జైపూర్: రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో హైటెక్ కాపీయింగ్ బట్టబయలయ్యింది. ‘బ్లూటూత్ చెప్పుల’ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాజస్తాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్((రీట్)ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. తొలుత అజ్మీర్‌లోని ఓ కేంద్రంలో పరీక్ష రాసేటప్పుడు అనుమానాస్పదంగా వ్యవహరించిన ఓ అభ్యర్థిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడు ధరించిన చెప్పు లోపల కనిపించకుండా సెల్‌ఫోన్‌ను అమర్చినట్లు గుర్తించారు. అలాగే చెవిలో బయటకు కనిపించని బ్లూటూత్‌తో కూడిన సూక్ష్మమైన రిసీవర్ ఉంది. పరీక్ష కేంద్రం బయట ఉన్న వ్యక్తులు అతడికి సమాధానాలు చేరవేస్తున్నట్లు కనిపెట్టారు.
వాటిని సదరు అభ్యర్థి చెప్పులోని సెల్‌కు అనుసంధానించిన బ్లూటూత్ రిసీవర్ ద్వారా వింటున్నట్లు తేల్చారు. దీంతో అధికారులు అన్ని ఎగ్జామ్ సెంటర్లను అప్రమత్తం చేశారు. బికనెర్, సికార్ పట్టణాల్లోనూ ఇలాంటి బాగోతాలే బయటపడ్డాయి. మూడు పట్టణాల్లో మొత్తం ఐదుగురు చీటర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ చీటింగ్ చెప్పులను చాలా తెలివిగా తయారు చేశారని, ఇది కుటీర పరిశ్రమను తలపిస్తోందని వెల్లడించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
‘రీట్’ తదుపరి దశ పరీక్షకు అభ్యర్థులెవరూ స్లిప్పర్స్, బూట్లు, సాక్సులు ధరించి రావొద్దని అధికారులు ఆదేశించారు. ఆదివారం రీట్ సందర్భంగా అనేక ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవలను 12 గంటలపాటు ఆపారు. రాష్ట్రంలో 31 వేల టీచర్ పోస్టులకు 16 లక్షల మంది పోటీ పడుతున్నారు.
(చదవండి: యూపీ బరిలో ఒవైసీ అలజడి)
Comments
Please login to add a commentAdd a comment