‘పాలసీ’ మార్చుకుంటారా? | Insurance companies like LIC | Sakshi
Sakshi News home page

‘పాలసీ’ మార్చుకుంటారా?

Published Mon, Sep 4 2017 12:51 AM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

‘పాలసీ’ మార్చుకుంటారా?

‘పాలసీ’ మార్చుకుంటారా?

పాలసీదారుల ముందు రెండు ఆప్షన్లు
ప్రీమియం చెల్లించకుండానే పాలసీ కొనసాగించొచ్చు
పెయిడప్‌గా మార్చుకుంటే సరిపోతుంది
కనీసం మూడేళ్లు ప్రీమియం చెల్లిస్తేనే ఈ చాన్స్‌
లేదంటే పాలసీని సరెండర్‌ చేసుకోవచ్చు  


చాలా మంది పెద్దగా ఆలోచించకుండానే బీమా పాలసీలు తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటివారు పాలసీ పత్రం చేతికొచ్చాక దాన్ని వెనక్కి పంపేసేందుకు ‘లుక్‌ అవుట్‌’ పీరియడ్‌ ఎటూ ఉంటుంది. కాకపోతే కొన్ని సంవత్సరాలు ప్రీమియంలు చెల్లించాక ఆ పాలసీకన్నా మెరుగైనవి మార్కెట్లోకి రావటమో... లేకపోతే సదరు పాలసీ మరీ తక్కువ రాబడులను ఇస్తుండటమో... లేకపోతే కవరేజీ పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడటమో జరుగుతుంటుంది. అలాంటపుడు వారి ఆలోచనలు మారుతుంటాయి. మరి అప్పుడేం చెయ్యాలి? ఆ పాలసీని రద్దు చేసుకోవటమెలా? ఒకవేళ రద్దు చేసుకుంటే అప్పటిదాకా చెల్లించిన ప్రీమియం సొమ్మయినా వెనక్కి వస్తుందా? దానికి లాభాలేమైనా జతవుతాయా? లేకపోతే అసలుకూ మోసం వస్తుందా? ఇవన్నీ చాలామందికి సందేహాలే. నిజానికి కాల వ్యవధి తీరకుండానే బీమా పాలసీని వెనక్కిచ్చేయాలంటే అందుకు సంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీదారుల ముందు రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి ఇకపై ఏటా ప్రీమియం చెల్లించకుండా దాన్ని పెయిడప్‌ పాలసీగా మార్చుకోవడం. రెండోది పాలసీని వెనక్కిచ్చేసి (సరెండర్‌) వాళ్లు ఇచ్చినంత తీసుకోవడం.

సరెండర్‌కూ కొన్ని నిబంధనలు...
సరెండర్‌ అంటే పాలసీ కాల వ్యవధి తీరకుండానే దాన్నుంచి పూర్తిగా తప్పుకోవడం. ఈ సమయంలో పాలసీదారుడికి చెల్లించే మొత్తాన్ని స్వాధీనపు విలువగా (సరెండర్‌ వ్యాల్యూ) పేర్కొంటారు. వరుసగా మూడేళ్లు పాలసీ ప్రీమియం చెల్లించి ఉంటే ఆ తర్వాత పాలసీని సరెండర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చెల్లించిన ప్రీమియంలో కొంత వరకు వెనక్కి వచ్చే అవకాశముంది. పదేళ్లు, అంతకు మించిన కాల వ్యవధి గల పాలసీ తీసుకుని మూడేళ్లు కూడా ప్రీమియం చెల్లించకుండా, ఏడాది, రెండేళ్లు మాత్రమే చెల్లించి సరెండర్‌ చేస్తే... ఎల్‌ఐసీ వంటి బీమా కంపెనీలు రూపాయి కూడా వెనక్కివ్వవు. అలాగే, దాన్ని పెయిడప్‌ పాలసీగా మార్చుకునే అవకాశం కూడా ఉండదు.

సరెండర్‌ చేస్తే ఎంతొస్తుంది?
పాలసీ సరెండర్‌ విలువ ఎంతో బీమా సంస్థ పాలసీ బాండ్‌లో పేర్కొంటుంది. మూడేళ్ల తర్వాత సరెండర్‌ చేస్తే చెల్లించిన ప్రీమియంలో 30 శాతం వరకూ స్వాధీనపు విలువ దక్కుతుంది. ఇందులో కూడా మొదటి ఏడాది చెల్లించిన ప్రీమియంలో రూపాయి రాదు. రైడర్ల ప్రీమియం, ట్యాక్స్‌ చెల్లింపులు కూడా వెనక్కు రావు. పాలసీ కాల వ్యవధి, ఎప్పుడు స్వాధీనం చేస్తున్నారన్న అంశంపైనే పాలసీ స్వాధీనపు విలువ ఆధారపడి ఉంటుంది. అయితే మూడేళ్లు దాటిన పాలసీల విషయంలో మాత్రం స్పెషల్‌ సరెండర్‌ వ్యాల్యూను బీమా సంస్థలు నిర్ణయిస్తాయి. ఇవి 30 శాతంకన్నా తప్పనిసరిగా అధికంగా ఉంటాయి. పాలసీని సరెండర్‌ చేస్తున్నట్టు ఎల్‌ఐసీకి తెలియజేసిన తర్వాత సరెండర్‌ వ్యాల్యూని ఖరారు చేయడం జరుగుతుంది.  మూడేళ్ల పాలసీ సరెండర్‌ విలువ చెల్లించిన ప్రీమియంలలో 30 శాతం. నాలుగేళ్ల నుంచి ఏడో ఏడాది వరకు స్వాధీనపు విలువ 50 శాతం. ఇలా పాలసీ కాల వ్యవధి దగ్గర పడుతున్న కొద్దీ ఈ శాతం పెరుగుతూ వెళుతుంది. పాలసీ తీసుకున్న తొలి ఏడు సంవత్సరాల్లో సరెండర్‌ చేస్తే స్వాధీనపు విలువను ఐఆర్‌డీఏ నిర్ణయిస్తుంది. ఏడేళ్లు దాటితే ఎంత ఇవ్వాలన్నది బీమా సంస్థ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇం దుకు కూడా ఐఆర్‌డీఏ ఆమోదం తప్పనిసరి.

బీమా రక్షణ పోయినట్టే!
పాలసీని సరెండర్‌ చేస్తే జీవితానికి ఉన్న బీమా రక్షణను కోల్పోతారు.  పాలసీని రద్దు చేసుకుంటే తదుపరి ప్రీమియంలు చెల్లించరు కనక పన్ను ప్రయోజనమూ కోల్పోతారు. ఎండోమెంట్‌ పాలసీని రెండేళ్లలోపు వెనక్కిచ్చేసినా... యులిప్‌ పాలసీని ఐదేళ్లలోపు స్వాధీనం చేసినా వాటిపై లోగడ పొందిన ఆదాయపన్ను ప్రయోజనాలనూ వదులుకోవాల్సి ఉంటుంది.

పెయిడప్‌ పాలసీగా మార్చుకుంటే...
వరుసగా మూడేళ్ల పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత... ఎప్పుడైనా ఒక ఏడాది ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్‌ అయిపోతుంది. దీన్ని పెయిడప్‌ పాలసీగా వ్యవహరిస్తారు. దీంతో ఈ పాలసీల్లో సమ్‌ అష్యూరెన్స్‌ను తగ్గిస్తారు. ఉదాహరణకు రూ.5 లక్షలకు సమ్‌ అష్యూరెన్స్‌ (బీమా) ఉందనుకోండి. 20 ఏళ్ల కాల వ్యవధితో పాలసీ తీసుకోగా కేవలం పదేళ్ల పాటే ప్రీమియం చెల్లించారనుకుంటే... రూ.5 లక్షల సమ్‌ అష్యూరెన్స్‌లో సగమే పరిగణనలోకి తీసుకుంటారు. అంటే 11వ ఏడాది నుంచి రూ.2.5 లక్షల బీమా (పెయిడప్‌ సమ్‌ అష్యూర్డ్‌)తో పాలసీ కొనసాగుతుంది. దీన్ని పెయిడప్‌ వ్యాల్యూగా అర్థం చేసుకోవాలి. దీంతోపాటు పదో ఏడాది వరకు జమైన బోనస్‌ను కూడా కలుపుతారు. దీన్నే మొత్తం చెల్లింపు విలువ (పెయిడప్‌+బోనస్‌)గా పేర్కొంటారు. అయితే, ఆ తర్వాత నుంచి ఎల్‌ఐసీ ప్రకటించే బోనస్, గ్యారంటీడ్‌ అషిషన్స్‌ ఈ ల్యాప్స్‌ అయిన పాలసీలకు వర్తించవు. కాల వ్యవధి తీరిన తర్వాత అప్పుడు పెయిడప్‌ వ్యాల్యూ+బోనస్‌ మాత్రమే ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. ఒకవేళ కాల వ్యవధి ముగిసే లోపు పాలసీదారుడు మరణించిన సందర్భంగా ఎదరైనా గానీ ఇంతే మొత్తం వస్తుంది.

ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి రూ.10 లక్షల బీమా పాలసీ తీసుకుంటే ఏటా ప్రీమియం రూ.47,000 అనుకోండి. ప్రతీ రూ.1,000కి సగటు బోనస్‌ 42 అనుకుంటే గడువు తీరే నాటికి మెచ్యూరిటీ విలువ రూ.18.5 లక్షలు అవుతుంది. రాబడుల రేటు 5.97%. ఇలా కాకుండా పాలసీదారుడు ఆరేళ్ల పాటు ప్రీమియం చెల్లించిన (రూ.2,82,000) తర్వాత దాన్ని పెయిడప్‌ పాలసీగా మార్చుకుంటే సమ్‌ అష్యూర్డ్‌ రూ.5.34 లక్షలకు తగ్గుతుంది. ప్రీమియం రూ.2,82,000 + బోనస్‌ 2,52,000 కలిపి ఈ మొత్తం ఖరారవుతుంది. అయితే ఈ మొత్తం కూడా మిగిలిన కాల వ్యవధి 14 ఏళ్లు ముగిసిన తర్వాతే చేతికందుతుంది. రాబడుల రేటు కేవలం 3.82 శాతం.

స్పెషల్‌ సరెండర్‌ వాల్యూ
ఉదాహరణకు రూ.6 లక్షల సమ్‌ అష్యూర్డ్‌ పాలసీని 20 ఏళ్లకు తీసుకుని ఏటా రూ.30,000 ప్రీమియం చొప్పున నాలుగేళ్ల పాటు మొత్తం రూ.1,20,000 మాత్రమే చెల్లించారనుకుందాం. అప్పటి వరకు జమ అయిన బోనస్‌ సుమారు రూ.60,000. ఈ మొత్తంలో స్పెషల్‌ సరెండర్‌ వాల్యూ (స్వాధీనం విలువ) 30 శాతంగా ఉంటుంది. అంటే రూ.1,20,000+60,000 బోనస్‌ = రూ.1,80,000 అవుతుంది. ఇందులో 30 శాతం అంటే రూ.54,000. మరిన్ని సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించి ఉంటే ఈ సరెండర్‌ వాల్యూ పెరుగుతుంది. మొదటి మూడేళ్ల పాటు ఈ సరెండర్‌ వాల్యూ సున్నాగానే ఉంటుంది. నాలుగో ఏడాది నుంచే అమల్లోకి వస్తుంది. కాల వ్యవధి ముగిసే వరకు క్రమంగా పెరుగుతూ వెళుతుంది.

స్వాధీనం చేసేదెలా?
పాలసీ కొనుగోలు చేసిన ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లాల్సిందే. సర్వీసింగ్‌ బ్రాంచ్‌ను మార్చుకుంటే అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే పాలసీ పత్రాలు, దానిపై రుణం తీసుకుని ఉంటే వాటి తాలూకు పత్రాలు సర్వీసింగ్‌ బ్రాంచ్‌లోనే ఉంటాయి. అందుకే స్వయంగా పాలసీదారుడే సర్వీసింగ్‌ బ్రాంచ్‌కు వెళ్లి పాలసీని సరెండర్‌ చేయాలి.

కావాల్సిన పత్రాలు
పాలసీ బాండ్, ఎల్‌ఐసీ పాలసీ సరెండర్‌ ఫామ్‌ నంబర్‌ 5074ను ఆన్‌లైన్‌లో ప్రింట్‌ తీసుకుని వెళ్లాలి. బ్యాంకు క్యాన్సిల్డ్‌ చెక్‌
(దానిపై పేరు ముద్రించి ఉండాలి) లేదా పాస్‌ బుక్‌ ఫొటోకాపీని వెంట తీసుకెళ్లాలి. ఎల్‌ఐసీ ప్రస్తుతం చెక్కులు ఇవ్వకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది. అలాగే, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా పాన్‌ కార్డు కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. ఈ పత్రాలను సమర్పించిన తర్వాత 5 నుంచి 10 రోజుల్లో బ్యాంకు ఖాతాలో ఎల్‌ఐసీ నుంచి ఫండ్స్‌ జమ అవుతాయి.

చివరిగా ఓసారి ఆలోచించండి
మీ దగ్గరున్న ఎల్‌ఐసీ పాలసీని పెయిడప్‌గా మార్చాలనుకుంటున్నా, సరెండర్‌ చేద్దామనుకుంటున్నా దీని కంటే ముందు వ్యక్తిగత బీమా కవరేజీ ఉందా, లేదా అన్నది సమీక్షించుకోవాలి. కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి ఇది చాలా అవసరం. టర్మ్‌ పాలసీలో తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ లభిస్తుంది. తాను లేని సందర్భంలో ఆశించిన అన్ని లక్ష్యాలను ఆదుకునేలా బీమా రక్షణ ఉండేలా చూసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement