తెలుగు సాహిత్యంలో తొలిసారిగా వినూత్న ప్రయోగం l
వందమంది పృచ్ఛకులను ఎదుర్కొన్న ర్యాలి ప్రసాద్
రాజమహేంద్రవరం కల్చరల్ : తెలుగు సాహితీ సరస్వతీకి మరో అమూల్యమైన కంఠాభరణం.. నన్నయ విశ్వవిద్యాలయం, ఆదిత్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నన్నయ విశ్వవిద్యాలయంలో ర్యాలి ప్రసాద్ నిర్వహించిన వచన కవితాశతావధానం సాహిత్యాభిమానులను అలరించింది. పృచ్ఛకులు తాము లేవనెత్తిన అంశాలకు అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీవాద, హేతువాద, దిగంబర వాదాలలో సమాధానాలు చెప్పమని కోరటం, ఆ రీతిలోనే సమాధానాలు రావడం అవధానంలోని ప్రత్యేకత. పృచ్ఛకులు చాలామంది విద్యార్థులే. మచ్చుకి పృచ్ఛకుల అస్త్రాలు, అవధాని ప్రత్యుత్తరాలు...
పృచ్ఛకురాలు: కోయిల రాగాన్ని కోడి మేలుకొలుపుతో పోల్చి చెప్పండి.
అవధాని:
శిశిరం ఆకు రాల్చుకుంది
కోయిల గొంతు విప్పుకుంది
రాత్రి చీకట్లను దులుపుకుంది
కోడి కూసింది.
పృచ్ఛకురాలు: చీకటి పడే వేళ, తల్లి పక్షి తన పిలల్లను గురించి పడే తపనను స్త్రీ వాదంలో వివరించండి
అవధాని:
వేదకాలం నుంచి నేటికాలం వరకు
పురుషుని పక్కనే కూర్చోడానికి
స్త్రీ ఎదురుచూస్తోంది
కుర్చీలో కాదు, హోదాలో....
వేల సంవత్సరాలుగా ఆ చూపులు గూటిని చేరడం లేదు
పక్షి ఎదురుచూస్తూనే ఉంది
పృచ్ఛకురాలు: వర్షపు చినుకులు భూమిని తాకే వేళ, జీవరాశులు పొందే అనుభూతిని కవితారూపంలో చెప్పండి
అవధాని:
నేలతల్లి చినుకుబిడ్డ కోసం
ఎదురుచూస్తుంది
బిడ్డ ఒడిని చేరగానే కేరింతలతో
ఉరుములు ఉరుముతుంది
పృచ్ఛకురాలు: వర్షం ముందు వచ్చే మేఘాలను ఉపాధ్యాయులతో పోల్చి చెప్పండి
అవధాని:
చెట్టును ఊపాక కదిలే పక్షుల్లా
పిల్లలంతా అల్లరి చేస్తున్నారు
చెట్లపై నుంచి ఆకాశం కన్నెర్ర చేసింది
ఒక్కసారి వర్షం వచ్చింది ఉపాధ్యాయునిలా
పక్షులన్నీ చెట్టుపైకి చేరుకున్నాయి బిలబిలా
పృచ్ఛకురాలు: ఆకాశాన్ని, నక్షత్రాలను ప్రపంచంలోని మతాలకు సమన్వయం చేస్తూ కవితను చెప్పండి.
అవధాని:
ఆకాశంలోని నక్షత్రాలు పెద్ద వెలుగునీయవు
కాస్త దగ్గరకు వెళ్లి చూస్తే, ఆ నక్షత్రమే మహావెలుగు
..లోపలికి చూస్తేనే మతం ఔన్నత్యం తెలిసేది.
దాట్ల దేవదానంరాజు సమన్వయకర్తగా వ్యవహరించారు. చివరలో అవధానిని నిర్వాహకులు సత్కరించారు.