శోకసంద్రంలో విద్యార్థిని కుటుంబం | Sokasandranlo student's family | Sakshi
Sakshi News home page

శోకసంద్రంలో విద్యార్థిని కుటుంబం

Published Sat, Nov 19 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

Sokasandranlo student's family

గోపవరం (బద్వేలు) : కర్నూలు జిల్లా నంద్యాల ఆర్‌జీఎం ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని బీరం ఉషారాణి గురువారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో..  బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శుక్రవారం సాయంత్రం పుట్టాయపల్లెలో ఉషారాణి అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి అందివచ్చిన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. అలాగే ఉషారాణి స్నేహితులతోపాటు బంధువులు కూడా అంత్యక్రియలకు అధిక సంఖ్యలో హాజరై కన్నీటి పర్యంతమయ్యారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌.వి.సతీష్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో పాటు పలువురు నేతలు బాధిత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి సంతాపం తెలిపారు. కాగా విద్యార్థిని ఆత్మహత్యపై విభిన్న కారణాలు వస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే విజయమ్మతోపాటు పలువురు మండల స్థాయి టీడీపీ నేతలు నంద్యాల ఆర్‌జీఎం కళాశాలకు వెళ్ళినట్లు తెలిసింది. అలాగే ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసేందుకు వారితోపాటు బాధిత కుటుంబ సభ్యులు అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ ఘటనపై కొంత మంది సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదైనట్లు తెలుస్తున్నప్పటికీ అధ్యాపకుడి పాత్రపై కూడా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉషారాణి తల్లిదండ్రులు పోలీసులను కోరినట్లు తెలిసింది. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం మరే విద్యార్థికి జరగకూడదని, దోషులను కఠినంగా శిక్షించాలని ఉషారాణి తల్లిదండ్రులు, సోదరి జెడ్పీటీసీ సభ్యురాలు శిరీష జిల్లా టీడీపీ నేతలను కోరినట్లు తెలిసింది.

 

Advertisement

పోల్

Advertisement