
రూ.17.4 లక్షలతో నవ్యాంధ్ర లడ్డూ
తాపేశ్వరం (మండపేట): తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో మరో భారీ లడ్డూ తయారీకి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది విశాఖలో ప్రవాస భారతీయుడు పల్లా రమణ నేతృత్వంలో నెలకొల్పనున్న 80 అడుగుల భారీ గణనాథుడి చెంత ఉంచేందుకు 8 వేల కిలోల భారీ లడ్డూను తయారు చేయనున్నట్టు శ్రీ భక్తాంజనేయ స్వీట్స్‌స్టాల్ అధినేత సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) మంగళవారం విలేకరులకు వెల్లడించారు.
ఈ అతిపెద్ద లడ్డూకు ‘నవ్యాంధ్ర లడ్డూ’గా నామకరణం చేశామన్నారు. ఈ నెల 15న ఉదయం 7 గంటలకు లడ్డూ తయారీ ప్రారంభించి 8 గంటల్లో పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు సుమారు రూ.17.40 లక్షల వ్యయం కానుందన్నారు. తమ సంస్థ 2011లో 5,570 కిలోల లడ్డూ, 2012లో 6,599, 2013లో 7,132, 2014లో 7,858 కిలోల లడ్డూలు తయారుచేసి వరుసగా నాలుగేళ్లు గిన్నిస్ రికార్డులను నెలకొల్పినట్టు చెప్పారు.