CNG Gas Price Increased : పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీల ధరలు పెంచుకుంటూ పోయిన కేంద్రం తాజాగా మరో షాక్ ఇచ్చింది. సీఎన్‌జీ గ్యాస్ ధరలను ఒకే సారి 62 శాతం పెంచింది. పెరిగిన ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
యూనిట్‌కి 2.90 డాలర్ల పెంపు
దేశీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం భారీగా 62 శాతం పెంచింది. దీంతో అక్టోబర్ 1 నుంచీ ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు (ఎంఎంబీటీయూ) 2.90 డాలర్ల వరకు ధర పెరగనుంది.
10 శాతం వరకు
దీనివల్ల సీఎన్‌సీ, పీఎన్‌జీ ధరలు ప్రత్యేకించి ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో 10 నుంచి 11 శాతం పెరగవచ్చన్నది పరిశ్రమ అంచనా. అలాగే కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విద్యుత్, ఎరువుల రంగాలపై కూడా ధరల భారం పడనుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకూ ఆరు నెలలు ఈ ధర అమల్లో ఉంటుంది. గత రెండేళ్లలో ఈ ధర పెరగడం ఇదే తొలిసారి.
పెరిగిన భారం
కేంద్రం నిర్ణయం వల్ల సీఎన్‌జీ (ఆటోమొబైల్‌లో వినియోగించే), పీఎన్‌జీ (పైప్ ద్వారా వంట గ్యాస్) ధరలు పెరిగి వినియోగదారులపై భారం పెరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఓవైపు వాతావరణ కాలుష్యం తగ్గించాలని చెబుతూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి తరుణంలో కాలుష్య రహిత వాహనాలుగా పేరొందిన సీఎన్‌జీ వాహనాలకు తాజా నిర్ణయం షాక్ ఇస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరల తరహాలోనే సీఎన్‌జీ ధరలు పెడగంతో ఢిల్లీ వంటి నగరాల్లో సీఎన్‌జీ వినియోగదారులపై అధిక భారం పడనుంది.
వారికే లాభం
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ సహా రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్ వంటి ఉత్పత్తిదారులకు ఆదాయాలను పెంచనుండడం గమనార్హం. కాగా డీప్‌సీ వంటి క్లిష్ట క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన ధరను ఎంఎంబీటీయూకు ప్రస్తుత 3.62 డాలర్ల నుంచి 6.13 డాలర్లకు పెంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment