పెద్దాసుపత్రిలో అరుదైన కిడ్నీ ఆపరేషన్లు
–ల్యాప్రోస్కోపిక్‌తో కిడ్నీల తొలగింపు
–ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటిసారి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మొదటిసారి ల్యాప్రోస్కోపిక్ పరికరంతో ఇద్దరు రోగులకు కిడ్నీలను తొలగించే శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. వివరాలను యురాలజిస్టు డాక్టర్ సీతారామయ్యతో కలిసి బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి తన చాంబర్‌లో విలేకరులకు వివరించారు. కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓబులేసు(27)కు జన్మత ఎడమ కిడ్నీ నాళం మూసుకుపోయి ఇబ్బంది పడేవాడు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన శేఖర్(23) సైతం ఎడమ కిడ్నీ చీము పట్టి బాధపడేవాడు. వీరిద్దరికీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని యురాలజీ విభాగాధిపతి డాక్టర్ సీతారామయ్య ఆధ్వర్యంలో వైద్యులు ల్యాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా కిడ్నీలను తొలగించారు. సాధారణంగా ఇలాంటి కేసులకు గతంలో ఓపెన్ సర్జరీలు చేసేవారమని, దీనివల్ల రోగికి 15 సెంటిమీటర్ల పరిధిలో కోత పెట్టి శస్త్రచికిత్స చేసేవారన్నారు. దీంతో పాటు ఆరు నెలల పాటు వీరు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో మూడు చోట్ల చిన్న గాటు పెట్టి ఆపరేషన్ చేస్తారని, విశ్రాంతి ఎక్కువగా అవసరం లేదని, రోగి త్వరగా కోలుకుంటాడన్నారు. ఇలాంటి ఆపరేషన్లు రాయలసీమలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటిసారిగా తామే చేశామన్నారు. ఆపరేషన్‌ను పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ చలపతి, డాక్టర్ అరుణలత, డాక్టర్ విశాల, అనెస్తెటిస్ట్ డాక్టర్ కొండయ్య, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ సాయిక్రిష్ణ నిర్వహించినట్లు చెప్పారు.