తీరంలో పటిష్ట నిఘా
ఒర్లగొందితిప్పలో
మెరైన్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన ఎస్పీ
ఒర్లగొందితిప్ప (కృత్తివెన్ను) :
ఒర్లగొందితిప్పలో మెరైన్ పోలీస్టేన్ ఏర్పాటుతో తీరప్రాంతంతో నిఘా మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ జి.విజయ్‌కుమార్ తెలిపారు. కృత్తివెన్ను మండలం ఒర్లగొందితిప్ప గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన మెరైన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తీరప్రాంతంపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు మెరైన్ స్టేషన్‌లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తీరప్రాంతం వెంబడి మొత్తం 15 మెరైన్ పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయని చెప్పారు. మన జిల్లాలోని పాలకాయతిప్ప, గిలకలదిండి, ఒర్లగొందితిప్ప గ్రామాల్లో మెరైన్ స్టేషన్‌లు ఏర్పాటు చే సినట్లు తెలిపారు. రూ.55లక్షలతో అన్ని ఆధునిక వసతులతో ఒర్లగొందితిప్ప మెరైన్ స్టేషన్‌ను నిర్మించినట్లు వివరించారు. మెరైన్ స్టేషన్‌లకు త్వరలోనే నూతన బోట్లు అందిస్తారని, అదనపు సిబ్బందిని నియమిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పీడీవీ సాగర్, బందరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్, డీసీకేవీ డీఎస్పీ ఎం.రమేష్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ జయరాజ్, ఒర్లగొందితిప్ప, పాలకాయతిప్ప, అంతర్వేది మెరైన్ పోలీస్ స్టేషన్ల సీఐలు డి.సత్యనారాయణ, సీహెచ్.మురళీకృష్ణ, శ్యాంకుమార్, కృత్తివెన్ను ఎస్‌ఐ పి.లోవరాజు, స్థానిక సర్పంచ్ బస్వాని బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.
హాజరుకాని ఎమ్మెల్యే
మెరైన్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెరైన్ పోలీసుల నుంచి సరైన రీతిలో ఆహ్వానం అందకపోవడం వల్లే ఎమ్మెల్యే హాజరుకాలేదని సమాచారం.