ఆధ్యాత్మిక క్షేత్రం.. సిద్ధుల గుట్ట | Special Story On Siddula Gutta In Nizamabad District | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక క్షేత్రం.. సిద్ధుల గుట్ట

Published Sat, Mar 2 2019 12:14 PM | Last Updated on Sat, Mar 2 2019 12:14 PM

Special Story On Siddula Gutta In Nizamabad District - Sakshi

ఆర్మూర్‌: ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఒకదానితో ఒకటి పేర్చినట్లుగా నల్లని రాళ్లతో విస్తరించి ఉండి చారిత్రాత్మకమైన ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటోంది ఆర్మూర్‌ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్ట. సహజసిద్ధంగా ఏర్పడిన గుట్టపై సువిశాలమైన స్థలంలో ప్రకృతి రమణీయతతో నిర్మించిన ఆలయాలు, ప్రకృతి వింతలు చూపరులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టపై ప్రకృతి రమణీయత చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తే.. పురాతన కాలంలోని మహర్షులు నిర్మించిన మందిరాలు ఆధ్యాత్మిక శోభను హృదయానికి హత్తుకునే వాతావరణాన్ని ఏర్పరిచాయి.

ఎక్కడ ఉంది ? 
ఆర్మూర్‌ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర ఈ సిద్ధులగుట్ట విస్తరించి ఉంది. గుట్ట చుట్టూ ప్రజలు నివాసాలను ఏర్పరుచుకున్నారు. గుట్టకు ఉత్తరం వైపున పట్టణంలోని గోల్‌ బంగ్లా సమీపంలో నుంచి గుట్టపైకి కాలి నడకన వెళ్లడానికి మెట్ల మార్గం ఉంది. అయితే భక్తుల సౌకర్యార్థం సుమారు 20 ఏళ్ల క్రితం అప్పటి సర్పంచ్‌ రాంచందర్‌ హండే గుట్టను ఆనుకొని వెళ్లే 63వ నంబర్‌ జాతీయ రహదారిని ఆనుకొని గుట్టపైకి ఘాట్‌ రోడ్డు మార్గాన్ని నిర్మించారు. ఆయన సంకల్పంతో సీసీ రోడ్డుతో ఘాట్‌ రోడ్డు నిర్మాణం జరిగింది. 

నవనాథపురం నుంచి ఆర్మూర్‌గా.. 
వందల ఏళ్ల క్రితం దేశం నలుమూలల నుంచి నవనథులైన గోరఖ్‌నాథ్, జలంధర్‌నాథ్, చరఫట్‌నాథ్, అపభంగనాథ్, కానీషనాథ్, మచ్చీంద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్, బర్తరినాథ్‌గుట్టపై ఉన్న ఒక ఇరుకైన గుహలో తన ఇష్టదైవమైన సిద్ధేశ్వరున్ని ప్రతిష్టించి పూజలు చేశారని ప్రతీతి. వారి పేరిట గుట్టకు సిద్ధుల గుట్టగా పేరు పడింది. ఈ నవనాథుల పేరునే గుట్టను ఆనుకొని ఉన్న గ్రామానికి నవనాథపురంగా నామకరణంచేయబడింది. కాలక్రమంలో ఈ తొమ్మిది మంది స్వాములలో ఆరుగురు ఇక్కడి నుంచి వెళ్లిపోగా ముగ్గురు ఇక్కడే ఉండి పూజలు చేయడంతో ఆరు.. మూరు.. అంటూ కాలక్రమంలో ఆర్మూర్‌గా పేరును స్థిరపర్చుకుంది. మరికొందరు పెద్దలు ఆర్మూర్‌ అనే పదం ఆరావం అనే పదం నుంచి వచ్చిందని చెబుతుంటారు. గుట్టపై విశ్రాంతికి అనువైన వాతావరణం ఉన్నందున గుట్టను ఆనుకొని ఏర్పడిన గ్రామాన్ని ఆర్మూర్‌ అనే పేరుతో పిలవడం ప్రారంభించినట్లు చెప్పుకుంటారు. ఎవరెలా వాదించినా ఆర్మూర్‌ పట్టణానికి సిద్ధులగుట్ట ఆధ్యాత్మిక కేంద్రంగా ల్యాండ్‌ మార్క్‌గా మారిందని చెప్పుకోవచ్చు. 

అభివృద్ధి కార్యక్రమాలు 
సిద్ధుల గుట్టను పవిత్రమైన ప్రాంతంగా గుర్తించిన ఆర్మూర్‌ పట్టణానికి చెందిన ఏనుగు శేఖర్‌రెడ్డి, భారత్‌ గ్యాస్‌ సుమన్, పీసీ గంగారెడ్డి, కిషన్‌ల ఆధ్వర్యంలో గుట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్‌ మొదటి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈ గుట్టను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో అభివృద్ధి నిధులు మంజూరు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఆర్మూర్‌ ప్రాంతంలోని అన్ని కుల సంఘాలను భాగస్వాములను చేస్తూ గుట్టపై తొమ్మిది మందిరాలను రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించడానికి కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. అష్టలక్ష్మి దేవి, సహస్త్రార్జున, వినాయక మందిరం, హనుమాన్‌ మందిరం, మార్కండేయ మందిరం, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మందిరం, వేంకటేశ్వర మందిరం, రాజరాజేశ్వర మందిరం, అయ్యప్ప మందిరం నిర్మాణాలను చేపట్టారు. అందులో అయ్యప్ప మందిర నిర్మాణం పూర్తయింది. గుట్టపై ఉన్న సువిశాల స్థలం చిల్డ్రన్స్‌ పార్క్, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అనువువగా ఉండడంతో ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయి. చిల్డ్రన్స్‌ పార్క్‌తో పాటు గోశాలను ఏర్పాటు చేశారు. ఘాట్‌ రోడ్డు అభివృద్ధికి రూ. నాలుగున్నర కోట్లతో ఇటీవల పనులు ప్రారంభించారు. 



శివరాత్రికి ముస్తాబవుతున్న గుట్ట 
పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై ఉన్న శివాలయంలో ప్రతి శివరాత్రిని భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. చలవ పందిళ్లు, టెంట్లు, బారికేడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. వేల సంఖ్యలో భక్తులు శివలింగాన్ని దర్శించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

గుట్టపై విశేషాలు..
నల్లని రాళ్లను ఒకదగ్గర పేర్చి కుప్పగా పోసినట్లు ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన సిద్ధుల గుట్టను పరిశీలిస్తే ఆశ్చర్చం కలగక మానదు. గుట్టపైకి వెళ్లే ఘాట్‌ రోడ్డు మార్గం ప్రారంభంలో నవనాథుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కింది నుంచి చూస్తే కేవలం రాళ్లు మాత్రమే కనిపించినా గుట్ట పైకి వెళ్లి చూస్తే సువిశాలమైన భూభాగం అక్కడ కనిపిస్తుంది. రాళ్ల మధ్యలో సువిశాలమైన స్థలంలో పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లు నయనానందాన్ని కలిగిస్తాయి. నవనాథులు పూజించిన సిద్ధేశ్వరుని లింగాన్ని రాళ్ల గుహలో నుంచి వెళ్లి దర్శించుకోవడం ఒక చక్కని అనుభూతిగా ఉంటుంది. కాలక్రమంలో పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందడంతో కొన్ని దశాబ్దాల కాలం క్రితమే గుట్టపై శ్రీరాముడి ఆలయం నిర్మించారు.

అంత ఎత్తయిన రాళ్ల గుట్టపై నిత్యం నీరుండేలా కోనేరును ఏర్పాటు చేయగా రామాలయం ఎదురుగానే తవ్విన బావిలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం నిత్యం నీళ్లు అందుబాటులో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. గుహల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన పాల గుండం, నీటి గుండం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాతియుగం కాలంలో గుట్టకు దక్షిణం వైపున ఆర్మూర్‌ పట్టణ ప్రజలకు కనింపిచేలా ఏక శిల స్థూపాన్ని నిర్మించారు. ఈ స్థూపంపై రూపాయి కాయిన్‌ వేస్తే అది స్థూపంపైనే పడితే మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే ప్రచారం ఉంది. గుట్టపై ఉన్న సువిశాల స్థలంలో ఇక్కడి ఆలయ పూజారులు, స్వాములు పలు కూరగాయలు, పంటలను సైతం పండిస్తుంటారు.

గడ్డిని తరలించి పశు సంపదను సైతం పోశిస్తున్నారు. మహా శివరాత్రి, శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. గుట్టపై నుంచి చుట్టూ ఆర్మూర్‌ పట్టణంతో పాటు చెరువులు, రోడ్లు, పంట పొలాలు స్పష్టంగా కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. సుమారు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కట్టడం సైతం చూచాయగా కనిపిస్తుంది. సిద్ధుల గుట్ట నుంచి సారంగాపూర్‌ హనుమాన్‌ మందిరానికి, ఖిల్లా జైలుకు, జాన్కంపేట నరసింహస్వామి మందిరానికి, బాల్కొండ గుట్టకు సొరంగ మార్గం ఉందని పెద్దలు చిన్నలకు కథలుగా చెబుతుంటారు. గతంలో గుట్టపైకి ఎక్కాలనుకునే వారు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఘాట్‌ రోడ్డు నిర్మాణం అందుబాటులో ఉండడంతో వాహనాలను సైతం గుట్టపైకి నేరుగా తీసుకువెళుతున్నారు. 

తెలంగాణలోనే ప్రముఖ క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్‌లోని సిద్ధుల గుట్టను ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన భక్తులు కలిసి వస్తున్నారు. వారందరి సహకారంతో దైవ కార్యాన్ని పూర్తి చేయడానికి పూనుకుంటున్నాం.          –ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే 

భక్తి మార్గంలోనే ప్రశాంతత
భక్తి మార్గంలోనే మనుషులకు ప్రశాంత లభిస్తుంది. జీవనోపాధికి ఉద్యోగం చేసుకుంటూ దైవ కార్యాల్లో చురుకుగా పాల్గొంటున్నాం. సిద్ధుల గుట్ట అభివృద్ధిలో భాగస్వాములం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
భారత్‌ గ్యాస్‌ సుమన్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు

అసౌకర్యం కలగకుండా..
శివరాత్రి సం దర్భంగా నవనాథ సిద్ధుల గుట్టను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తుల దర్శనం కోసం బారికేడ్లను ఏర్పాటు చేస్తు న్నాం.    – పీసీ గంగారెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు, ఆర్మూర్‌

మహిమగల దేవుడు.. 
చారిత్రక ప్రాశస్త్యం గల నవనాథ సిద్ధుల గుట్టపై స్వయంభుగా వెలసిన శివుడు మహిమ గల దేవుడిగా కీర్తి గాంచాడు. ఇక్కడ శివుడిని దర్శనం చేసుకున్న వారికి సకల కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ప్రతియేటా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
కుమార్‌ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు, ఆర్మూర్‌

అరుదైన అనుభూతి 
శివరాత్రి పర్వదినాన సిద్ధులగుట్టను దర్శించుకున్న ప్రతి ఒక్కరికీ అరుదైన అనుభూతిగా కలుగుతుంది. ప్రకృతి, దైవత్వం కలగలిపిన ప్రాంతం కావడంతో ఇక్కడ మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతిఒక్కరూ ఈ దైవ కార్యంలో భాగస్వాములు కావాలి.
ఏనుగు శేఖర్‌ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement