సహజవాయువు ధర 18% కట్
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరలో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఒక్కో యూనిట్ రేటును 18 శాతం తగ్గించడం ద్వారా 3.82 డాలర్లకు చేర్చాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. దేశీ గ్యాస్ ధరల్లో ఇదే అతిపెద్ద కోత కావడం గమనార్హం. దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ వంటి గ్యాస్ ఉత్పత్తిదారుల లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా రాయల్టీ, పన్నులు ఇతరత్రా రూపంలో లభించే ఆదాయంలో రూ.800 కోట్ల మేర నష్టం(ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా కాలానికి) వస్తుందని అంచనా.
మరోపక్క, రాష్ట్రాలకు కూడా గ్యాస్ విక్రయాలపై వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయంలో దాదాపు రూ.250 కోట్లు తగ్గేందుకు దారితీస్తుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి. అయితే, విద్యుత్, ఎరువుల రంగానికి చెందిన గ్యాస్ వినియోగ కంపెనీలకు రేటు తగ్గింపు వల్ల భారీగా ప్రయోజనం లభించనుంది.
ఆరు నెలల కాలానికి..: మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక గ్యాస్ ధర నిర్ణయానికి గతేడాది అక్టోబర్‌లో కొత్త విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం స్థూల కెలోరిఫిక్ విలువ(జీసీవీ) ఆధారంగా ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) రేటు ఇప్పుడున్న 4.66 డాలర్ల నుంచి 3.82 డాలర్లకు తగ్గనుంది. అదేవిధంగా నికర కెలోరిఫిక్ విలువ(ఎన్‌సీవీ) ప్రకారం యూనిట్ ధర ప్రస్తుత 5.18 డాలర్ల నుంచి 4.24 డాలర్లకు దిగొస్తుంది.
ఈ కొత్త రేట్లు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ, అంటే ఆరు నెలలపాటు అమల్లో ఉంటాయి. కాగా తాజా నిర్ణయం వల్ల ఓఎన్‌జీసీ నికర లాభాల్లో రూ.1,059 కోట్ల మేర తగ్గుతాయని సమాచారం.