మనసెరిగి... మలచాలి
పిల్లల మనసు మట్టిముద్ద వంటిది.. దానిపై ఏది పడినా అది చెరగని ముద్రనే వేస్తుంది అని చెబుతారు మానసిక విశ్లేషకులు. బాల్యంలో వారు చూసిన సంఘటనలు, లేత మనసుపై పడిన గుర్తులు జీవితకాలం ప్రభావం చూపుతాయి. వారికి తీపి జ్ఞాపకాలను మిగల్చడంతో పాటు సమస్యలను అధిగమించే నేర్పు అలవరచడం పెద్దల చేతుల్లోనే ఉంది. చిన్నారులను ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా మూడు. మొదటిది కుటుంబం, రెండోది పాఠశాల కాగా మూడోది సమాజం.
అయితే తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పిల్లలను నడిపించే మార్గదర్శి లేకపోవడం, వారి ఆసక్తిని గురువులు గుర్తించకపోవడం, సమాజంలో విలువలు కనుమరుగవడం వంటి ఎన్నో అంశాలు పిల్లల్లో మానసిక సంఘర్షణకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిలో ఇమడలేక.. వ్యవస్థలో మనలేక.. బాల్యం గాడి తప్పుతోంది. వీటిని చక్కదిద్ది, చిన్నారులను సక్రమ మార్గంలో నడిపించాలి. లోపాలను గుర్తించి బంగరు బాల్యాన్ని, ఆశావహ భవిష్యత్తును అందించాల్సిన గురుతర బాధ్యత అందరిదీ.. – ఏయూక్యాంపస్ (విశాఖతూర్పు)
కుటుంబం
పిల్లలు ఒత్తిడికి లోనవడానికి కుటుంబ పరిస్థితులు కూడా కారణం. వాటిలో ప్రధానంగా..
⇒ఇంట్లో ఒకే బిడ్డ ఉండడంతో బాగా గారాబం చేయడం
⇒చిన్నకుటుంబాలు కావడంతో తల్లితండ్రులు ఉద్యోగస్తులు కావడం
⇒పిల్లల సమస్యలు, బాధలు తెలుసుకునే తీరిక వీరికి లేకపోవడం
⇒వారికి సాంత్వన అందించే తల్లితండ్రుల ప్రేమ అందకపోడవం
⇒ పిల్లలను ఇతరుల ముందు నిందించడం, దండించడం
⇒ శారీరక, మానసిన సమస్యలను అధిగమించే విధానాలు తెలియకపోవడం
⇒తగిన మాగదర్శకత్వం అందించే వారు లేకపోవడం
⇒ తల్లిదండ్రులు తమ ఇష్టాలను, ఆకాంక్షలను పిల్లలపై రుద్దడం
అధిగమించడం.. ఇలా..
⇒తల్లిదండ్రులు నిత్యం తప్పని సరిగా పిల్లలతో కొంత సమయం గడపాలి
⇒వారి సామర్ధ్యం, ఇష్టాలను తెలుసుకుని ప్రోత్సహించాలి
⇒లోపాలను వేలెత్తి చూపేకన్నా సరిదిద్దే ప్రయత్నం చేయాలి
⇒ సమస్యలు గుర్తించి అధిగమించే విధంగా ప్రోత్సహించాలి
⇒విద్యాసంబంధ, శారీరక, మానసిక సమస్యలను అడిగి తెలుసుకోవాలి
⇒ మానసిక సమస్యలు, ప్రత్యేక సమస్యలు ఉన్నపుడు నిపుణులను కలవాలి
⇒అవసరాలకు మించి డబ్బు ఇవ్వరాదు
సమాజం... ప్రతిబింబం
⇒వ్యక్తిని సంస్కరించే సమాజంలో విలువలు కనుమరుగవడం
⇒ నేరాలు, దాడులు పెరిగిపోవడం
⇒ ప్రసార మాధ్యమాలలో నేర సంబంధ వార్తల నిడివి పెరగడం
⇒సకారాత్మక ధోరణిలో సమాజం ప్రతిబింబించకపోవడం
⇒ సినిమాలు, ఇతర సంఘటనలకు చిన్నారులు ప్రభావితం కావడం
⇒ సమాజంలోని వ్యక్తుల అనుచిత ప్రవర్తనలు
⇒ సమాజ పరిస్థితులకు ఇమడలేకపోవడం
ఇలా ఉండాలి...
⇒సమాజంలో విలువలకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
⇒ వ్యక్తిత్వ వికాస సంబంధ వ్యాసాలు, కార్యక్రమాలు ప్రసారం చేయాలి
⇒ నిపుణులతో విద్యార్థులకు కౌన్సెలింగ్ జరపాలి
⇒ చిన్నారులను సమస్యలకు గురి చేసే పరిసరాలకు దూరంగా ఉంచాలి
⇒ సమాజంపై అవగాహన కల్పించాలి
గతిని మార్చే పాఠశాల
⇒విద్యార్థుల మనసుపై ప్రభావం చూపే మరో ముఖ్య అంశం పాఠశాల. అక్కడి వాతావరణం ఇలా ఉండకూడదు.
⇒ఇతర విద్యార్థులతో పోల్చి చూపడం, నిందించడం
⇒మంచి మార్కులు సాధించాలని ఒత్తిడి తీసుకురావడం
⇒కేవలం విద్యకు, మార్కులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం
⇒ విద్యార్థుల మనసెరిగి బోధించే విధానం కనుమరుగవడం
⇒కేవలం లాభాపేక్షతోనే పాఠశాల నిర్వహణ సాగడం
⇒అధ్యాపకుల బోధన సరిగా లేకపోవడం
⇒బోధన ఆసక్తికరంగా లేకపోవడం
⇒స్వీయ అభ్యసనం అలవాటు చేయకపోవడం
⇒ విద్యతో పాటు సహకార్యక్రమాలు, క్రీడలకు అవకాశం లేకపోవడం
ఇలా ఉండాలి..
⇒విద్యార్థుల మనసెరిగి, ఆసక్తికి అనుగుణంగా బోధన ఉండాలి
⇒ఉపకరణాలతో ఆసక్తికరంగా బోధన జరపాలి
⇒ర్యాంకులు, మార్కుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదు
⇒ప్రేమతో మసలే ఉపాధ్యాయులు ఉండాలి
⇒విద్యార్థి వ్యక్తిగత సమస్యలను తెలుసుకుని మార్గదర్శకత్వం అందించాలి
⇒తరగతిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులు ఉండాలి
⇒ క్రీడలు, సాంసృతిక కార్యక్రమాలకు సమయం కేటాయించాలి
⇒వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించాలి
⇒ప్రవర్తనా సమస్యలు గుర్తించి నివారించే ప్రయత్నం జరపాలి
కౌన్సెలర్లను ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ ఉత్తర్వులను అమలు జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతీ పాఠశాలలో తప్పనిసరిగా సైకోమెట్రిక్ సైకాలజిస్ట్, కౌన్సెలర్లు ఏర్పాటు కావాలి. ప్రతీ సంవత్సరం విద్యార్థుల మానసిక పరిస్థితులను వీరు గమనించాలి. విద్యార్థుల సమస్యలు గుర్తించి తగిన మార్గదర్శకత్వం నెరపాలి. కుటుంబంలో పెద్దలలో పిల్లలకు సాన్నిహిత్యం పెంచాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవితకు తోడ్పడే విధంగా ఆశావాద దృక్పథం అలవరచాలి.
– ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, ఏయూ సైకాలజీ విభాగాధిపతి