నగరాల్లో కొత్త కల్చర్.. కో లివింగ్!
నగరాల్లో కొత్త కల్చర్.. కో లివింగ్!
Published Mon, Dec 26 2016 9:31 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
మంచి ఉద్యోగాలు కావాలంటే పెద్ద నగరాలకు వెళ్లాలి. అక్కడైతేనే పెద్ద జీతంతో కూడిన ఉద్యోగాలు వస్తాయి. కానీ అలాంటి పెద్ద నగరాల్లో ఎక్కడ ఉండాలనేది పెద్ద సమస్య. ముఖ్యంగా అమ్మాయిలైతే ఒకవైపు సదుపాయాలు, మరోవైపు భద్రత రెండింటికీ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. ఇందుకోసం ఇప్పుడు పెద్ద నగరాల్లో కొత్తగా వస్తున్న కల్చర్... కో లివింగ్. ఈ తరహా సదుపాయాలను కొంతమంది సర్వీసు ప్రొవైడర్లు అందిస్తున్నారు. అంటే ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒకే విలాసవంతమైన ఇంటిని పంచుకోవడం అన్న మాట. ప్రస్తుతం గుర్‌గావ్, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇళ్లను వాళ్లే అద్దెకు తీసుకుని, వాటిలో మంచి ఫర్నిచర్ సిద్ధం చేసి వాటిని ఇలా మళ్లీ అద్దెకు ఇస్తారు. కావాలనుకుంటే ఒక ఇల్లు మొత్తం మనమే తీసుకోవచ్చు లేదా ఒకరిద్దరితో కలిసి షేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇళ్లలో వై-ఫై, టీవీ, ఫ్రిజ్, మైక్రోవేవ్, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్.. ఇలాంటి సదుపాయాలన్నీ సిద్ధంగా ఉంటాయి. కేవలం మనకు కావల్సిన దుస్తులు తీసుకుని అక్కడకు వెళ్లిపోతే సరిపోతుంది. వీటి అద్దెలు కూడా నెలకు 8వేల నుంచి 30 వేల వరకు ఉన్నాయి. మన బడ్జెట్‌ను బట్టే సదుపాయాలు కూడా ఉంటున్నాయి.
ప్రస్తుతం ఇలాంటి సంస్థలు గుర్‌గావ్‌లో నాలుగు, బెంగళూరు ప్రాంతంలో రెండు ఉన్నాయి. గుర్‌గావ్‌లో అయితే మొత్తం 575 ఇళ్లను వీళ్లు ఇలా సిద్ధం చేశారు. అమెరికా, చైనా లాంటి దేశాల్లో ఇది ఎప్పటి నుంచో ఉందని, మన దేశంలో మాత్రం ఈ మధ్య కాలంలోనే వచ్చిందని కోహో స్టేజ్ సంస్థ వ్యవస్థాపకుడు ఉదయ్ లక్కర్ చెప్పారు. ప్రధానంగా లోపల ఉండేవాళ్లకు సౌకర్యంగా అనిపించడంతో పాటు.. నిర్వహణ సేవలు బాగుండటం ఇందులో మరో ప్రధానాంశం. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నవాళ్లతో పాటు వేరే చోట కొన్నాళ్లు చేసి పెద్ద నగరాలకు వచ్చే యువత తాము ఉండే ప్రాంతం సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటారు. తాను ఉండే చోట ఏదైనా స్విచ్ పగిలిపోయినా, వంట గ్యాస్ అయిపోయినా తాను ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని.. మొబైల్ యాప్‌లో ఆ విషయాన్ని తెలియజేస్తే కొన్ని గంటల్లోనే సమస్య పరిష్కారం అవుతోందని ఇలాంటి కో లివింగ్లో ఉంటున్న స్మృతి ఆనంద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చెప్పారు.
Advertisement
Advertisement