శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రతిపాదిత కోస్టల్ కారిడార్‌కు శ్రీకాకుళం జిల్లాలో భూసేకరణకు రంగం సిద్ధమైంది. ఈ కారిడార్ పరిధిలోకి వచ్చే పైడిభీమవరం క్లస్టర్‌లో అవసరమైన భూములను ఇప్పటికే అధికారులు గుర్తించి స్కెచ్ సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం-చెన్నై కోస్టల్ కారిడార్‌ను కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో పైడిభీమవరం క్లస్టర్ కింద జిల్లాలోని రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల మండలాలను చేర్చారు.
శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ మూడు మండలాల్లో ఆర్డీవో బి.దయానిధి ఇప్పటికే పర్యటించి అవసరమైన భూములను గుర్తించారు. 24 గ్రామాల పరిధిలో సుమారు 5627 ఏకరాలు కోస్టల్ కారిడార్‌కు అనువైనవని నిర్థారించారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు, గుర్తించిన భూముల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఉన్నాయి. అవసరమైతే గతంలో పేద రైతులకు ఇచ్చిన డీ పట్టా భూములను తిరిగి తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వనున్నప్పటికీ.. అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
పరిశీలించిన భూములు
ఈ ముడు మండలాల్లో ప్రభుత్వ డీ పట్టా భూములు 1746.14 ఎకరాలు, అక్రమణల్లో ఉన్నవి 70.57 ఎకరాలు, ప్రైవేటు భూములు 3576.94 ఎకరాలు కలిపి మొత్తం 5627.40 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. దీని వల్ల సుమారుగా 8081 మంది రైతులు భూములు కోల్పోనున్నారు. వీరిలో లావేరు మండలంలో 3696 మంది, ఎచ్చెర్ల మండలంలో 1693 మంది, రణస్థలం మండలంలో 2692 మంది రైతులు ఉన్నారు.
గుర్తించిన గ్రామాలు ఇవే..
కారిడార్ కోసం రణస్థలం మండలంలో పది గ్రామాలు.. సంచాం, డీపీవలస, చిట్టివలస, వరిశాం, నెలివాడ, పిషిణి, వెంకటరావు పేట, వల్లభరావుపేట, ఉప్పినివలస, రావాడ, ఎచ్చెర్ల మండలంలో ఏడు గ్రామాలు.. కొయ్యాం, ధర్మవరం, అజ్జరాం, భగీర థపురం, ఎస్‌ఎంపురం, ఎం.అగ్రహారం, కుప్పిలి, లావేరు మండలం ఏడు గ్రామాలు.. కొండకుంకాం, పాతకుంకాం, లావేరు, జీజీవలస, తామాడ, బుడలతవలస, బెజ్జిపురం ఉన్నాయి.
కారిడార్ భూసేకరణకు స్కెచ్
Published Wed, Jan 21 2015 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM
Advertisement