ట్రాయ్ మాజీ చైర్మన్ జె.ఎస్. శర్మ మృతి
న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) మాజీ చైర్మన్ జె.ఎస్. శర్మ(65) గత నెల 28న మరణించారు. టెలికం రంగంలో సంస్కరణలకు పెద్ద పీట వేసిన ఆయన 2009, మే 14 నుంచి 2012, మే 13 వరకూ ట్రాయ్ చైర్మన్‌గా పనిచేశారు. కొంత కాలం పాటు అస్వస్థతకు గురైన ఆయన గత నెల 28న హైదరాబాద్‌లో మరణించారని ట్రాయ్ ప్రతినిధి తెలియజేశారు. ఆయన హయాంలోనే మొబైల్ నంబర్ పోర్టబిలిటి, సెకన్ బిల్లింగ్ అమల్లోకి వచ్చాయి.
1971 ఐఏఎస్ అధికారి అయిన ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన వారు. 1948, సెప్టెంబర్ 4న విజయవాడలో జన్మించిన ఆయన ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పట్టభద్రులయ్యారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎరువులు, రక్షణ, గ్రామీణాభివృద్ధి విభాగాల్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. టెలికాం డిస్‌ప్యూట్స్ సెటిల్‌మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్‌లో సభ్యుడిగా పనిచేశారు.