వచ్చే నెల మొదటి వారంలో పది ఫలితాలు
► 92 శాతం ముల్యాంకనం పూర్తి
► టెన్త్ స్పాట్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్జేడీ
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షల ముల్యాంకనం పూర్తి కావొచ్చిందని, వచ్చే నెల మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ఆర్జేడీ బి. ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన టెన్త్ స్పాట్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలోని ప్రతి గదిని తనిఖీ చేసి, టీచర్లుకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీసీఈ విధానంలో పరీక్షలు జరిగినా ఫలితాలపై ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదన్నారు.
గతేడాది కంటే మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీసీఈ విధానంపై పదో తరగతి విద్యార్థులు మొదటి నుంచి అవగహన కల్పించామన్నారు. వచ్చే ఏడాది నుంచి నూతన విధానాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షల్లో కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో డీఈఓ తహెరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.