వీడిన మిస్టరీ
ఈపూరు
రెండు నెలల క్రితం మండలంలో సంచలనం రేకెత్తించిన మహిళ అదృశ్యం కేసు మిస్టరీని బుధవారం పోలీసులు ఛేదించారు. రూరల్ సీఐ చిన్నమల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొగ్గరం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి కోటేశ్వరమ్మ(40), జూలై 14వ తేదీన గురజాలలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త హనుమంతరావు తన భార్య కోటేశ్వరమ్మ కనిపించడం లేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. హనుమంతరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం బొమ్మరాజుపల్లి కనుమ అటవీ ప్రాంతంలో మహిళ పుర్రె, ఎముకలు, అవశేషాలు వెలుగుచూడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ చేపట్టారు. కోటేశ్వరమ్మ భర్త హనుమంతరావు ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించి ఆ ప్రాంతంలో ఉన్న చెప్పులు, చీరె, అవశేషాల ఆధారంగా మృతి చెందింది తన భార్యే అని గుర్తించాడు. తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఫిర్యాదు చేశాడు. మృతురాలి వంటిపై లక్ష్మీదేవి బొమ్మ ఉన్న ముత్యపు ఉంగరం, కాళ్ల పట్టాలు, సెల్ ఫోన్ ఉన్నాయని, వాటిని అపహరించడానికి ఆమెను హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
సెల్‌ఫోన్ ఆధారంగా...
అదృశ్యమైన అన్నవరపు కోటేశ్వరమ్మ(40) సెల్ ఫోన్ ఐఎంబీ నంబర్ ఆధారంగా పోలీసులు మిస్టరీని ఛేదించారు. కారంపూడి గ్రామానికి చెందిన టైర్ల కొట్టు వ్యాపారి ఆంజనేయులు వద్ద మృతురాలి కోటేశ్వరమ్మ సెల్‌ఫోన్ ఉందని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. మండలంలోని వనికుంట గ్రామానికి చెందిన బచ్చినబోయిన యోగయ్య (ఆటో యోగయ్య) సెల్ ఫోన్‌ను వెయ్యి రూపాయలకు విక్రయించారని చెప్పడంతో ఆటో డ్రైవర్ యోగయ్యను పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని విచారించడంతో కోటేశ్వరమ్మ మృతిచెందిందని, బొమ్మరాజుపల్లి కనుమ అడవిలో ఆమె అవశేషాలు ఉన్నాయని తెలిపినట్టు తెలుస్తోంది.పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా మహిళ చెప్పులు, పుర్రె, చీర, అవశేషాలు లభించాయి. వనికుంటకు చెందిన యోగయ్య కొంతకాలంగా వినుకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్ మూడవలైన్‌లో నివాసం ఉంటున్నాడు. గతంలో యోగయ్య వనికుంట గ్రామంలో కిరాణాషాపు నిర్వహిస్తుండగా బొగ్గరం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి కోటేశ్వరమ్మతో పరిచయమైందని, జూలై 14వ తేదీన గురజాల నుంచి కారంపూడి వచ్చిన కోటేశ్వరమ్మ తన ఆటోలో వచ్చిందని, మార్గంమధ్యలో బొమ్మరాజుపల్లి కనుమ వద్దకు రాగానే తలపై రాయితో మోది హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించానని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.