ఈశాన్యంలో అలజడి! | Assam-Nagaland border clashes between | Sakshi
Sakshi News home page

ఈశాన్యంలో అలజడి!

Published Tue, Aug 19 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

Assam-Nagaland border clashes between

సంపాదకీయం

సమస్యను నాన్చడం ఏ పరిణామాలకు దారితీస్తుందో, ఎంతగా వికటిస్తుందో అస్సాం-నాగాలాండ్ సరిహద్దులమధ్య మరోసారి చెలరేగిన ఘర్షణలు తెలియజెబుతున్నవి. గత కొన్నిరోజులుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో 14మంది పౌరులు మరణించారు. మరికొందరి ఆచూకీ తెలియడంలేదు. తమకు రక్షణ కల్పించడంలోనూ, ఈ సమస్యకు పరిష్కారం సాధించడంలోనూ విఫలమయ్యారన్న ఆగ్రహంతో సహాయ శిబిరాలను సందర్శించడానికి సోమవారం వెళ్లిన అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్‌పై జనం దాడికి కూడా ప్రయత్నించారు. ఆయన కాన్వాయ్‌లోని రెండు వాహనాలను ధ్వంసం చేశారు. ఒకపక్క బ్రహ్మపుత్ర ఎప్పటిలానే ఉగ్రరూపం దాల్చి అనేక ప్రాంతాలను ముంచెత్తి, వేలాదిమందిని నిరాశ్రయులను చేస్తుండగా...దానికి సమాంతరంగా ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోనూ పరస్పర హననం కొనసాగుతున్నది.

రెండు ఇరుగు పొరుగు రాష్ట్రాలు శత్రు దేశాల్లా సంఘర్షించుకోవడం... హత్యలకు, కిడ్నాప్‌లకు, గృహదహనాలకు పాల్పడటం మనం ఈశాన్యంలోనే చూస్తాం. అంతేకాదు...నాగా మిలిటెంటు సంస్థలు రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతంలో బంకర్లు సైతం నిర్మించారు. ఈ ఘర్షణలన్నిటికీ గోలాఘాట్ జిల్లాలోని మేరపాని ప్రధాన వేదికగా ఉంటూ వస్తున్నది. తరుణ్ గోగోయ్‌పై దాడికి ప్రయత్నించిన ప్రాంతం కూడా ఇదే. గొడవ జరిగిన ప్రతిసారీ అవతలి పక్షాన్ని తప్పుపట్టడం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టారని ఆరోపించడం పరిపాటి. ఇప్పుడు కూడా అలాంటి కథనాలే వినిపిస్తున్నాయి. నాగాలాండ్ లోపలికి చొచ్చుకొచ్చిన కొందరు ఆదివాసీ మిలిటెంట్లు రెండు గ్రామాలను చుట్టుముట్టి ఇళ్లను ధ్వంసం చేశారని, ప్రతిఘటించబోయిన పౌరులపై కాల్పులు జరిపారని నాగాలాండ్‌లోని నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, నాగా మిలిటెంట్లు అస్సాంలోకి ప్రవేశించి 13 గ్రామాల్లోని ఇళ్లను తగలబెట్టారని ఇటువైపు వారు చెబుతున్నారు. పర్యవసానంగా అస్సాంలో నాగాలాండ్‌కు దారితీసే రహదారిని దిగ్బంధించారు. ఈ దిగ్బంధంవల్ల నాగాలాండ్‌కు నిత్యావసర సరుకుల రవాణా నిలిచిపోయింది.

రెండు రాష్ట్రాల మధ్యా సరిహద్దు ఘర్షణ ఈనాటిది కాదు. 1963లో నాగాలాండ్ ఏర్పడిననాటినుంచీ ఆ ఘర్షణ అడపా దడపా స్వల్పస్థాయి ఘర్షణగా...అప్పుడప్పుడు అత్యంత తీవ్రంగా రేగుతూనే ఉన్నది. 1985లో అస్సాం-నాగాలాండ్ పోలీసుల మధ్య వివాదం ముదిరి పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో వందమందికి పైగా మరణించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ సరిహద్దు వద్ద కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)ను ఉంచాలని నిర్ణయించింది. అయితే, దీనివల్ల పరిస్థితి చక్కబడిందేమీ లేదు. ఇప్పుడు వారి కళ్లముందే ఇరు ప్రాంతాల పౌరులూ ఘర్షణలకు దిగారు. అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గనుక దాన్ని అస్థిరపరచాలన్న దురుద్దేశంతోనే సీఆర్‌పీఎఫ్ తగిన చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నియంత్రించిందన్నది తరుణ్ గోగోయ్ ఆరోపణ. ఈ ఆరోపణల సంగతెలా ఉన్నా అస్సాంలోని గోలాఘాట్, శివసాగర్, జోర్హాట్ జిల్లాల్లో తమకు చెందిన 4,974 చదరపు మైళ్ల భూమి ఉన్నదని, దాన్ని వెంటనే బదలాయించాలని నాగాలాండ్ సర్కారు డిమాండుచేస్తోంది. తమ భూమే నాగాలాండ్‌కు అక్రమంగా బదిలీ అయిందని అస్సాం వాదిస్తున్నది.  ఈ సమస్య సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న కర్బీ, రేంగ్మా జాతులను శత్రువులుగా మార్చింది.  పొట్టకూటి కోసం రెండు రాష్ట్రాల్లోనూ సంచరించక తప్పని ఈ జాతుల ప్రజలు తరచు మిలిటెంటు సంస్థలకు టార్గెట్లుగా మారుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నెల 12న మళ్లీ ప్రారంభమైన మారణహోమంలో బలైనదీ ఇలాంటివారే. గోలాఘాట్ జిల్లాలోని ఒక గ్రామంలో తొమ్మిది మృత దేహాలు దొరకగా, ఆ మర్నాడు ఇంకొక గ్రామంలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ హత్యలకు ప్రతీకారంగా నాగాలాండ్ గ్రామాలపై దాడులు, గృహదహనాలు జరిగాయి. తమ గ్రామంనుంచి ఇద్దరు పౌరులను అపహరించుకుపోయారని, వారి ఆచూకీ తెలియడంలేదని నాగాలాండ్‌లోనివారు ఆరోపిస్తున్నారు. సోదరభావం పెంపొందించుకోవాలని, శత్రువైఖరిని విడనాడాలని ఎన్నికల సమయంలో నాయకులు ప్రజలకు సుద్దులు చెబుతారుగానీ, సాధారణ సమయంలో ఆ ఘర్షణలను రెచ్చగొట్టే శక్తులకు మద్దతుగా నిలుస్తారు. అందువల్లే సమస్య రాను రాను జటిలమవుతున్నది.

సమస్యలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న రెండు రాష్ట్రాలూ సరిహద్దు వివాదంపై మాట్లాడుకోవు. విభ జన రేఖలు గీసిన కేంద్ర ప్రభుత్వమూ మౌనం పాటిస్తుంది.  కానీ, సీఆర్‌పీఎఫ్‌పై తమకు నమ్మకం పోయింది గనుక...సరిహద్దు ప్రాంతంలో నిఘాకు యువకులతో సొంతంగా గస్తీ దళాన్ని ఏర్పరుస్తామని అస్సాం ముఖ్యమంత్రి గోగోయ్ ప్రకటిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి దళం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అన్వేషించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నాలుగేళ్లక్రితం ముందుకొచ్చింది. చెన్నైకి చెందిన శ్రీరాం పంచూ, గుజరాత్ హైకోర్టుకు చెందిన నిరంజన్ భట్ అనే న్యాయవాదులను మధ్యవర్తులుగా నిమించింది. సుప్రీంకోర్టు చేతుల్లోకి వెళ్లింది కదానని చేతులు దులుపుకోవడం కాక రెండు రాష్ట్రాలూ, కేంద్రమూ ఆ మధ్యవర్తుల పని మరింత సులభం కావడానికి తాము కూడా చొరవ తీసుకుని కదిలివుంటే పరిష్కారం ఈసరికే వచ్చి ఉండేదేమో! ఆ పని జరగకపోవడంవల్లే మరోసారి అస్సాం-నాగాలాండ్ సరిహద్దులు నెత్తురోడాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వమైనా ఈ సమస్యపై దృష్టిపెట్టి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలి. అమాయక పౌరుల ప్రాణాలను కాపాడాలి.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement