
చిలకలూరిపేటటౌన్ : భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలిసిన భర్త మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం రాత్రి చిలకలూరిపేట పట్టణంలో జరిగింది. అర్బన్ సీఐ బండారు సురేష్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వడ్డి కాలనీలో నివశించే షేక్ బషీర్ అహ్మద్ (32) స్థానిక ఐరన్ దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తరచూ గొడవ పడేవాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీశాడు. తన ఇంటి సమీపంలో నివశించే ఆటో డ్రైవర్ సురేష్‌తో మాట్లాడుతున్నానని, నీకు చేతనైంది చేసుకో.. అని తేల్చి చెప్పింది. ఆ సమయంలో 12 ఏళ్ల కొడుకు సమీర్ కూడా అక్కడే ఉన్నాడు.
భార్య, కొడుకు ఇద్దరూ నిద్రకు ఉపక్రమించాక బషీర్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం సీఐ విలేకరులతో మాట్లాడుతూ మృతుడి కొడుకు సమీర్, తల్లి నూర్‌జహాన్, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని చెప్పారు. భార్య వివాహేతర సంబంధం కారణంగానే బషీర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామన్నారు. భార్య హసీనాతో పాటు ఆటో డ్రైవర్ గుంజి సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వెంటాడుతున్న మరణాలు..
బషీర్ తండ్రి ఇరవై ఏళ్ల కిందట ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి తల్లి నూర్‌జహాన్ తన ముగ్గురు పిల్లలను కష్టపడి పెంచి పోషించింది. మూడో సంతానమైన బషీర్‌కు స్థానికంగా ఉండే హసీనాతో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఆరేళ్ల కిందట బషీర్ పెద్దకొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రెండో కుమారుడు సమీర్ ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. తల్లి ప్రవర్తనపై విసిగి వేసారిన కొడుకు సమీర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు బషీర్ కూడా మరణించడటంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది.