపులో నుంచి మద్యం రావటం ఎప్పుడైనా చూశారా? అవునండీ.. అది నిజమే. మధ్యప్రదేశ్ గునా జిల్లాలోని భన్‌పుర అనే గ్రామంలో చేతి పంపు కొట్టగానే అందులోంచి మద్యం వచ్చింది. నాటుసారా తయారు చేసే ముఠా మెదడులోంచి పుట్టిన ఆలోచన ఇది. నాటుసారా తయారీపై సమాచారం మేరకు గునా జిల్లాలోని భన్‌పుర గ్రామ పరిసరాల్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో కనిపించిన ఈ దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామ శివారులోని ఇళ్లకు కొద్ది దూరంలో నాటుసారా నింపిన డ్రమ్ములను భూమిలోపల పాతిపెట్టారు. వాటికి పైపును అమర్చడం ద్వారా నేల పైన చేతి పంపును ఏర్పాటు చేశారు. దాన్ని చేత్తో కొడుతూ క్యాన్లలో మద్యాన్ని నింపి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఇటీవల దాడి చేసిన పోలీసులు సారా మాఫియా అతి తెలివి చూసి నివ్వెరపోయారు. అక్కడ దాదాపు ప్రతి ఇంటిలోనూ నాటుసారా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రమ్ముల కొద్దీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ‘ భూమిలో దాచిపెట్టిన నాటుసారా డ్రమ్ములకు చేతి పంపు ఏర్పాటు చేశారు. పోలీసులు చేతిపంపును కొట్టడంతో నాటుసారా పైకి వచ్చింది. లిక్కర్‌ను తీసుకునేందుకు వారు చేతిపంపును ఉపయోగిస్తున్నారు. దానిని ప్లాస్టిక్ క్యాన్లు, కవర్లలో నింపి డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు.’ అని గునా ఎస్పీ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. शराब माफिया का दिमाग हैंडपम्प से निकली शराब गुना के भानपुरा का मामला #Guna #HandPump #Viral #Trending pic.twitter.com/eRm8H1t1wN — LALIT K PRAJAPATI (@prajapatilalit) October 11, 2022 ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
Viral Video: చేతిపంపు నుంచి మంటలు, ఆ వెంటనే నీరు.. జనం పరుగో పరుగు!
ప్రకృతిలో వింతలు, విడ్డూరాలకు కొదవుండదు. అప్పటిదాకా మామూలుగానే ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా పూర్తి భిన్నంగా మారిపోతుంటాయి. అంతా తమకు తెలిసే జరుగుతుందనుకునే మనిషి ఆ ఊహించని ఘటనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బుక్సువా బ్లాక్, కచ్చర్ గ్రామస్తులకు అలాంటి వింతైన అనుభవమొకటి కలిగింది. చేతిపంపులో నుంచి ఒక్కసారిగా భారీ మంటలు ఆ వెంటనే నీళ్లు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు పరుగులు పెట్టారు. అలా చాలా సేపు కొనసాగడంతో ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు కొందరు. దీంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: స్టూడెంట్ రిపోర్టింగ్‌కు సోనూసూద్ ఫిదా.. నీ కోసం కొత్త స్కూల్ రెడీ అంటూ..) బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగుచూసింది. నమ్మశక్యంగాని ఘటనతో స్థానికులు ఎవరికి వారు ఊహించుకున్నారు. తమ కళ్లను అస్సలు నమ్మలేక పోతున్నామని కొందరు అంటుండగా.. కెమికల్ లీక్ వల్లే ఇలా జరిగిందని మరికొందరు చెప్తున్నారు. ఈనేపథ్యంలో స్థానిక నేతలు కొందరు చత్తర్‌పూర్ జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు భూమి లోపలి పొరల్లోంచి మీథేన్ వాయువు వెలువడటంతో మంటలు చెలరేగాయని తెలిపారు. భోపాల్ ప్రభుత్వ సైన్స్ కాలేజీకి చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. బుక్సువా ప్రాంతంలోని భూమి పొరల్లో వృక్ష, జంతు వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగుపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈక్రమంలోనే రసాయన చర్య కారణంగా మీథేన్ వాయువు మండుతూ పైకి చొచ్చుకొచ్చిందని, దాంతోపాటు నీరు కూడా పైకి ఎగజిమ్మిందని చెప్పుకొచ్చారు. (చదవండి: అంబులెన్స్ రాలేదు.. జేసీబీతో గర్భిణి ఆస్పత్రికి తరలింపు: వీడియో వైరల్) Hand pump spewing fire and water in Kachhar village, Buxwaha,Villagers have informed the concerned officials.Local administration is sending a team to spot#madhyapradesh pic.twitter.com/8M4c7HfRQN — Siraj Noorani (@sirajnoorani) August 25, 2022 -
కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య
కామారెడ్డి క్రైం: కుళాయి దగ్గర జరిగిన గొడవ ఒకరి హత్యకు కారణమైంది. కామారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన పులి గంగాధర్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నిజామాబాద్ లో, రెండవ భార్య రాజమణి కామారెడ్డిలోని వేణుగోపాలస్వామి రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటారు. మొదటి భార్య కొడుకైన రవికుమార్(40) ఏ పనీ లేకపోవడంతో రెండేళ్లుగా కామారెడ్డిలోని తన పిన్ని దగ్గరే ఉంటున్నాడు. అయితే గతంలోనే రవికి గీత అనే మహిళతో పెళ్లికాగా, ఇద్దరు కొడుకులున్నారు. పనిచేయడానికి ఇష్ట పడకపోవడంతో భార్య గీత పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితం తండ్రి గంగాధర్ రెండో భార్య వద్దకు వచ్చి అక్కడ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటున్న రవిని బయటకు గెంటేశాడు. అప్పటి నుంచి రాంమందిర్‌రోడ్ శివాలయం ప్రాంతంలో తిరుగుతూ ఎవరైనా పనిచెబితే చేసుకుంటూ రాత్రి గుడి అరుగులపై పడుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామాలయం ఎదురుగా ఉన్న ఓ వ్యాపార సముదాయం అరుగుపై నిద్రించా డు. అర్ధరాత్రి దాటాక రవి తలపై గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో బలం గా మోదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. నిందితుడు రిక్షా పుల్లర్ అడ్డగారి పాండుగా గుర్తించారు. నీళ్ల కుళాయి వద్ద మంచినీళ్లు పట్టుకునే విషయంలో గొడవ జరగడంతో కక్ష పెంచుకుని ఈ హత్య చేసినట్లు పాండు విచారణలో అంగీకరించాడు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన డీఎస్పీ సోమనాథం పట్టణ ఎస్హెచ్ఓ నరేశ్, ఎస్సైలు అహ్మద్, రాములు, సిబ్బంది మల్లేశ్‌గౌడ్, సయిద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. -
నీటికోసం ఏనుగు.. ‘మనమూ నేర్చుకుందాం’
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతూ మంచినీటి కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. మరోవైపు మానవ సమాజం అంతులేని నిర్లక్ష్యం. వెరసి అడవి జంతువులకు ప్రాణసంకటంగా మారుతోంది. చుక్క మంచినీరు దొరకడం కష్టంగా మారింది. అయినా మనుషులు నీటి వృధాపై దృష్టిపెట్టడంలేదు. ఈ విషయంలో నోరులేని జీవులు చాలా నయం అనిపిస్తోంది. ఈ విషయాన్ని జల సంరక్షణ మంత్రిత్వ శాఖ తాజా వీడియో ద్వారా తెలియజేసింది. చదవండి: World Elephant Day 2021: ఏనుగమ్మ నీటి సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఉన్న ఈ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అందరినీ ఆలోపించేజేసేదిలా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ట్యాప్‌ను సరిగ్గా తిప్పకుండా వదిలేసే కొంతమందితో పోలిస్తే ఈ గజరాజు చాలా మేలంటున్నారు. ఒక ఏనుగు చేతి పంపుతో స్వయంగా నీటిని పంపింగ్ చేసి తాగుతోంది. దాహం వేసినప్పుడు సమీపంలోని సరస్సు లేదా చెరువు వంటి సహజ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం ఎంతో విచారకరం. అయితే ప్రతి నీటి బొట్టును ప్రాముఖ్యతను గుర్తించిన ఆ ఏనుగు తన దాహం తీర్చడానికి సరిపోయేంత నీటిని మాత్రమే పంప్ చేస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించిన తీరు విశేషంగా నిలిచింది. "ఏనుగు కూడా ప్రతీ నీటి చుక్క ప్రాముఖ్యతను ఆకళింపు చేసుకుంది. కానీ మనుషులుగా మనం ఈ అమూల్యమైన వనరును ఎందుకు వృధా చేస్తున్నాం, ”అంటూ జల సంరక్షణ మంత్రిత్వ శాఖ ఈ వీడియోను ట్వీట్ చేసింది. ఇకనైనా మనం పాఠాలు నేర్చుకుని నీటిని కాపాడుకుందాం అని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. एक हाथी भी #जल की एक-एक #बूंद का महत्व समझता है। फिर हम इंसान क्यों इस अनमोल रत्न को व्यर्थ करते हैं? आइए, आज इस जानवर से सीख लें और #जल_संरक्षण करें। pic.twitter.com/EhmSLyhtOI — Ministry of Jal Shakti 🇮🇳 #AmritMahotsav (@MoJSDoWRRDGR) September 3, 2021 -
పానీపాట్లు..
చింతలమానెపల్లి(సిర్పూర్): పల్లె ప్రజల గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. అందులోనూ మహిళల అవస్థలు వర్ణానాతీతం. ఆ గ్రామంలో తాగునీటి ఇక్కట్లకు ఈ చిత్రాలే నిదర్శనం. చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నీరు కలుషితంగా మారగా.. తాగేందుకు వినియోగించలేని పరిస్థితి. దీనికి తోడు గ్రామంలో చేతి పంపుల చుట్టూ మురుగు నీరు నిలిచి ఉండడంతో వాటినీ ఉపయోగించడం లేదు. దీంతో కొత్తవాడ, కమ్మరివాడ, సాత్పుతె వాడ ప్రజలు స్థానిక ఉన్నత పాఠశాలలోని చేతిపంపునీటిని తాగునీటిగా వినియోగిస్తున్నారు. కాగా పాఠశాలకు వేసవి సెలవుల కారణంగా గేటుకు తాళం వేయడంతో మహిళలు ఇలా గోడ దూకి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బోరుమంటున్నాయ్..
♦ జిల్లాలో 11,664 చేతి పంపులు ♦ ఇందులో పాతిక శాతం కూడా పని చేయని వైనం ♦ మరమ్మతులకు నిధులున్నా పట్టించుకునే వారు కరువు కడప ఎడ్యుకేషన్ : ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో బావులు ఎండిపోయాయి. బోరు బావులు మరమ్మతులకు గురయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు ఆర్భాటంగా ప్రకటనలైతే చేస్తున్నారు కానీ ఆచరణలో అది వాస్తవం కాదని స్పష్టమవుతోంది. చిన్న చిన్న మరమ్మతులు చేపడితే చాలా చోట్ల ప్రజలకు తాగు నీటిని అందించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు. జిల్లాలో 11,664 చేతి బోర్లు ఉండగా వాటిలో పాతిక శాతం కూడా పని చేయడం లేదు. పదేళ్లుగా వీటి గురించి పట్టించుకునే నాథుడే లేడు. గ్రామీణ నీటి సరఫరా పథకం కింద చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా పైప్లైన్లు వేసి ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నారు. ఇళ్లలోకే కుళాయిల ద్వారా నేరుగా నీరు వస్తుండటంతో చేతి పంపులకు ఆదరణ కరువైంది. కుళాయిల కంటే చేతి పంపుల నీరే సురక్షితం అని తెలిసినా వీటి గురించి ఎవరూ శ్రద్ధ వహించడం లేదు. వేసవి తీవ్రత పెరగడంతో ప్రస్తుతం చాలా గ్రామాల్లో రక్షిత మంచి నీటి పథకాలు పడకేశాయి. ఈ స్థితిలో చేతి పంపులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని జిల్లాకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే చేతి బోర్ల పరిస్థితిపై వివరాలు తెప్పించుకుని వాటిని వాడకం లోనికి తీసుకొచ్చేందుకు నడుం బిగిస్తే నీటి సమస్యను కొంత మేరకు అధిగమించే అవకాశం ఉంది. -
గొంతెండుతోంది..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండే ఎండల్లో ప్రజలకు గుక్కెడు నీరు దొరకడం లేదు. పల్లెల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. వేసవి తాపంతో విలవిల్లాడుతున్న గ్రామాల దాహార్తిని తీర్చే నాథుడే కరువయ్యాడు.పట్టణాలు, గ్రామాలు, గిరిజన తండాలు ఇలా ఒకటేమిటి.. జిల్లాలో ఎక్కడ చూసినా నీటి ఎద్దడితో ప్రజలు విలవిలలాడుతున్నారు. జిల్లాలో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. మంచినీటి బావులు ఎండిపోయాయి. 600 అడుగులకు పైగా లోతు వేస్తే గానీ బోర్లలో నీరు రాని పరిస్థితి. జిల్లాలో మూడింట రెండొంతులకు పైగా చేతి పంపులు ఎండిపోయాయి. మిగిలిన వాటిలో సగం చెడిపోయి మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిని బాగు చేసే నాథుడే లేడు. ఇక ఉన్నవాటిలో కూడా నీరు అంతంతమాత్రంగానే వస్తోంది. ఏటా వేసవి కాలం ముందు గ్రామీణ నీటి సరఫరా అధికారులు నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌ను ఈ ఏడాది పట్టించుకోలేదు. జిల్లాలో సగానికి పైగా గ్రామీణ మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. నిర్మాణంలో ఉన్న ట్యాంకులను పూర్తి చేసి అందుబాటులోకి తేలేదు. కరెంటు కోతలు నీటి ఎద్దడి సమస్యకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కరెంటు సరఫరా లేని కారణంగా బోర్లు నడవడం లేదు. ఊర్లోని బోర్లు అడుగంటడంతో వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్న గ్రామీణ వాసులను అక్కడా కరెంటు కోతలు వెక్కిరిస్తున్నాయి. త్రీ ఫేజ్ కంరెంటు వస్తే గానీ వ్యవసాయ బోర్లలో నీరు లభించదు. దీంతో పనీపాటా మాని కరెంటు ఎప్పుడొస్తుందోనని పొలాల్లో పడిగాపులు కాయాల్సిన దుర్భర స్థితి. కిలోమీటర్ల మేర నడిచి పోయి చెలమలు, వాగుల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. గ్రామాల్లో సైతం ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు రాజ్యమేలుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నీటి వ్యాపారులు అధిక ధరలకు నీరు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లో మంచినీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చెడిపోయిన చేతిపంపులు, ట్యాంకర్లను మరమ్మతులు చేయించాలని వేడుకుంటున్నారు. -
బోరు.. బేజారు
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రక్షిత మంచినీటిని అందించే బోర్ల దుస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు... సీపీడబ్ల్యుఎస్, పీడబ్ల్యుఎస్ పథకాల్లో విద్యుత్ మోటార్లు మోరాయించినప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు సమీపంలోని చేతి పంపులపైనే ఆధారపడుతున్నారు. కుళాయిల ద్వారా నీరు తక్కువగా వస్తున్నప్పుడు ఈ బోర్లే దిక్కవుతున్నాయి. ఇలాంటి చేతి పంపుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనేక గ్రామాల్లో బోర్లు ఉన్నా అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పాడైపోయిన వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో హ్యాండిల్స్, ఇతర పరికరాలు చోరికి గురయ్యాయి. జిల్లాలో మొత్తం 13,451 చేతి పంపులు ఉండగా.. 1,031 మాత్రమే పాడయ్యాయని, మిగిలినవన్నీ పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే పాడైపోయిన బోర్ల సంఖ్య దాదాపు 3 వేల పైచిలుకేనని తెలుస్తోంది. ఎలాంటి రక్షిత మంచినీటి పథకాలు లేని గ్రామాల్లో పాడైపోయిన చేతిపంపులను కూడా అధికారులు మరమ్మత్తు చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు సమీపంలోని వ్యవసాయ బావులు, బోర్లపై ఆధారపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి కోడుమూరు మండలం పులకుర్తి మజరా గ్రామమైన మెరుగుదొడ్డి గ్రామంలో నెలకొంది. గ్రామంలో నాలుగు చేతి పంపులు ఉన్నా ఒక్కటీ పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. నెలల తరబడి మరమ్మతులు కరువు ఆదోని మండలం చిన్న హరివాణం, నాగులాపురం శ్మశానవాటికల సమీపంలోని చేతి పంపులు చెడిపోయి నెలలు గడుస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. పాండవగళ్లు గ్రామంలోని ఆరు బోర్లలో ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. సంతెకుళ్లూరు, మదిరె, దిబ్బనకల్లు గ్రామాల్లోనూ పలు బోర్లు పనిచేయడం లేదు. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని బురాన్‌దొడ్డి, సి.బెళగల్, చనుగొండ్ల, మల్లాపురం, బూడిదపాడు, గార్గేయపురం, శివరామపురం, గూడురు ప్రాంతాల్లో బోర్లు పనిచేయక నెలలు గడుస్తున్నా అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి. నందవరం మండలం టి.సోమలగూడురు, బాపురం, రాయచోటి, గురజాల, గోనెగండ్ల మండలంలోని గోనెగండ్ల, గంజహళ్లి, హెచ్ కైరవాడి, ఐరన్‌బండ గ్రామాల్లోను, హాలహర్వి మండలం గూళ్యం, సిద్దాపురం, అమృతాపురం తదితర గ్రామాల్లోని చేతి పంపులను మరమ్మతు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకపోతోంది. దేవనకొండ మండలంలోని మొత్తం 456 చేతి పంపుల్లో 128 మాత్రమే పని చేస్తున్నాయి.