మీ ఇంటి భద్రత మాదే..
• కెమెరాల వ్యయం మేమే భరిస్తాం
• ప్రతి నెల రుసుము చెల్లిస్తే చాలు
• జైకామ్ ఎండీ ప్రమోద్ రావ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు, అపార్ట్‌మెంట్, ఆఫీస్, స్కూల్.. ప్రదేశమేదైనా ప్రతి నెలా నిర్దేశిత ఫీజు చెల్లిస్తే చాలు. 24 గంటలూ నిఘా సేవలు అందిస్తామంటోంది జైకామ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సిస్టమ్స్. కస్టమర్లు ఎటువంటి పెట్టుబడి పెట్టక్కర లేదని ఈ కంపెనీ చెబుతోంది. కెమెరాల నిర్వహణ బాధ్యత కూడా తమదేనని కంపెనీ ఎండీ ప్రమోద్ రావ్ తెలియజేశారు. ‘మేక్ యువర్ సిటీ సేఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘వ్యయంతో కూడుకున్న అంశం కాబట్టి కెమెరాల ఏర్పాటుకు చాలా మంది ఆసక్తి కనబరచటం లేదు. ఇటువంటి వారికి జైకామ్ అత్యుత్తమ పరిష్కారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 10 లక్షలకుపైగా కస్టమర్లు మాతో చేతులు కలిపారు’’ అని ఆయన వివరించారు. ముంబైలోని జైకామ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిఘాను పర్యవేక్షిస్తామన్నారు.
యాప్‌కు 46 వేల మంది...: జైమాన్ పేరుతో కంపెనీ అభివృద్ధి చేసిన భద్రతా యాప్‌కు 46 వేలకుపైగా చందాదారులున్నారు. ఆపదలో బటన్ నొక్కగానే కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఫోన్‌లో అందుబాటులోకి వస్తారు. స్మార్ట్‌ఫోన్‌లో పరిసరాల వాయిస్‌తోపాటు లొకేషన్ మ్యాప్, చిత్రాలు, వీడియో వెంటనే రికార్డు అవుతాయి. పోలీసులకూ సమాచారం వెళ్తుంది. ఒకవేళ ఉపకరణం దొంగతనానికి గురైతే వ్యక్తిగత సమాచారం తొలగిస్తారు. ఫ్యాక్టరీ రీసెట్, ఫార్మాట్‌కు అవకాశం లేదు. దొంగిలించిన వ్యక్తి తన సిమ్‌ను ఫోన్‌లో పెట్టినట్టయితే సమాచారం తెలిసిపోతుంది. ఫోన్ అన్‌లాక్ చేసే ప్రయత్నం చేస్తే అతని ఫోటోను తీస్తుంది. జైమాన్ సేవలకుగాను ఒక్కో ఫోన్‌కు ఆరు నెలలకు రూ.499 చార్జీ చేస్తున్నట్టు జైకామ్ కేర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ శ్రీవాస్తవ తెలిపారు.
నిఘా నీడన ఏటీఎంలు...
‘‘దేశవ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు ఏటీఎంలున్నాయి. బ్యాంకులు ఒక్కో ఏటీఎం భద్రతకు నెలకు రూ.40 వేల దాకా ఖర్చు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ నిఘాకు రూ.3–4 వేలు మాత్రమే వ్యయం అవుతుంది’’ అని ప్రమోద్ రావ్ వెల్లడించారు. 20 వేల ఏటీఎంలు ఎలక్ట్రానిక్ నిఘా (కెమెరాలతో పర్యవేక్షణ) నీడన ఉన్నాయని, 6 వేల ఏటీఎంల భద్రతను జైకామ్ పర్యవేక్షిస్తోందని తెలియజేశారు. ‘‘ఏటీఎంను పగలగొట్టే ప్రయ్నతం చేసినా, షట్టర్ మూసినా అక్కడి సెన్సర్లు గుర్తిస్తాయి. వాయిస్, వీడియో రికార్డవుతుంది. అలారమ్ మోగడంతో పాటు భద్రతా సంస్థలకు వెంటనే సమాచారం వెళ్తుంది’’ అని తెలిపారు. 2019 నాటికి అన్ని బ్యాంకుల ఏటీఎంలు ఎలక్ట్రానిక్ నిఘా కిందకు వస్తాయన్న అంచనా ఉందన్నారు. కంపెనీ మేక్ యువర్ సిటీ సేఫ్ కింద నివాస సముదాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలకు సేవలను విస్తృతం చేస్తోంది.