మెదక్‌ డీఎం వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికుల ధర్నా | Medak RTC Workers Protests Against Medak Depo Manager | Sakshi
Sakshi News home page

మెదక్‌ డీఎం వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికుల ధర్నా

Published Fri, Sep 13 2019 10:35 AM | Last Updated on Fri, Sep 13 2019 10:35 AM

Medak RTC Workers Protests Against Medak Depo Manager - Sakshi

మెదక్‌ డీఎం కార్యాలయం ఎదుట ధర్నాచేస్తున్న కార్మికులు

సాక్షి, మెదక్‌: కొన్ని రోజులుగా మెదక్‌ ఆర్టీసీ డీఎంకు కార్మికులకు మధ్య నివురుగప్పిన నిప్పులా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరి మధ్య విభేదాలు గురువారం తారా స్థాయికి చేరటంతో కార్మికులు ఏకంగా డీఎం కార్యాలయం ఎదుట గంటపాటు ధర్నా చేసి డీఎం డౌన్‌డౌన్‌  అంటూ నినాదాలు చేశారు. బస్సులు ఎక్కడికక్కడా ఆగిపోవటంతో విషయం తెలుసుకున్న పోలీసులు డీఎంకు కార్మికుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించడంతో నాలుగు గంటల పాటు కొనసాగిన చర్చలు చివరకు విఫలమయ్యాయి.  

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఆగస్టు 28న, ఆర్టీసీ టీఎంయూ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్‌ఎం కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. ఇందులో భాగంగా మెదక్‌ డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో పాటు ఇతర సిబ్బంది సుమారు 70 మంది సంగారెడ్డి ఆర్‌ఎం కార్యాలయానికి ధర్నాకు వెళ్లారు. దీంతో ఆ మరుసటి రోజు నుంచి డిపో మేనేజర్‌ జాకీర్‌ హుస్సేన్‌  కార్మికులపై కక్షకట్టి 65 మంది కార్మికులకు చార్జిమెమో ఇచ్చారని, దీనికి నిరసనగా గురువారం డిపో ఎదుట ధర్నాకు దిగారు.

 కార్యక్రమంలో కార్మికులనుద్ధేశించి టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్‌కె రావు, డిపో కార్యదర్శి శాకయ్యలు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నాకు వెళ్తే మాపై కావాలనే డీఎం కక్షగట్టి చార్జిమెమో ఇచ్చారని మండిపడ్డారు. అంతే కాకుండా నాటి నుంచి నేటివరకు జ్వరమొచ్చినా, మరేమైన అత్యవసర మొచ్చి సెలవు అడిగినా ఇవ్వడం లేదని వాపోయారు. సరిపడా సిబ్బంది లేకపోయినా అదనపు భారం పైన వేసుకుని బస్సులను నడుపుతూ అనేక ఇబ్బందులు పడుతూ డిపో అభివృద్ధికోసం అహర్నిశలు కష్టపడుతున్నా మాపై డీఎం కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే చాలీచాలని జీతాలు ఆలస్యంగా ఇస్తున్నా పనిచేస్తున్నామన్నారు.

ముఖ్యంగా టీమ్‌ డ్రైవర్లను డీఎం మరింత వేధిస్తున్నారన్నారు. కండక్టర్‌ లేకుండా డ్రైవరే బస్సు నడుపుతూ టికెట్లు ఇస్తూ సకాలంలో ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుస్తున్నా ఎవరైనా చిన్నపాటి ఫిర్యాదులు చేసినా డ్రైవర్లను అనేక ఇబ్బందులు పడుతూ మెమోలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు మండిపడ్డారు. మెదక్‌ డిపో రాష్ట్రంలో 5వ, స్థానంలో ఉందని రాత్రింబవళ్లు కార్మికులు కష్టపడంతోనే ఆ స్థానంలో నిలిచిందని ఇటీవలే ఉన్నతాధికారుల చేతుల మీదుగా డీఎం అవార్డును సైతం అందుకున్నాడని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్‌  నాయకులు బోస్, మొగులయ్య, అశ్వక్‌హైమద్, ఆర్‌కె రెడ్డి, యాదయ్య, సంగమేశ్వర్, సత్యం, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.  

విఫలమైన చర్చలు? 
పోలీసుల మధ్యవర్తిత్వంతో టీఎంయూ నాయకులు, డీఎం మధ్య సుమారు 4 గంటల పాటు చర్చలు జరిగాయి. కార్మికుల డీఎం ముందు పెట్టిన పలు సమస్యలకు డీఎం సమాధానమిస్తూ ఇవి నా పరిధిలోనివి కావని ఉన్నతాధికారుల పరిధిలోనివని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు వచ్చేవరకు మా ఆందోళన ఆగదని టీఎంయూ నాయకులు స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు శుక్రవారం మెదక్‌ డిపోకు వచ్చి కార్మికులతో మరోమారు చర్చలు జరుపుతారని విశ్వసనీయ సమాచారం. 

సహాయ నిరాకరణే 
అకారణంగా 65 మంది కార్మికులకు ఇచ్చిన చార్జిమెమోలను వెంటనే ఉప సంహరించుకోవాలి. అదేవిధంగా టీమ్‌ డ్రైవర్లపై వేధింపులు బేషరతుగా మానుకోవాలి. కార్మికుల్లో ఎవరికి ఆపద వచ్చినా ఆరోగ్యం బాగలేకపోయిన సెలవులు మంజూరు చేయాలి. వాటితో పాటు మరికొన్ని న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తేనే విధుల్లో చేరుతాం లేకుంటే డీఎం మొండి వైఖరికి నిరసనగా సహాయ నిరాకరణ చేయక తప్పదు. 
– టీఎంయూ డిపో సెక్రెటరి శాఖయ్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement