మీరట్ ‘న్యాయం’ | Meerut 'justice' | Sakshi
Sakshi News home page

మీరట్ ‘న్యాయం’

Published Tue, Mar 24 2015 12:34 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

హషింపురా కేసులో నిందితులైన కానిస్టేబుళ్లు(ఫైల్ ఫోటో) - Sakshi

హషింపురా కేసులో నిందితులైన కానిస్టేబుళ్లు(ఫైల్ ఫోటో)

సంపాదకీయం
 న్యాయం కోసం కోర్టు గుమ్మం ఎక్కేవారికి సకాలంలో దాన్ని అందించడంలో విఫలమైతే దేశంలో అరాచకం, అవ్యవస్థ నెలకొంటుందని లా కమిషన్ కొన్నాళ్లక్రితం హెచ్చరించింది. పౌరులు న్యాయం కోసం దశాబ్దాల తరబడి నిరీక్షించాలనడం వారిని చట్టవ్యతిరేక పద్ధతుల్లో పరిష్కారం వెదుక్కోమని సూచించడమే అవుతుందని స్వయానా సుప్రీంకోర్టే చెప్పింది. అయినా పరిస్థితి మారలేదు సరికదా... న్యాయం కూడా లభించడం లేదని 28 ఏళ్లనాటి మీరట్ నరమేథంలో ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు వెల్లడిస్తున్నది. 1987 మే 22నాటి ఆ ఉదంతం అత్యంత అమానుషమైనది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఉన్న హషింపురా ప్రాంతంలో ఆయుధాల కోసం ఇల్లిల్లూ గాలించి, ఆ క్రమంలో నిర్బంధంలోకి తీసుకున్నవారిలో 42 మందిని కాల్చి చంపి వారి శవాలను గంగానది కాల్వలోకి విసిరేసిన ఉదంతమది. సరైన సాక్ష్యాధా రాలు లేని కారణంగా నిందితులంతా నిర్దోషులని ఇన్నేళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చిం ది. కిందిస్థాయి కోర్టులో తీర్పు రావడానికే ఇంత సమయం పడితే... దానిపై అప్పీళ్ల విచారణ ఎన్నేళ్లు సాగుతుందో ఊహించడం కూడా సాధ్యం కాదు. మీరట్ ఉదంతంలో హత్యకు గురైనవారంతా ముస్లిం యువకులు, మైనర్ బాలురే. అందరూ రోజుకూలీపైనా, నేత పనిపైనా ఆధారపడి బతుకీడుస్తున్నవారే. ఆ ఘటనకు ముందు మీరట్‌లో మత ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో పదిమంది మరణించగా, ఆస్తులు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు కర్ఫ్యూ విధించడంతోపాటు ప్రొవిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబులరీ(పీఏసీ)ని పిలిపించారు. మీరట్‌లో హషింపురా ప్రాంతం నిజానికి ప్రశాంతమైనది. అంత కల్లోలంలోనూ అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు. కానీ, పీఏసీ జవాన్లు ఆ ప్రాంతాన్నే ఎన్నుకుని దాడిచేశారు.

 ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో, ఎంత నిర్లక్ష్యానికి గురైందో చూస్తే గుండెలవిసిపోతాయి. తమ యూనిఫాంనూ, ఆయుధాలనూ ఉపయోగించుకుని... తమకప్పగించిన బాధ్యతలను గాలికొదిలి ఉద్దేశపూర్వకంగా హత్యలకు పాల్పడిన వారిని ఉన్నతస్థాయిలో ఉన్నవారు నదురూ బెదురూ లేకుండా కాపాడిన ఉదంతమిది. ఈ కేసులో అసలు చర్యలు ప్రారంభించడానికే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రాలేదు. బాధిత కుటుంబాలకిచ్చే పరిహారాన్ని పెంచమని, ఈ ఉదంతంపై న్యాయ విచారణ జరిపించాలని ప్రజాతంత్ర హక్కుల సంస్థ పీయూడీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాక మాత్రమే కదలిక వచ్చి సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటికి ఏడెనిమిది నెలలు గడిచిపోయాయి. 1988లో ప్రారంభమైన ఈ దర్యాప్తు ఆరేళ్లు కొనసాగి చివరకు 19మంది పీఏసీ జవాన్లపై 1994లో చార్జిషీటు దాఖలైంది. ఈ కేసులో హాజరుకావాలంటూ గజియాబాద్ కోర్టు జారీచేసిన సమన్లను వీరిలో ఏ ఒక్కరూ ఖాతరుచేయలేదు. ఎవరూ కోర్టుకు హాజరుకాలేదు. పదమూడేళ్ల వ్యవధిలో 23సార్లు ఆ కోర్టు నాన్- బెయిలబుల్ వారెంట్లు జారీచేసినా పట్టించుకున్న నాథుడు లేడు. ఎట్టకేలకు 2000 సంవత్సరం మే నెలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక 19 మంది నిందితుల్లో 16 మంది ‘లొంగిపోయారు’. వారందరికి కొద్దిరోజుల్లోనే బెయిల్ లభించింది. నిందితులంతా ప్రభుత్వోద్యోగులే కనుక వారు తప్పించుకునే అవకాశం లేదని గజియాబాద్ కోర్టు భావించింది. ఈ కోర్టులో తమకు న్యాయం లభించదని భావిస్తున్నామంటూ 2001లో బాధిత కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్ తర్వాత దీన్ని ఢిల్లీలోని తీస్‌హజారి కోర్టుకు బదిలీ చేశారు. అక్కడ రోజువారీ ప్రాతిపదికన కేసు విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించినా యూపీ ప్రభుత్వ వైఖరి కారణంగా అది సాధ్యపడలేదు. మరో అయిదేళ్లకు....అంటే 2006లో నిందితులపై హత్య, హత్యకు కుట్ర, అపహరణ, సాక్ష్యాధారాల ధ్వంసంవంటి అభియోగాలతో నేరారోపణలు ఖరారయ్యాయి. ఈ కేసు కొనసాగుతున్న సమయంలో యూపీలో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లి బీజేపీ ప్రభుత్వం...ఆ తర్వాత బీఎస్‌పీ, ఎస్పీ ప్రభుత్వాలు వచ్చాయి. ఎవరొచ్చినా ఇందులో ఎలాంటి పురోగతీ లేదు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంలోనే ఎంతో జాప్యం చోటుచేసుకుంది. అలా నియమితులైన వారు కూడా కేసును శ్రద్ధగా పనిచేయని తీరును గ్రహించి కోర్టు ఒకటికి రెండుసార్లు మందలించాల్సివచ్చింది. చిత్రమేమంటే...ఈ కేసులో నేరారోపణలు ఎదుర్కొన్నవారిలో కొందరికి పదోన్నతులు కూడా లభించాయి. నిందితుల సర్వీసు రికార్డుల్లో అసలు హషింపురా ఉదంతంలో వారి ప్రమేయం ఉన్నట్టు వచ్చిన ఆరోపణల గురించిగానీ, కేసుల గురించిగానీ ప్రస్తావనే లేదు! 19 మంది నిందితుల్లో ముగ్గురు చనిపోగా ఆరుగురు రిటైరయ్యారు. మిగిలిన పదిమందీ పీఏసీలోనే కొనసాగుతున్నారు.

  మన దేశంలో నేరం-శిక్ష అనేవి ఎంత ప్రహసనప్రాయ స్థితికి చేరాయో చెప్పడానికి మీరట్ నరమేథం విషాదకరమైన ఉదాహరణ. దేశంలోని వివిధ కోర్టుల్లో 74 లక్షల క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి సత్వర పరిష్కారం కోసమంటూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుతోసహా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా నత్తనడక నడుస్తున్న ఇలాంటి కేసుల్లో బాధ్యుల్ని గుర్తించడం, చర్య తీసుకోవడం సాధ్యపడుతుందా? స్వయంగా సుప్రీంకోర్టే అనేక సందర్భాల్లో జోక్యం చేసుకున్నా చివరకు ఇలాంటి ఫలితం వచ్చిందంటే కిందినుంచి పైవరకూ వ్యవస్థ ఎంతగా భ్రష్టుపట్టిందో అర్థమవుతుంది. దారుణమైన నేరాల్లో నిందితులు నిర్దోషులని తేలిన సందర్భాల్లో దర్యాప్తు చేసిన అధికారులను బాధ్యులుగా పరిగణించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నిరుడు జనవరిలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మీరట్ నరమేథం కేసులో ఆ సూత్రాన్ని వర్తింపజేయాలి. చట్టబద్ధమైన విధానాల్లో తమకు న్యాయం లభించదని బాధితులు భావించే స్థితి ఏర్పడటం పౌర సమాజం మనుగడకు హానికరం. అలాంటి స్థితి ఏర్పడటానికి బాధ్యులైనవారిపై చర్యకు ఉపక్రమించడం ఉత్తమం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement