చాల్కిలో అసంపూర్ణంగా ఉన్న పశువైద్య కేంద్రం
- ఆందోళన చెందుతున్న సిబ్బంది
- పట్టించుకోని అధికారులు
- చర్యలు తీసుకోవాలని వినతి
- అలాగే సిబ్బంది కొరతతో అందని పశువైద్యసేవలు
న్యాల్‌కల్: పశు సంవర్థక శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం, ఉన్న ఒకటి రెండు భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, మంజూరైన భవనాల నిర్మాణ పనులు ఏళ్ల తరబడి నత్తనడకన కొనసాగుతుండడంతో ఇటు అధికారులు, అటు రైతులు, పశు పోషణాదారులు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకొని కూలడానికి సిద్దంగా ఉన్నాయి.
దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది భయాందోళన చేందుతున్నారు. మంజూరైన భవనాల నిర్మాణం పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీటికి తోడు వైద్యులు, సిబ్బంది కోరత కారణంగా పశువులకు సరైన వైద్యం అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
మండలంలోని న్యాల్‌కల్, మిర్జాపూర్(బి)లో పశు వైద్య కేంద్రాలు ఉన్నాయి. న్యాల్‌కల్ పశు వైద్య కేంద్రం పరిధిలో డప్పూర్, చాల్కి, న్యాల్‌కల్, మిర్జాపూర్(బి) పశు వైద్య కేంద్రం పరిధిలో హద్నూర్, మెటల్‌కుంట, మిర్జాపూర్(బి)లలో పశు వైద్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చాల్కి, హద్నూర్, మెటల్‌కుంట పశు వైద్య ఉప కేంద్రాల భవనాలు శిథిలాస్థకు చేరుకున్నాయి.
చాల్కిలోని పశు వైద్య ఉప కేంద్రం శిథిలావస్థకు చేరుకొని పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయని గ్రామంలో నిర్వహించిన పలు సమావేశాల్లో గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. ముఖ్యంగా వర్షాలకు పైకప్పు పెచ్చులూడి కింద పడుతుండడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోని వైద్య సిబ్బంది ఆందోళన చెందుత్నున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ప్రభుత్వం చాల్కికి నూతన భవనాన్ని మంజూరు చేసింది.
మూడేళ్ల క్రితం భవన నిర్మాణ కోసం రూ.5.40 లక్షలు మంజూరయ్యాయి. కాంట్రాక్టర పనులు ప్రారంభించాడు. రెండున్నర ఏళ్లు గడిచినా నిర్మాణ పనులు పూర్తికాలేదు. నిధులు సరిపోకపోవడంతో ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ఇటు వైద్య సిబ్బంది అటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హద్నూర్‌లో కూడా పశు వైద్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. భవనం కురుస్తుండటంతో మందులు భద్రపరచలేకపోతున్నామని సిబ్బంది విచారం వ్యక్తంచేశారు.
అలాగే మెటల్‌కుంటలో సొంత భవనం లేకపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలో ఒక గదిని పశు వైద్యశాల కింద ఉపయోగించుకుంటున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మించాలని, అసంపూర్తిగా ఉన్న భవనం నిర్మాణ పనులను పూర్తి చేయించి వినియోగంలోకి తేవాలని ఆయా గ్రామాల రైతులు, పశుపోషణాదారులు కోరుతున్నారు.
సిబ్బంది కోరతతో అందని వైద్యసేవలు
పశు వైద్య కేంద్రాలతో పాటు ఉప కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కోరతతో పశువులకు సక్రమంగా వైద్యం అందడం లేదని రైతులు, పశుపోషణాదారులు ఆరోపిస్తున్నారు. మండలంలో మొత్తం 39 గ్రామాలుండగా ఆస్పత్రులు మాత్రం ఆరు మాత్రమే ఉన్నాయి. అందులోనూ సిబ్బంది కోరత తీవ్రంగా ఉంది.
ఇద్దరు డాక్టర్లు ఉండవలసి ఉండగా కేవలం ఒక డాక్టర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. న్యాల్‌కల్‌లో ఉన్న ఒక్క డాక్టర్‌ను ఇతర ప్రాంతాల అదనపు బాధ్యతలను అప్పగించడంతో పశువులకు సరైన వైద్య అందడం లేదని రైతులు, పశు పోషణాదారులు ఆరోపిస్తున్నారు.
అలాగే చాల్కిలో వైద్య సిబ్బంది సమయానికి రాకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి పశువులకు చికిత్స చేయించాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని మరికొన్ని పశు వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో తగిన వైద్య సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎప్పుడూ మూసే ఉంటుంది
గ్రామ సమీపంలోని ఎస్సీ కాలనీ వద్ద ఉన్న ఆస్పత్రి ఎప్పుడూ మూసే ఉంటుంది. సిబ్బంది సక్రమంగా రాకపోవడంతో చిన్న చిన్న జబ్బులు వచ్చినా పశువులను ఇతర ప్రాంతాలకు తీసుకువెళుతున్నాం. కొత్తగా కట్టిన దవాఖాన కూడా చాలా రోజుల నుంచి పూర్తి కాలేదు. - సద్దాం, పశుపోషణాదారుడు, చాల్కి
భవనం నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి
గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఆస్పత్రి భవనం చాలా రోజుల నుంచి పూర్తి కాలేదు. ఉన్న పాత భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని భవనం పనులు త్వరగా పూర్తి చేయించాలి. - జైపాల్‌రెడ్డి, రైతు, చాల్కి
నిధులకు అనుగుణంగా పనులు చేపట్టలేదు
చాల్కి ఉపకేంద్ర భవన నిర్మానాణికి ప్రభుత్వం రూ. 5.40 లక్షలు మంజూరు చేసింది. కానీ నిధులకు అనుగుణంగా భవనం పనులు చేపట్టలేదు. పైగా నిధులు సరిపోకపోవడంతో పనులు మధ్యలోనే ఆపివేశారు. ఆయా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉంది. న్యాల్‌కల్‌లో ఉన్న డాక్టర్‌కు అదనపు బాద్యతలు అప్పగించారు. కొత్త డాక్టర్‌ను నియమించి న్యాల్‌కల్‌లో పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకుంటాం. - సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, జహీరాబాద్