ఏ పనైనా చేయాలంటే నిధులకంటే ముందు కావలసినవి చిత్తశుద్ధి, దృఢసంకల్పం. ఆ రెండూ కొరవడబట్టే రెండోసారి మొదలైన గంగా ప్రక్షాళన కార్యక్రమం అడపా దడపా సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతున్నా ఈసురోమంటున్నది. తాజాగా కాలుష్య నియంత్రణ బోర్డుల చేతగానితనాన్ని ఎత్తిచూపుతూ బుధవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పరిశ్రమల వ్యర్థాలు ఆ నదిలో కలవకుండా చర్యలు తీసుకోవడంలో బోర్డులు ఘోరంగా విఫలమయ్యాయని మందలించి, ఇకపై ఆ బాధ్యతలను జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు అప్పగించింది. గంగా ప్రక్షాళనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలూ, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆశలూ చాలానే ఉన్నాయి. మరో అయిదేళ్లలో 150వ జయంతిని జరుపుకోబోతున్న మహాత్ముడికి ఘన నివాళి అర్పించడం కోసం అప్పటికల్లా గంగానది ప్రక్షాళన పూర్తి చేద్దామని మొన్నటి మే నెలలో గంగాహారతి రోజున వారణాసిలో మోదీ పిలుపునిచ్చారు. దానికి కొనసాగింపుగా తన ప్రభుత్వంలో గంగా పునరుజ్జీవన మంత్రిత్వశాఖను ఏర్పరచి జలవనరుల శాఖ బాధ్యతలను చూస్తున్న ఉమాభారతికే ఆ శాఖను కూడా అప్పగించారు. కేంద్ర బడ్జెట్‌లో ‘నమామి గంగ’ ప్రాజెక్టును ప్రకటించారు. అంతేకాదు... ఈ ప్రక్షాళన కార్యక్రమంలో కేంద్రంలోని పర్యావరణ శాఖ, విద్యుత్తు, ఉపరితల రవాణా, పర్యాటకం, నౌకాయాన శాఖలు కూడా పాలుపంచుకోబోతున్నాయని చెప్పారు. ఇవన్నీ తమపరంగా ఏమేమి చేయవచ్చునన్న విషయంలో ప్రత్యేక దృష్టిని సారిస్తాయి. ఈ కార్యక్రమానికి నిధుల కొరత రానీయబోమని కూడా కేంద్రం ప్రకటించింది. మరోపక్క దీన్నంతటినీ సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది.
కార్యక్రమం ఎంతవరకూ వచ్చిందో చూస్తున్నది. ఇంతమంది ఇన్నివిధాల కృషిచేస్తున్నట్టు కనబడుతున్నా గంగా ప్రక్షాళన ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు నిలిచిపోయింది. గత నెలలో కేంద్రం తనముందు పెట్టిన ప్రతిపాదనలను చూసి వాస్తవిక దృక్పథంతో, ఆచరణసాధ్యమైన ప్రణాళికతో రావాలని న్యాయమూర్తులు సూచించారు. అందుకనుగుణంగా వచ్చే 18 సంవత్సరాల్లో తీసుకోబోయే స్వల్పకాలిక (మూడేళ్లు), మధ్యకాలిక (అయిదేళ్లు), దీర్ఘకాలిక (పదేళ్లు) చర్యలేమిటో వివరిస్తూ కేంద్రం మరో అఫిడవిట్‌ను సమర్పించింది. నదీ తీరం పొడవునా ఉన్న 181 పట్టణాల్లో ముందుగా పారిశుద్ధ్యాన్ని చేపడతామన్నది. ఈ విషయంలో గంగ పారే రాష్ట్రాలతో కూడా చర్చిస్తామని చెప్పింది. ఇంత జరిగాక కాలుష్య నియంత్రణ బోర్డులు తాము చేయాల్సిందేమిటో, చేస్తున్నదేమిటో సమీక్షించుకుని పకడ్బందీ ప్రణాళికలను రూపొందించుకోవాల్సింది. కానీ, అప్పుడే నిద్ర నుంచి లేచినట్టుగా సుప్రీంకోర్టు ముందుకు ఉత్తచేతులతో వెళ్లి చీవాట్లు తింది.
శతాబ్దాలుగా ఈ దేశ పౌరుల జీవనంతో, హిందూ మత విశ్వాసాలతో పెనవేసుకున్న నది గంగ. కానీ, అలాంటి విశ్వాసాలు రాజకీయ ప్రయోజనాలకు పనికొచ్చినంతగా ఆ నదీమతల్లిని కాపాడుకోవడానికి ఉపయోగపడటంలేదు. ఉత్తరాఖండ్‌ను బీజేపీ ఏలుతుండగా మూడేళ్లక్రితం స్వామీ నిగమానంద అనే కాషాయాంబరధారి గంగానదీ జలాలు కలుషితంకాకుండా చూడాలని, అక్కడ మాఫియాలు సాగిస్తున్న ఇసుక తవ్వకాలను తక్షణమే ఆపాలని కోరుతూ నాలుగు నెలలపాటు హరిద్వార్‌లో నిరాహార దీక్షకు కూర్చుని, చివరకు అందులోనే కన్నుమూశారు. ఆయన దీక్షా సమయంలోగానీ, ఆయన మరణించాకగానీ ఆనాటి బీజేపీ సర్కారు పట్టనట్టే ఉండిపోయింది. ఇంకా వెనక్కు వెళ్తే 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఎంతో ఆర్భాటంగా గంగా కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. మూడు దశాబ్దాలు గడిచి, రూ. 20,000 కోట్ల ప్రజాధనం ఖర్చయినాక గంగానది కాలుష్యం మరింత పెరిగిందని నిర్ధారణ అయింది. గంగా నదీ జలాలు అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవులకు ఆవాసంగా మారాయని మొన్నటి ఫిబ్రవరిలో బ్రిటన్ కు చెందిన న్యూకేజిల్ యూనివర్సిటీ, ఢిల్లీ ఐఐటీ సంయుక్తంగా నిర్వహించిన పరీక్షల్లో తేలింది. మే, జూన్ మాసాల్లో రిషికేశ్, హరిద్వార్‌లకు లక్షలాది భక్తులు విచ్చేసినప్పుడు ప్రాణాంతకమైన ఎన్‌డీఎం-1 వైరస్ జాడ మిగిలిన సమయాల్లోకంటే 60 రెట్లు ఎక్కువగా ఉంటున్నదని ఆ పరీక్షలు వెల్లడించాయి.
గంగానది 11 రాష్ట్రాలగుండా 2,510 కిలోమీటర్ల మేర పారి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ తీరం పొడవునా 700కు పైగా పరిశ్రమలున్నాయి. ఇవిగాక 37 తోళ్లశుద్ధి కర్మాగారాలున్నాయి. ఇవన్నీ విడిచే వ్యర్థాలూ, పట్టణాలనుంచి వచ్చే మురుగునీరూ ఈ నదిలోనే కలుస్తుంది. పరిశ్రమలపై చర్య తీసుకోవడంతోపాటు ఆయా మున్సిపల్ సంస్థలు మురుగునీటిని రీసైకిల్ చేసి వేరే ప్రయోజనాలకు ఉపయోగించేలా చూస్తే తప్ప గంగానదిని ప్రక్షాళన చేయడం సాధ్యంకాదు. నదీ జలాల్లో వ్యర్థాలు ఏమేరకు పెరుగుతున్నాయో ఎప్పటికప్పుడు చూసేందుకు ముఖ్యమైన ప్రాంతాల్లో సెన్సర్లను పెడతామని రెండు నెలలక్రితం కేంద్రం చెప్పినా ఇంతవరకూ ఆ దిశగా సరైన చర్యలు లేవు. అలాగే, కాలుష్య నియంత్రణ బోర్డులు కఠినంగా వ్యవహరించేలా చూడటంలో కూడా పాలకులు వెనకబడ్డారు. గంగ పునరుజ్జీవనంపై ఇంతగా శ్రద్ధ చూపుతున్నట్టు కనబడుతూనే కాలుష్య నియంత్రణ బోర్డులను అందులో భాగస్వాములను చేయలేకపోతున్నారు. బోర్డులు నిర్వర్తించా ల్సిన కర్తవ్యాలను ఇకపై జాతీయ హరిత ట్రిబ్యునల్ స్వీకరించడంవల్లనైనా ప్రయో జనం కలుగుతుందేమో చూడాలి. అయితే, ఈ బాధ్యతలను ట్రిబ్యునల్ సమర్థ వంతంగా నిర్వహించడానికి అవసరమైన సిబ్బందిని, శాస్త్రవేత్తలను సమకూర్చ వలసిన బాధ్యత కేంద్రంపైనే ఉన్నది. అన్ని భగీరథ యత్నాలూ ఫలించి, గంగమ్మ తల్లి మునుపటి రూపు సంతరించుకోవాలని అందరం ఆశిద్దాం.
నత్తనడకన గంగానది ప్రక్షాళన
Published Thu, Oct 30 2014 11:41 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement