లక్ష్మీపురం ఆలయంలో శ్రీనివాసుడు, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను తాకిన సూర్యకిరణాలు
సాక్షి, ద్వారకాతిరుమల: సాయం సంధ్య వేళ.. సూర్య భగవానుని కిరణాలు గర్భాలయంలో కొలువైన శ్రీనివాసుని అపాదమస్తకం స్ప్రుశించే శుభసమయంలో.. వీక్షించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగారు. ప్రతి ఏటా చైత్ర మాసం ముందు రోజుల్లో సాక్షాత్కరించే ఈ అరుదైన ఘట్టం పురాతన దేవాలయమై, శ్రీవారి క్షేత్ర ఉపాలయంగా విరాజిల్లుతోన్న లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఆవిష్కృతమైంది. ఎక్కడా ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ ఇలా సూర్యకిరణాలు నేరుగా స్వామి, అమ్మవార్లను తాకడం ఒక విశిష్టతగా చెప్పొచ్చు.
ఎంతో లోపలికి ఉండే ఈ ఆలయంలోని స్వామివారి గర్భాలయంలోకి సైతం నేరుగా సూర్యకిరణాలు ప్రవేశించి శ్రీవారిని అణువణువు అర్చించి వెళ్తాయి. ఆలయం ముందు చెట్లు, ధ్వజస్తంభం, పందిళ్లు ఉన్నా వాటిని తప్పించుకుని మరీ లోపలకు వచ్చి స్వామివారిని అర్చించడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం ముందు రోజుల్లో, వరుసగా మూడు రోజులు సాయంత్రం సూర్యాస్తమయ సమయాన్న అద్భుత కాంతులతో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ముఖం మీద నుంచి నెమ్మదిగా కిందకు దిగుతూ పాదాల వరకు అర్చించుతాయి.
ఇలా అణువణువు అర్చిస్తూ దిగిన ఈ సూర్యకిరణాలు స్వామివారి పాదాల వద్ద ఉన్న ఉత్సవ మూర్తులను తాకి అనంతరం సూర్యకిరణం రెండుగా చీలి ఇరుపక్కలా ఉన్న పద్మావతి, ఆండాళ్ అమ్మవార్ల ఆలయంలోకి ప్రవేశించి అమ్మవార్లను అర్చిస్తాయి. ఏడాదిలో ఈ వింత మూడు రోజులు మాత్రమే జరగడం ఇక్కడి విశిష్టత. ఈ కిరణాలను చూసేందుకు ఈ మూడు రోజులు భక్తులు ఆసక్తిగా ఆలయానికి తరలివస్తారు. బుధవారం కూడా ఈ కిరణాలు పడే అవకాశం ఉందని ఆలయ అర్చకులు గోపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment