వ్యాపార వెలుగుకు జీ-20 ప్రతిన
- పన్ను ఎగవేతలపైనా దృష్టి
- తీవ్రవాదంపై ఉక్కుపాదానికి చర్యలు
ఇస్తాంబుల్: అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల మెరుగుదల, పన్ను ఎగవేతల నిరోధం వంటి అంశాలపై జీ-20 దేశాలు దృష్టి సారించాయి. దీనితోపాటు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి ఆలోచనా ధోరణిని పక్కనబెట్టి, కేవలం తమ దేశం వృద్ధి కోణంలో కొన్ని దేశాలు తీసుకునే రక్షణాత్మక విధానాల పట్లా తీవ్ర వ్యతిరేకతను పాటించాలని తీర్మానించాయి. పారదర్శకతే లక్ష్యంగా ఆయా దిశల్లో ముందడుగులు వేయాలని నిర్ణయించాయి.
తీవ్రవాదుల కార్యకలాపాల పట్లా ఆందోళన వ్యక్తం చేసిన జీ20 దేశాలు, ఆయా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అన్ని దేశాలూ ఇచ్చిపుచ్చుకోవాలని, తీవ్రవాదుల ఆస్తులను స్తంభింపజేయడానికి అన్ని ప్రయత్నాలూ చేయాలని తీర్మానించాయి. ఇక్కడ రెండు రోజుల పాటు జరిగిన సదస్సు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో భారత్ తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రాజన్, ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హాలు పాల్గొన్నారు.
సంయుక్త ప్రకటన ముఖ్య అంశాలు...
⇒ అంతర్జాతీయ ఆర్థిక రికవరీ ఇంకా నిరాశగానే ఉంది. ఈ సవాళ్లను అధిగమించడానికి అన్ని దేశాలూ తగిన ప్రయత్నం చేస్తాయి. పటిష్ట, సుస్థిర, సమతౌల్య వృద్ధితో ఉపాధి అవకాశాల పెంపే ధ్యేయంగా కృషి కొనసాగుతుంది.
⇒చమురు ధరల తగ్గుదల ప్రపంచ వృద్ధికి దోహదపడే అంశం. వివిధ ఆర్థిక వ్యవస్థలపై ఇది ఆర్థికంగా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక భవిష్యత్తులో ఈ ధరల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది. కమోడిటీ మార్కెట్లలో ఈ పరిణామాలు, అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై ఆయా పరిస్థితుల ప్రభావాలపై జీ- 20 ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తుంటుంది.
⇒ఐఎంఎఫ్ కోటా సంస్కరణలు సత్వరం జరగాలి.