జిల్లాకు రెండు అగ్నిమాపక కేంద్రాలు
జిల్లాకు రెండు అగ్నిమాపక కేంద్రాలు
Published Tue, Apr 11 2017 5:43 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): జిల్లాకు రెండు అగ్నిమాపక కేంద్రాలు మంజూరు కాగా కుక్కునూరు, నల్లజర్లలో ఏర్పాటుచేయనున్నట్టు జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి డి.మాల్యాద్రి తెలిపారు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మిక తనికీ చేశారు. కేంద్రంలో యంత్రాలు, రికార్డులు, సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తణుకు, భీమడోలులో కూడా ఆకస్మిక తనిఖీలు చేశామని చెప్పారు. వేసవి దృష్ట్యా యుద్ధప్రాతిపదికన విలీన మండలాలు (కుక్కునూరు వేలేరుపాడు)కు సంబంధించి తాత్కాలిక ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. నల్లజర్లలో స్థలసేకరణ పూర్తయ్యిందని, ప్రభుత్వ ఆదేశాలు రాగానే శాశ్వత ప్రాతిపదికన భవనాలు నిర్మిస్తామని చెప్పారు.
500 మందితో వలంటీర్ల వ్యవస్థ
జిల్లాలో 500 మంది భాగస్వామ్యంతో కొత్తగా అగ్ని, నీటి ప్రమాదాల నివారణకు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటుచేశామని మల్యాద్రి చెప్పారు. తాడేపల్లిగూడెంలో 60 మంది వలంటీర్లను సిద్ధం చేశామన్నారు. వలంటీర్లుకు, అగ్నిమాపక సిబ్బందికి రాజమండ్రి వద్ద గోదావరిలో నీటి ప్రమాదాల నివారణలో శిక్షణ ఇచ్చామన్నారు. అగ్ని ప్రమాదాల్లో ఆస్తినష్టాన్ని తగ్గించేలా వలంటీర్లకు శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు.
25 మంది రెస్క్యూ టీమ్
జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అగ్నిమాపక కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లాస్థాయిలో 25 మందితో అధునాతన రెస్క్యూ బృందాన్ని సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. అగ్ని, నీటి ప్రమాదాల నివారణకు ఈ బృందం పనిచేస్తుందన్నారు. విష జంతువులను పట్టుకునే అంశాల్లో కూడా శిక్షణ ఇచ్చామన్నారు. తాడేపల్లిగూడెం కేంద్రంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు. తాడేపల్లిగూడెం కేంద్రం అధికారి వి.సుబ్బారావు ఆయన వెంట ఉన్నారు.
Advertisement