సహజవాయువు ధర 16 శాతం తగ్గొచ్చు | 16 per cent of the price of natural gas down | Sakshi
Sakshi News home page

సహజవాయువు ధర 16 శాతం తగ్గొచ్చు

Published Fri, Dec 4 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

16 per cent of the price of natural gas down

న్యూఢిల్లీ:  భారత్‌లో సహజ వాయువు ధర  వచ్చే సంవత్సరం 16 శాతం పడిపోతుందని అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కన్సల్టెంట్ సంస్థ డీగోలియర్ అండ్ మెక్‌నాటన్ (డీఅండ్‌ఎం) పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకూ వర్తించే విధంగా ప్రభుత్వం గ్యాస్ ధరను (గ్రాస్ కలోరియల్ విలువ ప్రాతిపదికన)  ఎంఎంబీటీయూను సెప్టెంబర్‌లో 4.66 డాలర్ల నుంచి 3.82 డాలర్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ ధర వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో మరింతగా 16 శాతం అంటే 3.22 డాలర్లకు తగ్గుతుందని అంచనావేసింది. అయితే అటు తర్వాతి సంవత్సరాల్లో కొంత మెరుగుపడే వీలున్నప్పటికీ, ప్రస్తుత ధర స్థాయికి కనీసం 2020 వరకూ వచ్చే పెరిగే అవకాశం లేదని వివరించింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగువ స్థాయిలో కొనసాగుతుండడమే దీనికి కారణమని వివరించింది.

 గోల్డ్‌మన్ శాక్స్ ఇలా...
 గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ కూడా ఇటీవల ఈ రంగంపై నివేదికను విడుదల చేసింది. ఉత్పత్తి వ్యయాలకన్నా ధరలు తక్కువగా ఉండడం వల్ల... అన్వేషణా, ఉత్పత్తి విభాగాల్లో పెట్టుబడులు భారీగా ఉండకపోవచ్చన్నది నివేదిక సారాంశం. డీప్‌వాటర్ డిస్కవరీలకు సంబంధించి వ్యయం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 6 డాలర్ల నుంచి 7 డాలర్లు ఉందని పేర్కొంది. భారత్‌లో ఎంఎంబీటీయూకు గ్యాస్ ధర చైనా ( 9 డాలర్లు), ఫిలిప్పైన్స్ (10.5 డాలర్లు), ఇండోనేషియా (6.5 డాలర్లు), థాయ్‌లాండ్, మలేషియా (8 డాలర్లు)కన్నా తక్కువగా ఉందని సంస్థ నివేదిక పేర్కొంది.
 

Advertisement
Advertisement