‘సాగరమాల’తో కోటి ఉద్యోగాలు
రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు: షిప్పింగ్ శాఖ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన ‘సాగరమాల’ కార్యక్రమం కింద దాదాపు 150 ప్రాజెక్టులను గుర్తించినట్లు కేంద్ర షిప్పింగ్ శాఖ తెలిపింది. వీటికి రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. వీటితో రాబోయే పదేళ్లలో 40 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు సహా మొత్తం కోటిపైగా కొత్త ఉద్యోగాల కల్పన జరగగలదని వివరించింది. దాదాపు 7,500 కిలోమీటర్ల పొడవుండే తీరప్రాంతం, 14,500 కిలోమీటర్ల పైచిలుకు జలరవాణా మార్గాల ఊతంతో పోర్టులను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం సాగరమాల కార్యక్రమాన్ని తలపెట్టింది. దీనికి సంబంధించిన జాతీయ ప్రణాళికలో(ఎన్‌పీపీ) తీర ప్రాంతమున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 14 తీరప్రాంత ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయడంవంటి అంశాలను ప్రతిపాదించారు. వీటికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించేలా తొలి మారిటైమ్ ఇండియా సదస్సు 2016లో ఆవిష్కరించనున్నారు.