Natural gas Price
-
సహజ వాయువ ధర రెట్టింపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను రెట్టింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు కొత్త రేట్లు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం .. ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు రికార్డు స్థాయిలో యూనిట్‌కు (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) 6.10 డాలర్ల స్థాయికి పెరిగింది. ఇప్పటిదాకా ఇది 2.90 డాలర్లుగా ఉండేది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర (యూనిట్‌కు) 6.13 డాలర్ల నుంచి 9.92 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన రేట్లు ఎగిసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలను సవరిస్తూ కేంద్ర చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏటా ఆరు నెలలకోసారి కేంద్రం ఈ ధరలను సవరిస్తుంది. పెరగనున్న ద్రవ్యోల్బణం.. తాజా పరిణామంతో సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గత పది రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తొమ్మిది సార్లు పెంచడంతో ఇంధనాల ధర లీటరుకు రూ. 6.4 స్థాయిలో పెరిగింది. వంట గ్యాస్ ధర కూడా సిలిండర్‌కు రూ. 50 చొప్పున పెరిగింది. ఇక గ్యాస్ ధర కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత ఎగిసే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. సహజ వాయువును విద్యుత్, ఎరువుల ఉత్పత్తితో పాటు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), గృహాలకు పైపుల ద్వారా సరఫరా చేసే పైప్డ్ గ్యాస్ అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. అయితే, గ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నందువల్ల విద్యుదుత్పత్తి వ్యయాలపై అంతగా ప్రభావం పడదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే ఎరువులకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున ఆ మేరకు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండబోదని పేర్కొన్నాయి. -
సహజవాయువు ధర 16 శాతం తగ్గొచ్చు
న్యూఢిల్లీ: భారత్‌లో సహజ వాయువు ధర వచ్చే సంవత్సరం 16 శాతం పడిపోతుందని అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కన్సల్టెంట్ సంస్థ డీగోలియర్ అండ్ మెక్‌నాటన్ (డీఅండ్‌ఎం) పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకూ వర్తించే విధంగా ప్రభుత్వం గ్యాస్ ధరను (గ్రాస్ కలోరియల్ విలువ ప్రాతిపదికన) ఎంఎంబీటీయూను సెప్టెంబర్‌లో 4.66 డాలర్ల నుంచి 3.82 డాలర్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ ధర వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో మరింతగా 16 శాతం అంటే 3.22 డాలర్లకు తగ్గుతుందని అంచనావేసింది. అయితే అటు తర్వాతి సంవత్సరాల్లో కొంత మెరుగుపడే వీలున్నప్పటికీ, ప్రస్తుత ధర స్థాయికి కనీసం 2020 వరకూ వచ్చే పెరిగే అవకాశం లేదని వివరించింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగువ స్థాయిలో కొనసాగుతుండడమే దీనికి కారణమని వివరించింది. గోల్డ్‌మన్ శాక్స్ ఇలా... గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ కూడా ఇటీవల ఈ రంగంపై నివేదికను విడుదల చేసింది. ఉత్పత్తి వ్యయాలకన్నా ధరలు తక్కువగా ఉండడం వల్ల... అన్వేషణా, ఉత్పత్తి విభాగాల్లో పెట్టుబడులు భారీగా ఉండకపోవచ్చన్నది నివేదిక సారాంశం. డీప్‌వాటర్ డిస్కవరీలకు సంబంధించి వ్యయం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 6 డాలర్ల నుంచి 7 డాలర్లు ఉందని పేర్కొంది. భారత్‌లో ఎంఎంబీటీయూకు గ్యాస్ ధర చైనా ( 9 డాలర్లు), ఫిలిప్పైన్స్ (10.5 డాలర్లు), ఇండోనేషియా (6.5 డాలర్లు), థాయ్‌లాండ్, మలేషియా (8 డాలర్లు)కన్నా తక్కువగా ఉందని సంస్థ నివేదిక పేర్కొంది. -
సహజవాయువు ధర 18% కట్
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరలో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఒక్కో యూనిట్ రేటును 18 శాతం తగ్గించడం ద్వారా 3.82 డాలర్లకు చేర్చాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. దేశీ గ్యాస్ ధరల్లో ఇదే అతిపెద్ద కోత కావడం గమనార్హం. దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ వంటి గ్యాస్ ఉత్పత్తిదారుల లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా రాయల్టీ, పన్నులు ఇతరత్రా రూపంలో లభించే ఆదాయంలో రూ.800 కోట్ల మేర నష్టం(ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా కాలానికి) వస్తుందని అంచనా. మరోపక్క, రాష్ట్రాలకు కూడా గ్యాస్ విక్రయాలపై వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయంలో దాదాపు రూ.250 కోట్లు తగ్గేందుకు దారితీస్తుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి. అయితే, విద్యుత్, ఎరువుల రంగానికి చెందిన గ్యాస్ వినియోగ కంపెనీలకు రేటు తగ్గింపు వల్ల భారీగా ప్రయోజనం లభించనుంది. ఆరు నెలల కాలానికి..: మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక గ్యాస్ ధర నిర్ణయానికి గతేడాది అక్టోబర్‌లో కొత్త విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం స్థూల కెలోరిఫిక్ విలువ(జీసీవీ) ఆధారంగా ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) రేటు ఇప్పుడున్న 4.66 డాలర్ల నుంచి 3.82 డాలర్లకు తగ్గనుంది. అదేవిధంగా నికర కెలోరిఫిక్ విలువ(ఎన్సీవీ) ప్రకారం యూనిట్ ధర ప్రస్తుత 5.18 డాలర్ల నుంచి 4.24 డాలర్లకు దిగొస్తుంది. ఈ కొత్త రేట్లు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ, అంటే ఆరు నెలలపాటు అమల్లో ఉంటాయి. కాగా తాజా నిర్ణయం వల్ల ఓఎన్జీసీ నికర లాభాల్లో రూ.1,059 కోట్ల మేర తగ్గుతాయని సమాచారం.