చిన్న ఫార్మా సంస్థలకు తోడ్పాటునివ్వాలి: టాప్సీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్య స్థాయి ఫార్మా సంస్థలకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫార్మా అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ (టాప్సీ) విజ్ఞప్తి చేసింది. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం 2,000 ఎకరాల స్థల కేటాయింపును వేగిరం చేయాలని కోరింది. శనివారం ఇక్కడ జరిగిన టాప్సీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్‌వీ నరేందర్ విలేకరులకు ఈ విషయాలు తెలిపారు. ఫార్మా పరిశ్రమ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టాప్సీ స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
క్లస్టర్‌కి స్థలం లభిస్తే దాదాపు 250-300 దాకా ఫార్మా యూనిట్లు రాగలవని, దీనివల్ల దాదాపు పాతికవేల మందికి ప్రత్యక్షంగా, మరో ముఫ్ఫై వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించగలదన్నారు. దీని టర్నోవరు దాదాపు రూ. 7,500 కోట్ల మేర ఉండగలదని నరేందర్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, చౌటుప్పల్, నాగార్జున సాగర్ రోడ్ వంటి మూడు ప్రాంతాల్లో స్థల కేటాయింపునకు అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. క్లస్టర్‌లో ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు, ఫైర్..పోలీస్ స్టేషన్, వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంటు, నిరంతరాయ విద్యుత్ సరఫరా మొదలైనవి ఉండేలా చూడాలన్నారు.
మరోవైపు, విద్యుత్ కోతల వల్ల ప్రస్తుతం ప్రతి ఫార్మా యూనిట్‌పై నెలకు రూ. 10 లక్షల మేర ప్రతికూల ప్రభావం ఉంటోందని నరేందర్ వివరించారు. బాయిలర్ ఇన్‌స్పెక్టొరేట్, కాలుష్య నియంత్రణ బోర్డ్ తదితర విభాగాల నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక వాడల్లో అత్యవసర పరిస్థితుల కోసం మరిన్ని ఫైర్ స్టేషన్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అటు, బయోటెక్ రంగంలో చిన్న సంస్థల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఊతమివ్వాలని టాప్సీ వైస్ ప్రెసిడెంట్ జి. జగత్ రెడ్డి తెలిపారు. వీటి వల్ల హైదరాబాద్‌లో గణనీయంగా ఉద్యోగావకాశాలు రాగలవని చెప్పారు. ఆరు నెలల క్రితం ఏర్పాటయిన టాప్సీలో 122 సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయని, మరికొన్ని చేరుతున్నాయని ఆయన తెలిపారు.