పునరావాస చర్యలు వేగవంతం: ఏపీ ప్రభుత్వం
విశాఖపట్నం: హుదూద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అందుకోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
అందులోభాగంగా ప్రత్యేక వైద్య బృందాలను సదరు జిల్లాలకు తరలించినట్లు వెల్లడించింది. అదనంగా 10 అంబులెన్సులు, 100 వైద్య బృందాలతో గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలూ వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించింది. అలాగే విద్యుత్, టెలిఫోన్ లైన్ల పునరుద్దరణకు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.