
కరువు గుర్తించడంలో ప్రభుత్వం విఫలం
– ప్రభుత్వంపై మాజీ మంత్రి శైలజానాథ్ ద్వజం
అనంతపురం సెంట్రల్ : వర్షాభావంతో పంటలు నిట్టనిలువునా ఎండినప్పుడు కాకుండా ఆలస్యంగా కేంద్ర బృందం జిల్లాలో పర్యటించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఽ శనివారం కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం పొలాల్లో ఏమీ లేదని, ఈ సమయంలో కరువు బృందం పర్యటించడం వల్ల కరువు పరిస్థితులను చూపించడం కష్టమన్నారు. ఇంత ఆలస్యం కావడానికి కేంద్రానికి కరువు నివేదికలు పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కరువు బృందం పరిశీలించి, ఆర్థికసాయం కూడా అందిందని తెలిపారు. రైతులకు తక్షణం ఆర్థిక సాయంగా 5 వేల కోట్లు అందించాలని డిమాండ్ చేశారు. ‘ప్రాజెక్టు అనంత’ను అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. హెచ్చెల్సీ ద్వారా ఏప్రిల్ వరకూ ఆయకట్టు కింద నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధికారప్రతినిధులు రమణ, నాగరాజు, డీసీసీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, నాయకులు వాసు, వశికేరి శివ తదితరులు పాల్గొన్నారు.