
కోవిడ్ సంక్షోభంతో అన్ని దేశాలతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు సైతం భారీ కరెక‌్షన్ జోన్‌లోకి జారాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్లలో బ్యాంకింగ్ షేర్లు ఒకింత ఎక్కువగా పతనమయ్యాయి. చాలా బ్యాంకుల షేర్లు కనిష్ఠాలకు చేరడంతో బ్యాంకు నిఫ్టీ బాగా నష్టపోయింది. ప్రస్తుతం చాలా పీఎస్‌యూ బ్యాంకుల షేర్ల విలువలు పరిశీలిస్తే వాటి ఇష్యూధరల కన్నా చాలా తక్కువకు లభిస్తున్నాయి. మార్కెట్లో ప్రముఖ బ్యాంకుల షేర్లు కొన్ని కలిపితే బయట ఒక మోస్తరు హోటల్లో దొరికే ఫుల్‌మీల్స్ కన్నా తక్కువ కావడం గమనార్హం! ఉదాహరణకు బీఓబీ, పీఎన్‌బీ, యస్‌బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకుల షేర్ల ఉమ్మడి ధర దాదాపు రూ. 150. ఇది ఒక మంచి హోటల్లో ఫుల్‌మీల్స్ ధరకు సమానం. ఈ బ్యాంకులన్నింటి ఉమ్మడి మార్కెట్ క్యాప్ కలిపితే లక్ష కోట్ల రూపాయల లోపునకు చేరింది.
ఇవే కాకుండా, బ్యాంకింగ్‌లో బలమైన షేర్లుగా చెప్పుకునే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల్లాంటి దిగ్గజాల షేర్లు సైతం 2008 సంక్షోభ సమయాలకు చేరాయి. కొంచెంలో కొంచెం కోటక్ బ్యాంక్; ఐసీఐసీఐ బ్యాంకు షేర్లే కాస్త నయమనిపిస్తున్నాయి. ఇక పీఎస్‌బీ దిగ్గజం ఎస్‌బీఐ గత ఆర్థిక సంక్షోభ సమయంలో ఉన్న ధర కన్నా దిగువన ట్రేడవుతోంది. నిజానికి గతేడాది చివరకు బ్యాంకింగ్ రంగం కీలకమైన ఎన్‌పీఏ సమస్య నుంచి బయటపడుతున్నట్లు కనిపించింది. కానీ కోవిడ్ కొట్టిన దెబ్బకు తిరిగి మొండిపద్దులు వెల్లువెత్తుతాయన్న భయాలు బ్యాంకులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం విధించిన మారిటోరియం కారణంగా బ్యాంకుల నిజ పరిస్థితి ఇప్పట్లో బయటపడదని, వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి బ్యాంకుల బాగోతం బయటపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అప్పటివరకు ఈ షేర్లపై పెట్టుబడులు పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment