devotional place
-
Telangana Temple Photos: ఈ ప్రముఖ దేవాలయాలు మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
'నామకరణం' గురించి శాస్త్రంలో ఉన్న నిజాలు - అపోహలు
-
దేవుని భూములను కొందరు కబ్జా.. చట్టారీత్యా నేరం..
కరీంనగర్: ధూప..దీప.. నైవేద్యం.. ఆలయాల పరిరక్షణకు దాతలు వితరణ చేసిన భూములను పర్యవేక్షించడంలో దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో ఆలయ భూములు పరాధీనమవుతున్నాయి. ‘రాజుల సొమ్ము రాళ్లపాలు.. దేవుడి సొమ్ము దేశదిమ్మరుల పాలు’ అన్న చందంగా మారింది. దేవుడి సొమ్మే కదా అని తేరగా కబ్జాలకు పాల్పడుతుండడంతో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయి. అధికారుల అలసత్వంతో ఇప్పటికే కొన్నిచోట్ల లీజుదారుల కబంధహస్తాల్లో భూమి చిక్కుకుపోయింది. భూములపై నిర్దిష్ట సమాచారం లేకపోవడం, సర్వే చేపట్టకపోవడంతో భూబకాసురుల చెర నుంచి విముక్తి చేయలేక కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో 85 ఆలయాల పరిధిలో 1,089.34 ఎకరాలు ఉండగా.. అందులో 15 నుంచి 20 శాతం భూములు ఆక్రమణలో ఉన్నట్లు సమాచారం. దేవాదాయ భూములకు సంబంధించి ఎక్కడికక్కడ హెచ్చరికబోర్డులు లేకపోవడం, వందల ఏళ్ల కిందటి భూములు కావడంతో రక్షణ కరువైంది. కాలక్రమేణా వీటి ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పెద్దపల్లి నుంచి ఓ ప్రజాప్రతినిధే అక్రమంగా దేవాదాయ భూములు పట్టా చేయించుకున్నాడని హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో జిల్లాలో దేవాదాయ భూముల పరిరక్షణపై చర్చ నడుస్తోంది. నేత, బంధువుల పేరిట పట్టాలు.. దేవుడి భూములు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే వాటికి ఎసరు పెడుతున్నారు. పెద్దపల్లి మండలంలోని పాలితం, బొంపల్లి, కనగర్తి, కాసులపల్లి, ధర్మాబాద్ గ్రామాల్లో 462.33 ఎకరాలు రంగనాయకుల స్వామి భూములు ఉన్నాయి. ఈ భూములను లీజుకు తీసుకొని ఏళ్లుగా పేదరైతులు సాగు చేసుకుంటూ.. ప్రభుత్వానికి కాస్తు(లీజు) డబ్బులు చెల్లించేవారు. తాజాగా ధరణి పోర్టల్ వచ్చాక రెవెన్యూ రికార్డుల్లో ఆలయం పేరుకు బదులు కొందరు రైతులు పేర్లు ఎక్కించుకున్నారు. అందులో ప్రజాప్రతినిధి, వారి కుటుంబసభ్యులు సైతం ఉన్నారు. ధరణి పోర్టల్‌లో పలువురు రైతులతోపాటు ఆ నాయకుడి కుటుంబ సభ్యుల పేరిట పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. అయినా వాటిని ఇంకా దేవాదాయశాఖ భూములుగానే చూపెడుతుండడం గమనార్హం. పాసుపుస్తకాలు జారీకావడంతో సదరు ఆక్రమణదారులు రైతుబంధు పొందుతున్నారు. ఆ ఆలయ భూములను పరిరక్షించాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్షక్ జాపతి రాజేశ్‌పటేల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు సదరు నాయకుడితో సహా పలువురు రైతులకు, ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీచేసింది. ఎన్నికల అఫిడవిట్లో వ్యవసాయ భూములుగా.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సదరు నాయకుడు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన పేరిట ఉన్న భూముల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో కాసులపల్లిలో తనకు వ్యవసాయ భూమి ఉన్నట్లు చూపించారు. సదరు భూమి ధరణి పోర్టల్‌లో చూస్తే ఆ నేత పేరు చూపుతూనే.. అవి దేవాదాయశాఖ భూములుగా చూపుతుండడం గమనార్హం. ఇంకా ఆ సర్వే నంబర్లలోని భూములకు నాయకుడు రైతుబంధు తీసుకుంటుండగా, ప్రస్తుతం పొజిషన్లో ఆ సర్వేనంబర్లలో నాయకుడికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాల కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీంతో ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించడంతోపాటు అర్హత లేకున్నా రైతుబంధు పొందుతుండడంపై వివిధ రాజకీయ పక్షాల నేతలు మండిపడుతున్నారు. స్థానిక అధికారులపై రాజకీయ ఒత్తిళ్లతోనే చర్యలు చేపట్టడం లేదని కోర్టుల ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. పేర్లు ఎక్కిస్తామని డబ్బుల వసూలు.. రంగనాయకులస్వామి పరిధిలోని భూములను కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వారిలో చిన్న, సన్నకారు రైతులు, భూస్వాములు, రాజకీయనేతలు ఉన్నారు. ధరణి పోర్టల్ వచ్చాక పలువురు నేతలు భూములను రైతుల పేరిట ఎక్కిస్తామని ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. ఆ సొమ్ముతో కొందరు మాత్రమే తమ పేరిట భూములను ధరణిలో ఎక్కించుకోగా.. మిగతా సాధారణ చిన్న, సన్నకారు రైతులు మోసపోయారు. స్థానిక బడా నేత, ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరు విజయవంతంగా ధరణిలో పేరు ఎక్కించుకోవడంతో వారికి రైతుబంధు అందుతుండడం విశేషం. ధరణిలో ఎండోమెంట్ భూములు అని చూపుతున్నా ప్రభుత్వం రైతుబంధు చెల్లిస్తుండడం గమనించాల్సిన విషయం. రెండేళ్ల కిందే ప్రభుత్వానికి నివేదించాం.. పాలితం గ్రామంలోని రంగనాయకుల స్వామికి చెందిన దాదాపు 400 ఎకరాలకుపైగా భూములు అన్యాక్రాంతమయ్యాయని గతంలోనే నివేదిక ఇచ్చాం. చాలా ఏళ్ల కింద స్థానికులు దేవుని మాన్యం భూములను సాగుపేరిట లీజుకు తీసుకున్నారు. వారిలో కొందరు అక్రమార్గంలో పట్టాలు పొందారు. అక్రమంగా రైతుబంధు కూడా పొందుతున్నారు. ఈ విషయాన్ని 2021లోనే పెద్దపల్లి కలెక్టర్‌కు, ప్రభుత్వానికి నివేదిక పంపాం. మా దేవాదాయశాఖ కమిషనర్ కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. వారికి వెంటనే రైతుబంధు నిలిపివేయాలని నివేదికలో పొందుపరిచాం. – ఏసీ చంద్రశేఖర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. దేవాదాయ భూములను ఇతరులకు విక్రయించడం, వాటిని కొనుగోలు చేయటం చట్టరీత్యా నేరం. రాజకీయ పలుకుబడి కలిగిన నేత, అతని బంధువులు మాత్రమే పట్టాలు చేయించుకున్నారు. నిజంగా సాగు చేసుకునే పేద, సన్నకారు రైతుల పేర్ల మీద పట్టాలు జారీకాలేదు. చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సాగుచేసుకోకుండా అందులో వ్యాపారాలు చేసుకునే వారి భూములను ప్రభుత్వం స్వాఽధీనం చేసుకొని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. దీనిపై పలుసార్లు అధికారులను కలిసినా రాజకీయ ఒత్తిళ్లతో ఎవరూ పట్టించుకోవడం లేదు. – సత్యనారాయణరెడ్డి, న్యాయవాది -
భగవాన్ రమణమహర్షి
‘‘నువ్వేమిటో తెలుసుకోకుండా, జగత్తును తెలుసుకోవాలనుకుంటే, అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది. ముందు నీ మనస్సుని చదువు. తర్వాత జగత్తును చూడు. అప్పుడు ప్రపంచమే ఆత్మ అవుతుంది. నీకు అవగతమవుతుంది’’అంటారు భగవాన్ రమణ మహర్షి. భగవదన్వేషణలో ఎన్నెన్నో ప్రశ్నలతో రమణాశ్రమం చేరినవారికి ఆశ్చర్యకరంగా భగవానుల శక్తిమంతమైన మౌనంలోనే సంశయ నివారణ అయ్యేది. ఆయన మౌనమే వారికి మహాజ్ఞానబోధ. రమణుల సమస్త ఉపదేశసారం ఏమంటే ‘‘నిన్ను నీవు తెలుసుకో’’. నీకేది కావాలో ఆయనకు తెలుసు శివదర్శనం కోసం తహతహలాడుతున్న భక్తురాలిని చూచి భక్తిని గురించి వివరించారు రమణులు. ‘‘భగవంతుడిని శరణు వేడు. ఆయన ఇష్టానికి తలవంచు. నీ ఇష్టమొచ్చినట్లు ఆయన నడుచుకోవాలనుకోవడం శరణాగతి కాదు. నీకు ఎప్పుడు, ఏది, ఎలా చెయ్యాలో ఆయనకే బాగా తెలుసు. ఈ విషయంలో నీకిక బాధ్యతలే ఉండవు. అన్ని బాధ్యతలూ ఆయనవే. ఇదే అసలైన శరణాగతి. ఆ పరమాత్మ పేరే ‘నేను’. అన్నిటా వ్యాపించిన ఆ భావనతో కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు. ప్రేమ, వికాసం, అనురాగం కలిగివుండటం నిజమైన భక్తుని లక్షణం‘. పరిమితులను దాటడమే పరిత్యాగం తన ఉద్యోగానికి రాజీనామా చేసి, నిరంతరం మహర్షి సాన్నిధ్యంలో ఉండాలనే తలంపుతో ఉన్న భక్తుడికి భగవాన్ ఒకనాడు కర్తవ్యాన్ని ఉపదేశించారు. ‘భగవాన్ ఎప్పుడూ మీతోనే, మీలోనే వున్నారు. ఈ విషయం బోధపడటానికి నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేయనవసరం లేదు. నీ బాధ్యతలనుండి తప్పుకోనక్కరలేదు. సమస్త భారాల్ని మోసే భగవంతునితో రాజీపడు. కోరికలను, మోహాలను విడిచిపెట్టు. అప్పుడు సమస్త ప్రపంచాన్ని ప్రేమించగలుగుతావు’’ వ్యక్తులనేగాదు... పశుపక్ష్యాదులను సైతం గౌరవంగా సంబోధిస్తూ వాటిపై తమ అనుగ్రహాన్ని ప్రసరింపజేసిన రమణులు అనవసరపు ఆడంబరాలను నిరాకరించి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తన నడవడికతో చూపించారు. అందుకే వారి ఆధ్యాత్మిక శక్తివిలాసం ఈనాటికీ ఉజ్జ్వలంగా భాసిస్తోంది. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
శ్రీనివాసుని తాకిన రవికిరణాలు
సాక్షి, ద్వారకాతిరుమల: సాయం సంధ్య వేళ.. సూర్య భగవానుని కిరణాలు గర్భాలయంలో కొలువైన శ్రీనివాసుని అపాదమస్తకం స్ప్రుశించే శుభసమయంలో.. వీక్షించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగారు. ప్రతి ఏటా చైత్ర మాసం ముందు రోజుల్లో సాక్షాత్కరించే ఈ అరుదైన ఘట్టం పురాతన దేవాలయమై, శ్రీవారి క్షేత్ర ఉపాలయంగా విరాజిల్లుతోన్న లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఆవిష్కృతమైంది. ఎక్కడా ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ ఇలా సూర్యకిరణాలు నేరుగా స్వామి, అమ్మవార్లను తాకడం ఒక విశిష్టతగా చెప్పొచ్చు. ఎంతో లోపలికి ఉండే ఈ ఆలయంలోని స్వామివారి గర్భాలయంలోకి సైతం నేరుగా సూర్యకిరణాలు ప్రవేశించి శ్రీవారిని అణువణువు అర్చించి వెళ్తాయి. ఆలయం ముందు చెట్లు, ధ్వజస్తంభం, పందిళ్లు ఉన్నా వాటిని తప్పించుకుని మరీ లోపలకు వచ్చి స్వామివారిని అర్చించడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం ముందు రోజుల్లో, వరుసగా మూడు రోజులు సాయంత్రం సూర్యాస్తమయ సమయాన్న అద్భుత కాంతులతో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ముఖం మీద నుంచి నెమ్మదిగా కిందకు దిగుతూ పాదాల వరకు అర్చించుతాయి. ఇలా అణువణువు అర్చిస్తూ దిగిన ఈ సూర్యకిరణాలు స్వామివారి పాదాల వద్ద ఉన్న ఉత్సవ మూర్తులను తాకి అనంతరం సూర్యకిరణం రెండుగా చీలి ఇరుపక్కలా ఉన్న పద్మావతి, ఆండాళ్ అమ్మవార్ల ఆలయంలోకి ప్రవేశించి అమ్మవార్లను అర్చిస్తాయి. ఏడాదిలో ఈ వింత మూడు రోజులు మాత్రమే జరగడం ఇక్కడి విశిష్టత. ఈ కిరణాలను చూసేందుకు ఈ మూడు రోజులు భక్తులు ఆసక్తిగా ఆలయానికి తరలివస్తారు. బుధవారం కూడా ఈ కిరణాలు పడే అవకాశం ఉందని ఆలయ అర్చకులు గోపీ తెలిపారు. -
ఆధ్యాత్మిక క్షేత్రం.. సిద్ధుల గుట్ట
ఆర్మూర్: ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఒకదానితో ఒకటి పేర్చినట్లుగా నల్లని రాళ్లతో విస్తరించి ఉండి చారిత్రాత్మకమైన ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటోంది ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్ట. సహజసిద్ధంగా ఏర్పడిన గుట్టపై సువిశాలమైన స్థలంలో ప్రకృతి రమణీయతతో నిర్మించిన ఆలయాలు, ప్రకృతి వింతలు చూపరులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టపై ప్రకృతి రమణీయత చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తే.. పురాతన కాలంలోని మహర్షులు నిర్మించిన మందిరాలు ఆధ్యాత్మిక శోభను హృదయానికి హత్తుకునే వాతావరణాన్ని ఏర్పరిచాయి. ఎక్కడ ఉంది ? ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర ఈ సిద్ధులగుట్ట విస్తరించి ఉంది. గుట్ట చుట్టూ ప్రజలు నివాసాలను ఏర్పరుచుకున్నారు. గుట్టకు ఉత్తరం వైపున పట్టణంలోని గోల్ బంగ్లా సమీపంలో నుంచి గుట్టపైకి కాలి నడకన వెళ్లడానికి మెట్ల మార్గం ఉంది. అయితే భక్తుల సౌకర్యార్థం సుమారు 20 ఏళ్ల క్రితం అప్పటి సర్పంచ్ రాంచందర్ హండే గుట్టను ఆనుకొని వెళ్లే 63వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకొని గుట్టపైకి ఘాట్ రోడ్డు మార్గాన్ని నిర్మించారు. ఆయన సంకల్పంతో సీసీ రోడ్డుతో ఘాట్ రోడ్డు నిర్మాణం జరిగింది. నవనాథపురం నుంచి ఆర్మూర్‌గా.. వందల ఏళ్ల క్రితం దేశం నలుమూలల నుంచి నవనథులైన గోరఖ్‌నాథ్, జలంధర్‌నాథ్, చరఫట్‌నాథ్, అపభంగనాథ్, కానీషనాథ్, మచ్చీంద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్, బర్తరినాథ్గుట్టపై ఉన్న ఒక ఇరుకైన గుహలో తన ఇష్టదైవమైన సిద్ధేశ్వరున్ని ప్రతిష్టించి పూజలు చేశారని ప్రతీతి. వారి పేరిట గుట్టకు సిద్ధుల గుట్టగా పేరు పడింది. ఈ నవనాథుల పేరునే గుట్టను ఆనుకొని ఉన్న గ్రామానికి నవనాథపురంగా నామకరణంచేయబడింది. కాలక్రమంలో ఈ తొమ్మిది మంది స్వాములలో ఆరుగురు ఇక్కడి నుంచి వెళ్లిపోగా ముగ్గురు ఇక్కడే ఉండి పూజలు చేయడంతో ఆరు.. మూరు.. అంటూ కాలక్రమంలో ఆర్మూర్‌గా పేరును స్థిరపర్చుకుంది. మరికొందరు పెద్దలు ఆర్మూర్ అనే పదం ఆరావం అనే పదం నుంచి వచ్చిందని చెబుతుంటారు. గుట్టపై విశ్రాంతికి అనువైన వాతావరణం ఉన్నందున గుట్టను ఆనుకొని ఏర్పడిన గ్రామాన్ని ఆర్మూర్ అనే పేరుతో పిలవడం ప్రారంభించినట్లు చెప్పుకుంటారు. ఎవరెలా వాదించినా ఆర్మూర్ పట్టణానికి సిద్ధులగుట్ట ఆధ్యాత్మిక కేంద్రంగా ల్యాండ్ మార్క్‌గా మారిందని చెప్పుకోవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు సిద్ధుల గుట్టను పవిత్రమైన ప్రాంతంగా గుర్తించిన ఆర్మూర్ పట్టణానికి చెందిన ఏనుగు శేఖర్‌రెడ్డి, భారత్ గ్యాస్ సుమన్, పీసీ గంగారెడ్డి, కిషన్ల ఆధ్వర్యంలో గుట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ మొదటి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈ గుట్టను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో అభివృద్ధి నిధులు మంజూరు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఆర్మూర్ ప్రాంతంలోని అన్ని కుల సంఘాలను భాగస్వాములను చేస్తూ గుట్టపై తొమ్మిది మందిరాలను రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించడానికి కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. అష్టలక్ష్మి దేవి, సహస్త్రార్జున, వినాయక మందిరం, హనుమాన్ మందిరం, మార్కండేయ మందిరం, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మందిరం, వేంకటేశ్వర మందిరం, రాజరాజేశ్వర మందిరం, అయ్యప్ప మందిరం నిర్మాణాలను చేపట్టారు. అందులో అయ్యప్ప మందిర నిర్మాణం పూర్తయింది. గుట్టపై ఉన్న సువిశాల స్థలం చిల్డ్రన్స్ పార్క్, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అనువువగా ఉండడంతో ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయి. చిల్డ్రన్స్ పార్క్‌తో పాటు గోశాలను ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్డు అభివృద్ధికి రూ. నాలుగున్నర కోట్లతో ఇటీవల పనులు ప్రారంభించారు. శివరాత్రికి ముస్తాబవుతున్న గుట్ట పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై ఉన్న శివాలయంలో ప్రతి శివరాత్రిని భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. చలవ పందిళ్లు, టెంట్లు, బారికేడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. వేల సంఖ్యలో భక్తులు శివలింగాన్ని దర్శించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. గుట్టపై విశేషాలు.. నల్లని రాళ్లను ఒకదగ్గర పేర్చి కుప్పగా పోసినట్లు ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన సిద్ధుల గుట్టను పరిశీలిస్తే ఆశ్చర్చం కలగక మానదు. గుట్టపైకి వెళ్లే ఘాట్ రోడ్డు మార్గం ప్రారంభంలో నవనాథుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కింది నుంచి చూస్తే కేవలం రాళ్లు మాత్రమే కనిపించినా గుట్ట పైకి వెళ్లి చూస్తే సువిశాలమైన భూభాగం అక్కడ కనిపిస్తుంది. రాళ్ల మధ్యలో సువిశాలమైన స్థలంలో పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లు నయనానందాన్ని కలిగిస్తాయి. నవనాథులు పూజించిన సిద్ధేశ్వరుని లింగాన్ని రాళ్ల గుహలో నుంచి వెళ్లి దర్శించుకోవడం ఒక చక్కని అనుభూతిగా ఉంటుంది. కాలక్రమంలో పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందడంతో కొన్ని దశాబ్దాల కాలం క్రితమే గుట్టపై శ్రీరాముడి ఆలయం నిర్మించారు. అంత ఎత్తయిన రాళ్ల గుట్టపై నిత్యం నీరుండేలా కోనేరును ఏర్పాటు చేయగా రామాలయం ఎదురుగానే తవ్విన బావిలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం నిత్యం నీళ్లు అందుబాటులో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. గుహల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన పాల గుండం, నీటి గుండం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాతియుగం కాలంలో గుట్టకు దక్షిణం వైపున ఆర్మూర్ పట్టణ ప్రజలకు కనింపిచేలా ఏక శిల స్థూపాన్ని నిర్మించారు. ఈ స్థూపంపై రూపాయి కాయిన్ వేస్తే అది స్థూపంపైనే పడితే మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే ప్రచారం ఉంది. గుట్టపై ఉన్న సువిశాల స్థలంలో ఇక్కడి ఆలయ పూజారులు, స్వాములు పలు కూరగాయలు, పంటలను సైతం పండిస్తుంటారు. గడ్డిని తరలించి పశు సంపదను సైతం పోశిస్తున్నారు. మహా శివరాత్రి, శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. గుట్టపై నుంచి చుట్టూ ఆర్మూర్ పట్టణంతో పాటు చెరువులు, రోడ్లు, పంట పొలాలు స్పష్టంగా కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. సుమారు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్టడం సైతం చూచాయగా కనిపిస్తుంది. సిద్ధుల గుట్ట నుంచి సారంగాపూర్ హనుమాన్ మందిరానికి, ఖిల్లా జైలుకు, జాన్కంపేట నరసింహస్వామి మందిరానికి, బాల్కొండ గుట్టకు సొరంగ మార్గం ఉందని పెద్దలు చిన్నలకు కథలుగా చెబుతుంటారు. గతంలో గుట్టపైకి ఎక్కాలనుకునే వారు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఘాట్ రోడ్డు నిర్మాణం అందుబాటులో ఉండడంతో వాహనాలను సైతం గుట్టపైకి నేరుగా తీసుకువెళుతున్నారు. తెలంగాణలోనే ప్రముఖ క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్‌లోని సిద్ధుల గుట్టను ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన భక్తులు కలిసి వస్తున్నారు. వారందరి సహకారంతో దైవ కార్యాన్ని పూర్తి చేయడానికి పూనుకుంటున్నాం. –ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే భక్తి మార్గంలోనే ప్రశాంతత భక్తి మార్గంలోనే మనుషులకు ప్రశాంత లభిస్తుంది. జీవనోపాధికి ఉద్యోగం చేసుకుంటూ దైవ కార్యాల్లో చురుకుగా పాల్గొంటున్నాం. సిద్ధుల గుట్ట అభివృద్ధిలో భాగస్వాములం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. – భారత్ గ్యాస్ సుమన్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు అసౌకర్యం కలగకుండా.. శివరాత్రి సం దర్భంగా నవనాథ సిద్ధుల గుట్టను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తుల దర్శనం కోసం బారికేడ్లను ఏర్పాటు చేస్తు న్నాం. – పీసీ గంగారెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు, ఆర్మూర్ మహిమగల దేవుడు.. చారిత్రక ప్రాశస్త్యం గల నవనాథ సిద్ధుల గుట్టపై స్వయంభుగా వెలసిన శివుడు మహిమ గల దేవుడిగా కీర్తి గాంచాడు. ఇక్కడ శివుడిని దర్శనం చేసుకున్న వారికి సకల కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ప్రతియేటా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. – కుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు, ఆర్మూర్ అరుదైన అనుభూతి శివరాత్రి పర్వదినాన సిద్ధులగుట్టను దర్శించుకున్న ప్రతి ఒక్కరికీ అరుదైన అనుభూతిగా కలుగుతుంది. ప్రకృతి, దైవత్వం కలగలిపిన ప్రాంతం కావడంతో ఇక్కడ మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతిఒక్కరూ ఈ దైవ కార్యంలో భాగస్వాములు కావాలి. – ఏనుగు శేఖర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ -
జాతరలో అర్ధనగ్న నృత్యాలు
బెంగళూరు(కోలారు) : భక్తిభావం ఉప్పొంగాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు హోరెత్తాయి. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూశారు. ఈఘటన తాలూకాలోని వానరాశి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో వీరళప్ప స్వామి జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా తుమకూరు సంజయ్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే తరుణంలో కొందరు మహిళా డ్యాన్సర్లు ఒంటిపై దుస్తులు తీసేసి అర్ధనగ్నంగా మారి తెలుగు, హిందీపాటలకు నృత్యాలు చేశారు. భక్తితో జాతరకు వస్తే ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వచ్చిందని పలువురు భక్తులు వాపోయారు. పోలీసులు బందోబస్తులో ఉన్నా అశ్లీల నృత్యాలపై ఉదాసీనంగా వ్యవహరించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ దృశ్యాలను పలువురు సెల్ఫోన్లలో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.