అస్సాంలో పోలీసు కాల్పులు
ముగ్గురి మృతి, 20 మందికి గాయాలు
అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో కొనసాగుతున్న నిరసనలు
గోలాఘాట్: అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో తొమ్మిది మంది హత్యకు నిరసనగా కొనసాగుతున్న వరుస ప్రదర్శనలు బుధవారం రక్తసిక్తమయ్యాయి. నిరసనకారులు పట్టణంలోని డిప్యూటీ పోలీసు కమిషనర్ కార్యాలయంతో పాటు ఓ పోలీసు స్టేషన్‌కు నిప్పుపెట్టేందుకు ప్రయత్నించడం, ఓ ఆసుపత్రిపై దాడికి యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు మరణించగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గోలాఘాట్ జిల్లాలోని ఉరియమ్‌ఘాట్‌లో ఆగస్టు 12న కొందరు దుండగులు కొంత మందిని కాల్చిచంపడం, వారు పొరుగునున్న నాగాలాండ్‌కు చెందినవారని భావిస్తుండటంతో అస్సాంలో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. రాన్‌గజన్ ప్రాంతంలో మంగళవారం స్థానికులను పోలీసులు ఇళ్ల నుంచి బయటికి లాక్కొచ్చి మరీ చితక్కొట్టిన ఉదంతాన్ని నిరసిస్తూ బుధవారం ఎరెంగపడ చరైలీ ప్రాంతంలో ఆందోళనలు చేపట్టారు. డీసీపీ కార్యాలయం, పోలీసు స్టేషన్ వద్ద గుమిగూడిన వెయ్యిమందికిపైగా ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు తొలుత బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
అల్లరిమూక రాళ్లు విసరడంతోపాటు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. నిరసనకారులు కుషాల్ కన్వర్ ఆస్పత్రిపై దాడికి పూనుకోవడంతో పాటు రాళ్లు రువ్వి పౌరులనూ గాయపర్చారని స్థానిక ఎస్పీ శిలాదిత్య చేటియా పేర్కొన్నారు. తాజా ఘటనల నేపథ్యంలో అస్సాంలోని నాగాలాండ్ సరిహ ద్దు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి, సైన్యాన్ని మోహరించారు. కాగా, నిరసనకారులపై కాల్పుల ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో హింసపై ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ నివేదికను సమర్పించింది. గొగోయ్, నాగాలాండ్ సీఎం టీఆర్ జిలియాంగ్‌లతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్‌లో మాట్లాడి వివాదాన్ని త్వరగా సద్దుమణిగేలా చేయాలని సూచించారు.
ఇదీ అల్లర్ల నేపథ్యం: అస్సాం-నాగాలాండ్ సరిహద్దు వివాదం 50 ఏళ్ల క్రితం.. నాగాలాండ్ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచీ కొనసాగుతోంది. ప్రతిసారీ మీరంటే మీరే దురాక్రమణలకు దిగుతున్నారంటూ ఇరురాష్ట్రాల వారూ ఆరోపించుకుంటూ వస్తున్నారు. ఈ సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం వహించినా.. సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యలో తాజాగా అస్సాంలోని ఏడు సరిహద్దు గ్రామాల్లో ఇటీవల 15 మంది హత్యకు గురయ్యారు.