అన్ని వర్గాలకు మేలు
ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వల్ల అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. రైతులు ఆరుగాలం శ్రమించినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేటప్పుడు గిట్టుబాటు ధర లభించడం లేదు. అవే ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం వ్యాపారులు భారీగా ధరలను పెంచి సొమ్ము చేసుకుంటున్నారు.
ఇటీవల రైతులకు పెట్టుబడి రాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. శీతల గిడ్డంగుల్లో వ్యవసాయోత్పత్తులను నిల్వచేసి కృత్రిమ కొరతను సృష్టించడం ద్వారా దళారులు, మధ్యవర్తులు లాభాలను ఆర్జిస్తున్నారు. ఉదాహరణకు చింతపల్లి పరిసరాల్లో పండే రాజ్‌మా చిక్కుళ్లను కిలో రూ.2 నుంచి రూ.10లకు రైతుల వద్ద వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వీటినే మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. ఇటు రైతులకు శ్రమకు తగ్గ ఫలితం లేకపోగా, అటు దళారులు/ వ్యాపారులు మాత్రం ఎటువంటి శ్రమ లేకుండానే భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం వల్ల ఈ పరిస్థితిని తొలగించవచ్చు.
మార్కెట్‌లో దళారుల మితిమీరిన జోక్యాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. రైతుల పంట ఉత్పత్తులకు తగిన ధరను చెల్లించడం సాధ్యపడుతుంది. కృత్రిమ కొరతను, విక్రయ సంక్షోభాన్ని సృష్టించే పరిస్థితులను నియంత్రించడం వల్ల అన్నదాతలకు రక్షణ ఉంటుంది. వారితో పాటు సామాన్య ప్రజలకూ మేలు జరుగుతుంది. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం.
- ఎం. శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్,
మార్టేరు వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల, విశాఖపట్నం జిల్లా
ధరల స్థిరీకరణ నిధి వరం
వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం రైతులకు వరం. దీంతో పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మార్కెట్‌లో విత్తనానికి ముందు ఒక ధర, పంటలు పండి ధాన్యం చేతికొచ్చే సమయానికి మరో ధర ఉండటంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. సరైన ధరలేక ధాన్యాన్నంతా దళారుల చేతిలో పెట్టాల్సి వస్తోంది. స్థిరీకరణ నిధితో పంటలకు గిట్టుబాటు ధర వచ్చి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని అమ్ముకునేందుకు వీలుంటుంది. సకాలంలో ధాన్యం అమ్ముడుబోవడం వల్ల రైతులకు అన్నివిధాలా లాభం చేకూరుతుంది.
- పేరా ప్రసాదరెడ్డి, రైతు, కోవెలకుంట్ల(కర్నూలు జిల్లా)
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఏర్పాటు చేయనున్న ‘ధరల స్థిరీకరణ నిధి’ అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మది నుంచి పుట్టుకొచ్చిన ఈ ఆలోచన ఉన్నతమైనదని ప్రశంసిస్తున్నారు.
జనం మాట
Published Sun, Apr 6 2014 11:30 PM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement