2 రెట్లు మార్కెట్ వాటా లక్ష్యం | 2 times the market share target : fenesta | Sakshi
Sakshi News home page

2 రెట్లు మార్కెట్ వాటా లక్ష్యం

Published Wed, Nov 19 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

2 రెట్లు మార్కెట్ వాటా లక్ష్యం

2 రెట్లు మార్కెట్ వాటా లక్ష్యం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూపీవీసీ కిటికీలు, తలుపుల రంగంలో అయిదేళ్లలో మార్కెట్ వాటాను రెండింతలు చేసుకోవాలని డీసీఎం శ్రీరామ్ గ్రూప్‌లో భాగమైన ఫెనెస్టా బిల్డింగ్‌స్ సిస్టమ్స్ నిర్దేశించుకుంది. ప్రస్తుతం తమకు ఇందులో 30 శాతం వాటా ఉందని సంస్థ బిజినెస్ హెడ్ సాకేత్ జైన్ తెలిపారు.

దేశీయంగా యూపీవీసీ ఉత్పత్తుల మార్కెట్ విలువ రూ. 1,000 కోట్ల మేర ఉందని, తాము వార్షికంగా 30 శాతం మేర వృద్ధి సాధిస్తున్నామన్నారు. మంగళవారం ఇక్కడ ఫెనెస్టా సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జైన్ ఈ విషయాలు వివరించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఈ తరహా ఉత్పత్తుల వాడకం 50-60 శాతం మేర ఉండగా.. భారత్‌లో మాత్రం సుమారు 7 శాతం స్థాయిలో ఉందని జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇందులో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు చెన్నై తదితర ప్రాంతాల్లో ప్లాంట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. మొత్తం కంపెనీ ఉత్పత్తిలో హైదరాబాద్ ప్లాంటు వాటా సుమారు 25 శాతం ఉంటుందన్నారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ముంబై తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నామని తెలిపారు.

కొత్తగా ప్రారంభించిన స్టూడియో తమకు దేశవ్యాప్తంగా ఆరోదని, త్వరలో బెంగళూరు, కోల్‌కతా, పుణెలో మరో మూడు ప్రారంభించనున్నామని జైన్ చెప్పారు. కొనుగోలు చేసేందుకు ముందే కస్టమర్లు వివిధ రకాల యూపీవీసీ కిటికీలు, తలుపులను చూసి.. ఎంపిక చేసుకునేందుకు ఈ స్టూడియోలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. పర్యావరణ అనుకూలమైన యూపీవీసీ డోర్లు, విండోలు శబ్ద కాలుష్యం, దుమ్మూ..ధూళీ మొదలైనవి ఇంటిలోకి రాకుండా గరిష్ట స్థాయిలో నియంత్రించగలవని జైన్ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement