అలా ‘బుక్’ అయ్యారు! | Teachers candidates to Confusion about that on changing lessons | Sakshi
Sakshi News home page

అలా ‘బుక్’ అయ్యారు!

Published Mon, Dec 8 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

అలా ‘బుక్’ అయ్యారు!

అలా ‘బుక్’ అయ్యారు!

* మారిన సిలబస్.. పాత పుస్తకాల కోసం ఉపాధ్యాయ అభ్యర్థుల గాలింపు
* 3, 6, 7, 8 తరగతుల పుస్తకాలకు భారీ డిమాండ్..
* మార్కెట్‌లో దొరకని వైనం
* పాఠశాలల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షిణలు


ఆ పుస్తకాలు మారిపోయి మూడేళ్లవుతోంది. ఇప్పుడు ఆ పుస్తకాల్లోని సిలబస్ ఆధారంగానే టీచర్ల నియామక పరీక్ష జరగబోతోంది. పాత పుస్తకాలు మార్కెట్‌లో కాదుకదా.. కనీసం పాఠశాలల్లో కూడా దొరకడం లేదు. తాజా డీఎడ్, బీఎడ్ చేసిన అభ్యర్థులకు అసలు ఆ పుస్తకాలను రాబట్టుకోవడమే పెద్ద పరీక్షగా మారింది. రాకరాక టీచర్ల భర్తీ నోటిఫికేషన్ వస్తే ఈ ‘సిలబస్’ కష్టాలేంట్రా బాబూ అంటూ వారు తలలు పట్టుకుంటున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కడప: ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం వచ్చే మే నెలలో టెట్ కమ్ టీఆర్‌టీ(టెర్ట్) పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను మూడు నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లోని సిలబస్ ఆధారంగానే నిర్వహించనున్నామని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా ఒక్కసారిగా పాత పుస్తకాల వేట మొదలెట్టారు. వాస్తవానికి 3, 6, 7, 8వ తరగతులకు 2012 నుంచి, 4, 5, 9వ తరగతులకు 2013 నుంచి పుస్తకాలు మారాయి. ఇక పదో తరగతి పుస్తకాలు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి మారాయి. అంటే 3, 6, 7, 8వ తరగతుల పాత పాఠ్యపుస్తకాలను మూడేళ్ల కిందటే పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ పుస్తకాల నుంచే ఉపాధ్యాయ నియామక పరీక్షలో ప్రశ్నలు రానుండడంతో అభ్యర్థులు గందరగోళపడుతున్నారు.
 
 కనిపించని పాతపుస్తకాలు
 సర్కారు బళ్లల్లో చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం కొత్తగా ప్రింట్ చేసిన పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇవే పుస్తకాలను ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పుస్తకాల షాపుల నుంచి కొనుగోలు చేస్తారు. రెండు, మూడేళ్ల కిందటే పుస్తకాలు మారడంతో ప్రస్తుతం అవి దుకాణాల్లో కూడా లభించడం లేదు. దీంతో అభ్యర్థులంతా సర్కారు బళ్లలో పాత స్టాకు ఉంటుందేమోనని ఆ వైపు తొంగిచూస్తున్నారు. అక్కడ మిగిలి ఉన్న ఒకటి, రెండు సెట్లను ఉపాధ్యాయులు తమ సమీప బంధువులకో, స్నేహితులకో ఇచ్చుకోవడంతో పాత పుస్తకాల లభ్యత కష్టతరంగా మారింది.  
 
 సగం ప్రశ్నలు అందులోంచే..
 వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల్లో కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇటీవల పాఠశాల విద్యాశాఖ విడుదలచేసిన షెడ్యూల్ ప్రకారం ఎస్‌జీటీ పరీక్ష 180 మార్కులకు, స్కూలు అసిస్టెంట్, లాగ్వేంజ్ పండిట్ పరీక్ష  200 మార్కులకు నిర్వహించనున్నారు. వీటిలో సగానికి పైగా ప్రశ్నలు 3 నుంచి 10 తరగతుల పాఠ్య పుస్తకాలనుంచే ఉంటాయి. దీన్ని బట్టి తరగతి పుస్తకాల ప్రాముఖ్యత అర్థమవుతోంది. ఇంతటి డిమాండ్ ఉన్న పాత పాఠ్యపుస్తకాలు మార్కెట్‌లో లభించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
 తాజా అభ్యర్థులకు అగచాట్లే!
 కొన్నేళ్లుగా డీఎస్సీ పరీక్షలు రాస్తూ పాత పాఠ్య పుస్తకాలను దాచుకున్న అభ్యర్థుల మాట అటుంచితే ఈ ఏడాదే కొత్తగా డీఎస్సీ పరీక్ష రాయబోతున్న అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 2013, 2014 సంవత్సరాల్లో డీఎడ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులు తొలిసారిగా 2015లో ఈ పరీక్ష రాయబోతున్నారు. వీరి ఉపాధ్యాయ శిక్షణ కూడా కొత్త పాఠ్య పుస్తకాలపైనే కొనసాగింది. ఇప్పుడు పాత పాఠ్యపుస్తకాలను చదవడం అటుంచితే.. అసలు వాటిని సంపాదించడమే తలనొప్పిగా తయారైంది. ఈ పుస్తకాలు ఎక్కడైనా కనబడితే వాటిని జిరాక్స్ తీయించుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు.
 
 పాత పుస్తకాలు చదివి.. కొత్త పాఠాలు చెప్పాలి
 ఇంకోవిషయమేమంటే ప్రస్తుతం కొత్త పాఠ్యపుస్తకాల ద్వారా విద్యాబోధన సాగుతోంది. ఇప్పుడు డీఎస్సీ రాసే అభ్యర్థులు పాత పాఠ్య పుస్తకాలు చదివి రాయాల్సి ఉంది. అంటే పాత పాఠ్యపుస్తకాలు చదివి పరీక్షరాసి.. కొత్త పాఠ్య పుస్తకాల్లోని పాఠాలను పిల్లలకు చెప్పాలన్నమాట. ఇదేం విచిత్రమో అధికారులకు, పాలకులకే తెలియాలి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement