భానుడి పగ... భగ... | Temperatures 40 degrees in srikakulam | Sakshi
Sakshi News home page

భానుడి పగ... భగ...

Published Sat, May 23 2015 12:58 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Temperatures 40 degrees in srikakulam

 శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఎండల ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గడచిన వారం రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు, రోగులు ఎండలకు తాళలేక, ఉక్కబోతను తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. కొందరైతే ప్రాణలను గుప్పెట్లో పెట్టుకొని, ఇల్లు కదలకుండా నీడపట్టునే ఉంటున్నారు. అయినా అజాగ్రత్తగా వీధుల్లో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చినవారు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వడదెబ్బకు తట్టుకోలేక 25 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు చెపుతున్నారు.
 
 రెక్కాడితేగానీ డొక్కాడని దినసరి కూలీలు, పొట్టపోషణకోసం తప్పని సరిపరిస్థితుల్లో ఎండలో పనులు చేసేందుకు సాహసించినవారు వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. ఎక్కువ మంది ఉపాధి హామీ కూలీలే కావడం గమనార్హం. ఉపాధి పనుల వేళలు మార్చాలని అధికారులు ఆదేశిస్తున్నా ఇంకా కొన్ని చోట్ల అమలు కావడంలేదు. ఇక ఇతర నిర్మాణ పనులు, కూలీలకు ఎండ దెబ్బ తప్పడంలేదు,  జిల్లాలో గడచిన వారంరోజుల్లో 20 మందికి పైగా మృతి చెందగా, కేవలం ఆరుగురే చనిపోయినట్టు ఆధికారిక లెక్కలు చెపుతున్నాయి. ఇవికాకుండా శుక్రవారం ఇచ్చాపురం, మందస, జి సిగడాం తదితర మండల్లాలోపది మంది మృతిచెందారు.
 
  వీరంతా కూలీలే. ఇప్పటి వరకు జి.సిగడాం మండలంలోని అప్పలస్వామి, శ్రీకాకుళం మండలం రాగోలు గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు, సంతబొమ్మాళి మండలానికి చెందిన ఎ.రామ్మూర్తి, వీరఘట్టం మండలంలోని బుడ్డీ, ఆమదావలసలో అమ్మన్నమ్మ, మెళియాపుట్టిలో ఎస్.సాయికిరణ్ వడగాడ్పులకు మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. మిగిలినవారిని వేర్వేరు కారణాలతో సాధారణ మరణాలుగానే అధికారులు గుర్తిస్తున్నారు. అయితే వడగాడ్పులకు మృతి చెందినవారి కుటుంబీకులకు సర్కారు ఏ విధంగా ఆదుకుంటుందన్నది తెలియరావడంలేదు. గత ఏడాది వడగాడ్పులకు మృతి చెందిన 23 మందికి ప్రభుత్వం పరిహారం చెల్లించింది, ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement