ఈనెలఖరు నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
Published Tue, Aug 9 2016 1:47 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
జంగారెడ్డిగూడెం : ఇకపై వాహనం కొన్నచోటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌లో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను రవాణా శాఖ ఈ నెలాఖరు నుంచే జిల్లాలో ప్రారంభించనుంది. దీంతో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో ఈ పక్రియ అమలు జరుగుతోంది. ఈ నెలాఖరు నుంచి జిల్లాలో ప్రారంభించేందుకు రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై రెండు రోజుల పాటు అధికారులకు, వాహనాల డీలర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
రవాణా శాఖ ద్వారా 83 రకాల సేవలు
రవాణా శాఖ ఆయా వాహనాల యజమానులకు 83 రకాల సేవలు అందిస్తోంది. వీటిలో 80 రకాల సేవలను ఆన్‌లైన్ చేయాలని ఆ శాఖ నిర్దేశించింది. దీనిలో భాగంగానే తొలుత వాహన రిజిస్ట్రేషన్ సేవలను ఆన్‌లైన్ చేస్తోంది. మిగిలిన 79 రకాల సేవలనూ దశల వారీగా ఆన్‌లైన్ చేయనున్నారు. అయితే మిగిలిన మూడు రకాల సేవలైన లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సు, వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం ఖచ్చితంగా వాహన యజమానులు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిందే.
పారదర్శకత కోసమే..
పారదర్శకత కోసమే ఆన్‌లైన్ సేవలకు శ్రీకారం చుట్టినట్టు రవాణాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొత్త విధానం వల్ల వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఒక్కరోజులోనే పూర్తవుతుంది. దీనివల్ల దళారీ వ్యవస్థకూ చెక్‌పెట్టినట్టవుతుంది. ఏరోజుకారోజు వాహనాలన్నింటికీ రవాణాశాఖ నంబర్లు కేటాయిస్తుంది. ఒకవేళ కొనుగోలుదారుకు ఫ్యాన్సీ నంబర్ కావాల్సి వస్తే ఆ మేరకు అతను డీలర్‌కు లేఖ రాసివ్వాలి. దానిని బట్టి రవాణా శాఖ ఆ వాహనాన్ని ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపుతుంది. ఆ తర్వాత వాహన యజమాని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి తనకు కావాల్సిన నంబరును ప్రభుత్వం నిర్దేశించిన చలానా చెల్లించి పొందాలి.
రిజిస్ట్రేషన్ ఇలా..
షోరూం డీలర్లు వాహనాన్ని అమ్మగానే దానికి సంబంధించిన పత్రాలన్నీ స్కాన్ చేసి రవాణా శాఖ కార్యాలయానికి పంపాలి. కొనుగోలుదారు, వాహనంతో సహా రెండు ఫొటోలు, ఇంజిన్ నంబరు, చాసిస్ నంబరు ఫొటోలు, కొనుగోలు పత్రం, ఇన్వాయిస్, టాక్స్ రశీదు, బీమారశీదు, చిరునామా ప్రూఫ్ అన్నింటినీ రవాణా శాఖ కార్యాలయానికి ఆన్‌లైన్లో పంపాలి. దీంతోపాటు తక్షణ తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరును షోరూమ్‌లోనే ఇస్తారు. దీనికోసం రవాణా శాఖ ఆయా డీలర్లకు గుర్తింపు సంఖ్య, పాస్‌వర్డ్ ఇచ్చి శాఖ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తుంది. ఆన్‌లైన్‌లో వచ్చిన పత్రాలన్నింటిని పరిశీలించిన తర్వాత రవాణాశాఖ అధికారులు వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారు. అదే రోజు వాహన యజమానికి పీడీఎఫ్ ఫార్మెట్‌లో ఈ–మెయిల్‌కు, వాహన నంబర్‌తో సహా వివరాలతో కూడిన మెసేజ్ సెల్‌ఫోన్‌కు అందుతాయి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూరై్తనట్లే. ఆ తర్వాత కొనుగోలుదారుకు వారంలో ఆర్‌సీ పోస్టుద్వారా అందుతుంది. ఈ ప్రక్రియలో కొనుగోలు దారు రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. ఆన్‌లైన్‌లో పత్రాలను పరిశీలించిన తర్వాత రవాణాశాఖకు సందేహాలు ఉంటే రిమార్కుచేసి వెనక్కి పంపవచ్చు. భవిష్యత్తులో వాహనానికి సంబంధించిన ఏవైనా తేడాలు గుర్తిస్తే దానికి డీలరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక యజమాని సమర్పించిన పత్రాలకు సంబంధించి ఏవైనా తేడాలు ఉంటే వాహన యజమానిదే బాధ్యత.
రిజిస్ట్రేషన్ సులభతరం
ఇక నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సులభతరం కానుంది. ఈ నెలాఖరు నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనున్నాం. దీనివల్ల సమయం కలిసి రావడంతోపాటు దళారీ వ్యవస్థకు చెక్ పెట్టవచ్చు.
– కె.వి.సుబ్బారావు, ఆర్టీవో, ఏలూరు
Advertisement
Advertisement