డిసెంబర్‌లోనూ సన్నగిల్లిన వ్యాపార విశ్వాసం
న్యూఢిల్లీ: దేశీ బలహీన డిమాండ్ కారణంగా డిసెంబర్ నెలలోనూ వ్యాపార విశ్వాసం క్షీణించింది. డాయూష్-బోర్సే సర్వే ప్రకారం.. ఎంఎన్‌ఐ ఇండియా బిజినెస్ సెంటిమెంట్ సూచీ డిసెంబర్ నెలలో 60.7గా ఉంది. ఇది నవంబర్‌లో 60.9గా ఉండేది. వ్యాపార విశ్వాసం ఈ ఏడాది మొత్తం కూడా తగ్గుతూ వచ్చింది. అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంబంధించి వ్యాపార విశ్వాస సూచీ సగ టున 61.3గా నమోదైంది. 2015లో ఇదే చాలా బలహీన త్రైమాసికం.
ఆందోళనకరం...
వ్యాపార విశ్వాసాన్ని ప్రతిబింబించే ఆర్డర్లు ఏడాది కాలంపాటు తగ్గడం ఆందోళనకరమని ఎంఎన్‌ఐ ఇండికేటర్స్ చీఫ్ ఎకన మిస్ట్ ఫిలిప్ యూగ్లో తెలిపారు. తయారీ, సేవ రంగాలకు సంబంధించిన కంపెనీల్లో వ్యాపార విశ్వాసం తగ్గుదలను, రియల్టీ రంగ కంపెనీల్లో మాత్రం వ్యాపార విశ్వాసం పెరుగుదలను గమనించామని పేర్కొన్నారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే.. డిసెంబర్ నెలలో తయారీ, కొత్త ఆర్డర్లు వరుసగా 9.7 శాతం, 8.6 శాతం తగ్గాయని చెప్పారు. ఎగుమతి ఆర్డర్లలోని స్థిరత్వం సానుకూల అంశమని అన్నారు. ముడి చమురు ధరలు తగ్గడం వల్ల కంపెనీల ముడిసరుకు వ్యయాలు తక్కువగా ఉన్నాయని ఫిలిప్ యూగ్లో తెలిపారు.