గుండ్రేవులను పక్కనబెట్టిన ప్రభుత్వం
– 64 ఏళ్లగా రాయలసీమకు నీటి కేటాయింపుల్లో అన్యాయం
– రాయలసీమ జలచైతన్య సదస్సును జయప్రదం చేయండి
కోవెలకుంట్ల: గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని కర్నూలు సాక్షిగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రాష్ట్రాల సాకుతో పక్కనబెట్టారని అఖిలభారత రైతు సంఘాల సమాఖ్య, సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక రోటరీక్లబ్ భవనంలో రాయలసీమ జలచైతన్యసభ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం ఏపీపాటు తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలతో ముడిపడి ఉందని సీఎం చెప్పడం విచారకరమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో 160 టీఎంసీల నీరందే దుమ్ముగూడెం ప్రాజెక్టును చేర్చకపోవడం అన్యాయమన్నారు. గత 64 సంవత్సరాల నుంచి సీమకు నీటి కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
గాలేరు, హంద్రీనీవా, వెలుగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం సీమ ప్రజల సాగు, తాగునీటి హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. కుందూనదిపై జోళదరాశి, రాజోలి ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు కేటాయించినా పనులు ప్రారంభించకుండా నిలుపుదల చేశారన్నారు. సీమకు చట్టబద్ధమైన నీటి హక్కు సాధనకు రైతులు నడుం బిగించాలని లేకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందన్నారు.
ఈ నెల 21వ తేదీన నంద్యాలలోని ఎస్‌పీజీ గ్రౌండ్‌లో నిర్వహించే రాయలసీమ జలచైతన్య సభకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాయలసీమ జాయింట్‌యాక‌్షన్ కమిటీ కో ఆర్డినేటర్ కామని వేణుగోపాల్‌రెడ్డి, సభ్యులు కరీంబాషా, సీపీఎం డి విజన్ కార్యదర్శి సుధాకర్, వడ్డె సుబ్బరాయుడు, శ్రీనివాసరెడ్డి, రైతులు పాల్గొన్నారు.