మహోదయ ఏర్పాట్లు మహా దారుణం | Huge Devotees at Mahodaya Punya Snanam in Srikakulam | Sakshi
Sakshi News home page

మహోదయ ఏర్పాట్లు మహా దారుణం

Published Tue, Feb 9 2016 3:30 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

మహోదయ ఏర్పాట్లు మహా దారుణం

మహోదయ ఏర్పాట్లు మహా దారుణం

ఇది ఒక మహా మహోదయం. దివ్య సాగర జలాల్లో భక్తజన తరంగాలు ఉప్పొంగాయి. మూడు దశాబ్దాల తర్వాత కోటి పుష్కరాలు పుణ్యపేటిక అరుదెంచిన అరుదైన ఘట్టం ఈ మహోదయం. పవిత్ర ఘడియల్లో మహేంద్రతనయ..వంశధార..నాగావళి నదులు సాగరంలో సంగమించే స్థలాల్లో లక్షలాదిగా భక్తులు పుణ్యస్నానాలు చేసి పునీతులయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం చీకటిపడేవరకూ తీరాలన్నీ భక్తజన సంద్రమయ్యాయి. బారువ తీరానికి ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. జనమంతా తీరానికి బారులు తీరడంతో అధికారయంత్రాంగం ఉక్కిరిబిక్కిరయింది.

కనీస సౌకర్యాలు కూడా కల్పించలేక చేతులెత్తేసింది. ఇంతగా భక్తులు తరలివస్తారని ముందస్తు అంచనా వేయడంలో విఫలమయింది. ప్రభుత్వం గోదావరి పుష్కరాలపై చూపిన శ్రద్ధలో రవ్వంతైనా చూపలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. చివరి క్షణాల్లో సర్కారు విదిల్చిన నిధులు కంటితుడుపే. మొత్తం మీద స్నానానికి వచ్చిన భక్తులను అధికారుల వైఫల్యం అగచాట్లలో ముంచింది.
 
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సోంపేట/గార : జిల్లాలో మహోదయ పుణ్యస్నానాలకు జనం పోటెత్తారు. సోమవారం తెల్లవారుజామునుంచే దారులన్నీ తీరం వైపు నడిచాయి. దీంతో ఆరు తీరాలు భక్తులతో కిటకిటలాడాయి. అయితే జనం నుంచి వచ్చి న స్పందనకు దీటుగా సదుపాయాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమయింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలనుంచి నదీ సాగర సంగమ స్థలానికి పుణ్యస్నానానికి వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో విఫలమయ్యారు.

మహోదయానికి 15 రోజుల ముందే అధికారులు ప్రణాళికలు వేశారు. ప్రభుత్వం నుంచి కేవలం రూ.10లక్షలే విడుదలయింది. అదీ సంక్రాంతి సంబరాల మిగుల్లో. అడ్వాన్సులే అంటూ మిగతా ఖర్చుల్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపైనే భారం వేసేశారు. టెక్కలి, శ్రీకాకుళం ఆర్డీవోలకు చెరో రూ.5లక్షలతో సరిపెట్టేశారు. దీంతో తీరంలోని ఏర్పాట్లు ఘోరంగా ఉన్నాయి. భక్తులు ఉసూరుమన్నారు.
 
బారువ, కె.మత్స్యలేశాల్లో సాధారణ బల్బులు, ట్యూబ్‌లైట్లతోనే సరిపెట్టేశారు. సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే మంచిదంటూ పండితులు చెప్పడంతో భక్తులు ఉత్సాహంగా వచ్చారు. చీకటి వేళ లైటింగ్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.
* లక్షలాది మంది హాజరైన బుడ్డీ (మహోదయం) కార్యక్రమంలో కనీసం దుస్తులు మార్చుకునే గదులకూ భక్తులు నోచుకోలేకపోయారు.బారువలోదుస్తులు మార్చుకునే ఏర్పా ట్లు అరకొరే. పాతదిబ్బలపాలెంలో తీరానికి దూరంగా గదులేర్పాటు చేయడంతో భక్తులకు ఆ సౌకర్యమే తెలియలేదు.
 
* తీరంలో భక్తులు స్నానం అనంతరం కాలి నడకనే కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వచ్చింది. కనీసం మంచినీళ్ల ఏర్పాటులోనూ అధికార యంత్రాంగం విఫలమైంది. పిల్లలు, వృద్ధులు ఇక్కట్లపాలయ్యారు.

* ఆహార పంపిణీలోనూ స్వచ్చంద సంస్థలే భాగస్వాములయ్యాయి. స్థానిక పౌరులే పోలీసులయ్యారు. బారువలో వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
* పాత దిబ్బలపాలెంలో నాగావళి నది సంగమం వద్ద స్థానిక యువతే దిక్కయింది. బస్సులు వేసినా ప్రయోజనం లేకపోయింది.
 కి.మీ మేర నడిపించారు
 
* కళింగపట్నం తీరానికి లక్షలాది మంది హాజరైనా పోలీసుల సంఖ్య మాత్రం 60కే పరిమితమైంది. అర్థరాత్రి వేళ జనం వచ్చినా విద్యుత్ సరఫరాకూ ఇబ్బందయింది.
 బారువలో కొర్లాం జంక్షన్ వద్ద వేలాది వాహనాలు రావడంతో ఇక్కట్లు మొదలయ్యాయి.
 
* పలాస టోల్‌గేట్ వద్ద గంటల పాటు భారీ వాహనాల్ని ఆపేశారు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఎస్పీతో మాట్లాడడంతో సమస్య సద్దుమణిగింది.
 
* కొర్లాం రైల్వే గేటు విషయంలో అప్రమత్తం కాకపోవడంతో భక్తులు ఇక్కట్లపాలయ్యారు. భారీ ఎత్తున జనం వస్తున్నా గేటు తీసేందుకు నిర్లక్ష్యం వహించారని తెలిసింది.
 
* బారువలో 1000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించినా ఓ దశలో భక్తుల్ని నియంత్రించలేకపోయారు. తీరానికి ఉన్న దారుల్ని తెరిపించడంలో వివిధ విభాగాల అధికారుల మధ్య సమన్వయం కొరవడింది.
 
* పోలాకి సమీపంలోని రాజరామపురంలో గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.
 
* దిబ్బలపాలెంలో నాలుగు కి.మీ మేర భక్తులు నడవాల్సివచ్చింది.
 
* కళింగపట్నంలో వన్‌వే అన్నా అది అమల్లోకి రాలేదు. తాగునీరు లేక భక్తులు ఇక్కట్లు పడ్డారు. గార సెంటర్ నుంచి తీరం వరకు సుమారు 10కి.మీ మేర భక్తులు నీరసంతో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
 
* పెదగనగళ్లపేట వద్ద భద్రతాచర్యలు లోపించాయి.
 పొలం గట్టే రోడ్లు గారలోని ఒమరవల్లి స్కూల్ నుంచి కళింగపట్నం రోడ్డుకు వెళ్లే దారిలో కనీస ఏర్పాట్లు జరగలేదు.గంటల కొలదీ వాహనాలు నిలిచిపోయినా నియంత్రించేవారే కరువయ్యారు. వాహనాల్ని రోడ్డుపక్కన ఆపేసి పొలంగట్ల ద్వారా తీరానికి చేరుకోవాల్సివచ్చింది. లైట్‌హౌస్ వద్ద పార్కింగ్ సౌకర్యం పెట్టినా అక్కడకు వెళ్లేందుకు కూడా వీలుకుదరలేదు. మార్గమధ్యంలో వృద్ధులు, పిల్లలకు తాగునీరు కూడా లేకపోయింది. జిల్లా కలెక్టర్ ఆ మార్గం గుండా వెళ్లడంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
 
కనీస సౌకర్యాలు లేవు
సరయిన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాం. సుమారు 6 కిలోమీటర్లు దూరం నడిచి రావడంతో కాళ్ళు ముందుకు సాగడం లేదు. తిరిగి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. భయం వేస్తుంది.
- జామి ఎల్లయ్య, నరసన్నపేట
 
వస్త్రాలు మార్చుకోడానికి మరుగేదీ..
బారువలో సముద్ర స్నానాలు ఆచరించిన తర్వాత వస్త్రాలు మార్చుకోవడానికి కనీస సదుపాయాలు ఏర్పరచలేదు. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు.          
- ఎల్.మణి, విజయనగరం
 
ఇలాగేనా సదుపాయాలు...
ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇతర రాష్ట్రాల భక్తులకు ప్రత్యేక సదుపాయాలు ఉండి ఉంటే బాగుండేది.
- ఎన్.సతీష్ కుమార్, టాటానగర్, జార్ఖండ్
 
చాలా దూరం నడిచాం..
బారువ తీరానికి చాలా దూరం నడవ వలసి వచ్చింది.  భక్తులకు కనీ స సౌకర్యాలు కరువయ్యాయి. మం చినీరుకూడా దొరకడం కష్టం అయ్యింది.  
 - అనిత, బరంపురం
 
ఆహారం కోసం అవస్థలు
ఒరిస్సా నుంచి వచ్చాం. ఇక్కడ ఆహారం దొరకడం కష్టంఅయ్యింది. డబ్బులు ఇస్తామన్నా దొరకలేదు. చాలా ఇబ్బంది పడ్డాం. మాలాంటి వృద్దుల కష్టాలు అన్నీ ఇన్నీకావు.
- తూరు బెహారా, ఒడిశా
 
అంచనాకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేవు
లక్షల మంది వస్తారని చెప్పినా పట్టించుకోకపోవడంతో ఏర్పాట్లు జరగలేదు. తాగునీరు సమస్యతో పాటు ట్రాఫిక్ అంతరాయంతో వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు.
- బత్తుల గోవిందరావు, కె. మత్స్యలేశం
 
అధికారుల వైఫల్యమే
తమ్మినేని సీతారాం ధ్వజం
శ్రీకాకుళం అర్బన్: మహోదయం ఏర్పాట్ల వైఫల్యంపై జిల్లా యంత్రాంగం బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఇబ్బందులు వస్తే పోలీసులు ఏం చేస్తున్నారన్నారు. ఇద్దరు మృతి చెందితే అధికారులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

భక్తులు తమకు కలిగిన ఇబ్బందులను తన దృష్టికి తీసుకొచ్చారని, ఇదే విషయం చర్చించేందుకు ఫోన్ చేసినా కలెక్టర్ స్పందించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు చంద్రబాబునాయుడు వస్తే అడుగులకు మడుగులొత్తే యంత్రాంగం లక్షలాది మంది ప్రజలు హాజరైన మహోదయం కార్యక్రమంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

భక్తులకు కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారని,పారిశుధ్యం దారుణంగాఉందని, దుస్తులు మార్చుకునేందుకు గదులు కూడా లేవన్నారు. ప్రభుత్వ అధికారులు కనిపించకుండా పోయారని, భక్తులు కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చిందన్నారు. ఇంత జరుగుతున్నా తెలుగుదేశం నాయకులకు చీమ కుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement