thapeswaram
-
బాలాపూర్ గణపయ్య లడ్డూ మనదే
తూర్పుగోదావరి, తాపేశ్వరం (మండపేట): రికార్డు స్థాయిలో వేలం జరిగే హైదరాబాద్లోని బాలాపూర్ గణపయ్య లడ్డూ తాపేశ్వరం నుంచే వెళుతోంది. ఎనిమిదేళ్లుగా తాపేశ్వరంలో హనీ ఫుడ్స్ అధినేత దేవు ఉమామహేశ్వరరావు స్వామివారికి కానుకగా అందజేస్తున్నారు. తేనెలొలికే మడత కాజాలకు పేరొందిన తాపేశ్వరం గ్రా మం గణేష్ లడ్డూల తయారీలోను గిన్నీస్ రికార్డుల ద్వారా విశ్వవిఖ్యాతమైన విషయం విదితమే. వినా యక చవితి సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించేందుకు ఉభయ రాష్ట్రాలకు చెందిన ఉత్సవ కమిటీలు తాపేశ్వరం నుంచి లడ్డూలు తీసుకువెళుతుంటారు. హైదరాబాద్లోని బాలాపూర్ గణపయ్య లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధరను దక్కించుకుంటూ ఖ్యాతి గాంచింది. బాలాపూర్ గణపయ్యకు తాపేశ్వరంలోని హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వరరావు లడ్డూను కానుకగా అందజేస్తున్నారు. రెండు కిలోల వెండి గిన్నెలో 20 నుంచి 25 కిలోల లడ్డూను తయారు చేసి తమ సంస్థ తరుఫున స్వామివారికి అందజేస్తున్నామని,ఎనిమిదేళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. 22 కిలోల బరువు గల ఈ లడ్డూను దక్కించుకునేందుకు సంపన్న వర్గాల వారు వేలంలో పోటీ పడుతుంటారు. గతేడాది దాదాపు రూ. 14.7 లక్షలకు వేలంలో భక్తుడు దక్కించుకున్నారన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూను గురువారం స్వామివారికి సమర్పించనున్నట్టు ఉమామహేశ్వరరావు తెలిపారు. -
రూ.17.4 లక్షలతో నవ్యాంధ్ర లడ్డూ
తాపేశ్వరం (మండపేట): తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో మరో భారీ లడ్డూ తయారీకి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది విశాఖలో ప్రవాస భారతీయుడు పల్లా రమణ నేతృత్వంలో నెలకొల్పనున్న 80 అడుగుల భారీ గణనాథుడి చెంత ఉంచేందుకు 8 వేల కిలోల భారీ లడ్డూను తయారు చేయనున్నట్టు శ్రీ భక్తాంజనేయ స్వీట్స్స్టాల్ అధినేత సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) మంగళవారం విలేకరులకు వెల్లడించారు. ఈ అతిపెద్ద లడ్డూకు ‘నవ్యాంధ్ర లడ్డూ’గా నామకరణం చేశామన్నారు. ఈ నెల 15న ఉదయం 7 గంటలకు లడ్డూ తయారీ ప్రారంభించి 8 గంటల్లో పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు సుమారు రూ.17.40 లక్షల వ్యయం కానుందన్నారు. తమ సంస్థ 2011లో 5,570 కిలోల లడ్డూ, 2012లో 6,599, 2013లో 7,132, 2014లో 7,858 కిలోల లడ్డూలు తయారుచేసి వరుసగా నాలుగేళ్లు గిన్నిస్ రికార్డులను నెలకొల్పినట్టు చెప్పారు.