మాట్లాడుతున్న మూడో అదనపు జడ్జి పంచాక్షరి
- సివిల్, డబ్బు కేసుల్లో పోలీసుల ప్రమేయం ఉండరాదు
- ఖమ్మం మూడో అదనపు ప్రథమ శ్రేణి జడ్జి పంచాక్షరి
తనికెళ్ల (కొణిజర్ల) :
ప్రజల బాగోగులకు, కలతలు లేని సమాజ స్థాపనకు చట్టాలు వచ్చాయని, అలాంటి చట్టాలను అతిక్రమించి కోర్టులకు వస్తున్నారని జిల్లా 3వ అదనపు ప్రథమ శ్రేణి సివిల్ జడ్జి సీహెచ్ పంచాక్షరి పేర్కొన్నారు. మండలంలోని తనికెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండని బాల బాలికలను ఎటువంటి పనుల్లో పెట్టుకోరాదని, అటువంటివారు శిక్షార్హులు అవుతారన్నారు. బాలికలకు చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా నష్టపోతున్నారన్నారు. ఎటువంటి వాహనం కొన్నా తక్షణమే రిజిస్ట్రేషన్ చేయంచాలన్నారు. 18 ఏళ్లు నిండని వారికి వాహనాలు ఇవ్వకూడదన్నారు. భూములు కొనేటప్పుడు, వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పూర్తి డాక్యుమెంట్‌లు రాసిన తర్వాతే డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చేయాలన్నారు. చేతి కాగితాల మీద భూములు కొనుగోలు చేస్తే అవి చెత్త కాగితాలతో సమానమన్నారు.
భూ సంబంధ కేసులను, వడ్డీ వ్యాపారుల కేసులను పోలీసులకు విచారించే హక్కు లేదన్నారు. అవి పూర్తిగా కోర్టు పరిధిలోనే ఉంటాయన్నారు. న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని ఎస్సీ, ఎస్టీ, నిరుపేద వర్గాల వారు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చన్నారు. అనంతరం పాఠశాలలో ఆయన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంటా శ్రీలత, ఎంపీడీఓ పి. శ్రీనివాసరావు, ఎంఈఓ యం.శ్యాంసన్, సర్పంచ్ తేజావత్ వనిత, ఎంపీటీసీ సభ్యుడు గాజుల కష్ణమూర్తి, ఎస్‌ఐ రాసూరి కష్ణ, న్యాయవాది బీశ రమేష్, హెచ్‌ఎం మాధవరావు తదితరులు పాల్గొన్నారు.