రైతు పండించిన తైలం ఎల్లో చేమంతి
సేంద్రియంతో సిరులు
Published Thu, Aug 11 2016 10:27 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
60 సెంట్లలో సాగు
రూ.రెండు లక్షలు ఆదాయం
తక్కువ ఖర్చు... ఆదాయం అధికం
గంగవరం: మండల కేంద్రంలోని బసవరాజుకు రెండు ఎకరాల పొలం ఉంది. అందులో బిందు సేద్యంతో ఆయన చేమంతి పూల తోటలు సాగు చేస్తున్నాడు. రెండు ఎకరాల్లో నాలుగు విడతల్లో తైలం చేమంతి పూలు సాగు చేస్తున్నాడు. 10 వేల తైలం పసుపు, తెలుపు చేమంతి మొక్కల ద్వారా రూ. రెండు లక్షల ఆదాయం సంపాదిస్తున్నట్లు బసవరాజు తెలిపాడు. తమిళనాడులోని రాయకోట నుంచి ఆ రెండు రకాల పూల మొక్కలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు. రూ. రెండుకు ఓ మొక్క కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వివరించాడు.
ఎరువుల ఖర్చు లేదు
చేమంతి పూలతోటల సాగుకు సేంద్రియ ఎరువు, జీవామృతానికి కేవలం రూ.వెయ్యిలోపే ఖర్చు అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎరువు ఆవుపేడ, ఆవు గంజరం, శనగపిండి, కొంత మొత్తం బెల్లంతో తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఈ ఎరువు 20 రోజులకు ఓసారి మొక్కకు అందించాలి. దీనికి తోడు వేపాకు, ఆవుగంజరం, ఆవుపేడ మురగబెట్టి పిచికారి చేసి పంటను చీడపీడల నుంచి దూరం చేస్తున్నాని తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడే కాకుండా అధిక ఆదాయం పొందుతున్నాని తెలిపాడు.
జీరో బడ్జెట్‌తో ఎరువులు
ఇంట్లో దేశవాళీ ఆవు ఉంటే రెండు ఎకరాలకు సరిపోయే ఎరువులు తయారు చేయవచ్చని రైతు బసవరాజు సూచిస్తున్నాడు. ఆవు మూత్రం, పేడ, బెల్లం, శనగపిండితో జీవామృతం తయారు చేసుకోవచ్చు. దీనిని డ్రిప్ ద్వారా మొక్కకు అందిస్తున్నామని తెలిపారు. ఈ తరహా ఎరువు వల్ల పంట నాణ్యతతో పాటు దిగుబడికి మార్కెట్‌లో గిరాకీ ఉంటుందన్నాడు.
Advertisement