శ్రీకాకుళం జిల్లాలో సాగర సంగమ మహోదయ ఘడియలు ప్రారంభమయ్యాయి. దీంతో సాగర స్నానాల కోసం భక్తులు బారులు తీరారు. 33 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహోదయ ఘడియలలో సాగర స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ప్రతీతి.
గుప్త కాశీగా గుర్తింపు పొందిన బారువ తీరంలోఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ సోమవారం ఉదయం హారతినిచ్చి పుణ్యస్నానాలు ప్రారంభించారు. దీంతో భక్తులు వేలాదిగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, ఛత్తిస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
పుణ్యస్నానాలలో అపశ్రుతి...
మహోదయ పుణ్యస్నానాలలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్నానమాచరించడానికి వచ్చిన మహిళ పడవ ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం రూరల్ మండలం పెదగనగళ్లపేట గ్రామంలో పుణ్య స్నానాల అనంతరం ప్రమీల అనే మహిళ పడవ పై సముద్ర షికారుకు వెళ్లింది. ఆ సమయంలో అలలు ఎగిసి పడటంతో పడవ పల్టీకొట్టి నీట మునిగి మృతిచెందింది. ఇది గుర్తించిన జాలర్లు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు.