ఎమ్మెల్యే గోవింద.. అంతులేని భూదందా | complaint lodged with the PENDURTHI PSV | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గోవింద.. అంతులేని భూదందా

Jan 10 2017 1:44 AM | Updated on Aug 10 2018 8:23 PM

ఎమ్మెల్యే గోవింద..  అంతులేని భూదందా - Sakshi

ఎమ్మెల్యే గోవింద.. అంతులేని భూదందా

అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణపై పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది.

ఓ ఇంటి ప్రహరీని కూలగొట్టి.. చంపుతామని బెదిరింపులు
బాధితుల ఫిర్యాదుతో పెందుర్తి పీఎస్‌లో కేసు నమోదు


పెందుర్తి: అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణపై పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. భూ దురాక్రమణకు యత్నం, చంపుతామని బెదిరింపులు, తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితులు (ఫిర్యాదు ద్వారా) వెల్లడించిన కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఎంవీపీ కాలనీలో నివాసం ఉంటున్న ముమ్మన రమాదేవి పేరిట దాదాపు 25 ఏళ్ల క్రితం పెందుర్తిలో స్థలం కొనుగోలు చేశారు. అందులో ఇల్లు కట్టుకుని ఓ పోర్షన్‌లో రమాదేవి కుటుంబం ఉంటోంది. మరొకటి అద్దెకు ఇచ్చారు. రమాదేవి భర్త సత్యనారాయణ గత నవంబర్‌లో మరణించారు. ఉపాధి నిమిత్తం రమాదేవి కుమారుడు రాజేష్‌బాబు మస్కట్‌లో ఉంటున్నారు. గత డిసెంబర్‌లో ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ, అతని కుమారుడు శ్రీకాంత్, పీఏ రమేష్‌తో పాటు అతని అనుచరులు ఆ ఇంటి వద్దకు వచ్చి దౌర్జన్యానికి దిగారు.

తక్షణమే ఇల్లు ఖాళీ చేసి తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఇల్లు ఖాళీ చేయని పక్షంలో రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో అంత సొమ్ము మేమెందుకు  ఇవ్వాలి, తమ స్థలంలో ఉన్న ఇళ్లు మీకేందుకు ఇవ్వాలని రమాదేవి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఈ క్రమంలో రోజూ ఎమ్మెల్యే అనుచరులు వీరిని బెదిరించడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో ఇంటి యజమాని రమాదేవికి పక్షవాతం రావడం, వీరి బెదిరింపులు ఎక్కువడంతో వారి పోర్షన్‌ ఖాళీ చేసి వేరే చోటికి వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే, అతని అనుచరులు జేసీబీల సహాయంతో రమాదేవి ఇంటి గోడ పక్కన కూడా దాదాపు నాలుగు అడుగుల లోతు మట్టి తీశారు. దీంతో ఆందోళనకు గురైన రమాదేవి కుటుంబ సభ్యులు జిల్లా రెండవ అదనపు సీనియర్‌ సివిల్‌ కోర్టులో కేసు వేయగా డిసెంబర్‌ 23న రమాదేవికి అనుకూలంగా జడ్జి స్టేటస్‌కో ఇచ్చారు. అయితే ఈ నెల 5న అర ్ధరాత్రి 2 గంటలకు జేసీబీల సహాయంతో దాదాపు 15 మంది వ్యక్తులు  వచ్చి రమాదేవి ఇంటి ముందు రోడ్డును, ఇంటి ప్రహరీని తవ్వించేశారు. ఇంటి గోడలను పడగొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అదే ఇంటిలో అద్దెకు ఉన్నవారు పెద్దగా కేకలు వేయగా ఇంటిపై దాడికి పాల్పడిన వారు జేసీబీ సహా కార్లలో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై రమాదేవి కోడలు ముమ్మన హారిక (రాజేష్‌బాబు భార్య) పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే పీలా గోవింద సహా అతని కుమారుడు శ్రీకాంత్, ప్రైవేటు పీఏ రమేష్‌పై ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఎమ్మెల్యేపై ఐపీసీ 447, 427, 506 ఆర్‌/డబ్లు్య 34 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పెందుర్తి సీఐ జె.మురళి వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement